భారత్ భిన్న సంస్కృతులకు నిలయం: స్పీకర్
భూపాలపల్లి: అద్భుతమైన సంప్రదాయాలు భారత దేశం సొత్తని రాష్ట్ర శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పట్టణంలోని రాంనగర్లో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన తీజ్ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్పీకర్ మాట్లాడుతూ భారత దేశం భిన్న సంస్కృతులకు నిలయమన్నారు. బంజార యువతులకు పెళ్లిళ్లు కావాలని, జీవితం పచ్చగుండాలని కోరుకుంటూ తొమ్మిది రోజులపాటు నియమ నిష్టలతో జరుపుకునే మహా పండుగే తీజ్ అని అన్నారు.
అధునిక సమాజంలో కూడా ఇలాంటి సంప్రదాయాలను కాపాడుతున్న లంబాడీ యువతులను అభినందించారు. గోధుమ గింజలకు పద్దతి ప్రకారం నీరు పోస్తుంటే పచ్చదనం సంతరించుకున్నట్లు మనిషి కూడా పద్దతి ప్రకారం నడుచుకుంటే జీవితం పచ్చగానే ఉంటుందన్న నీతిని ఈ పండుగ తెలియజేస్తుందని ఆయన అన్నారు. ఈ యువతులకు సేవాలాల్ మరియమ్మ దీవెనలు ఉండాలని వేడుకున్నారు. యువతులతో కలిసి మధుసూదనాచారి బుట్టను తలపై పెట్టుకుని పాల్గొన్నారు. ఈ సందర్భంగా లంబాడ మహిళలు, యువతులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఇందులో సేవాలాల్ సంఘం సభ్యులు కూడా పాల్గొన్నారు.