breaking news
burial land
-
‘ధర్మస్థళ’ కేసులో దొరకని అవశేషాలు
బెంగళూరు: కర్ణాటకలోని ధర్మస్థళలో జరిగిన సామూహిక ఖననం కేసులో మొదటి రెండు ప్రాంతాల్లో మానవ అవశేషాలకు సంబంధించిన ఆధారాలు లభించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పుడు మూడవ ప్రదేశంలో తవ్వకాలు ప్రారంభించింది. 1995 నుంచి 2014 మధ్యకాలంలో ధర్మస్థళలో పనిచేశానని, మహిళలు, మైనర్లతో సహా అనేక మృతదేహాలను అక్కడ ఖననం చేశానని మాజీ పారిశుధ్య కార్మికుడు చెప్పడం, ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయడం తెలిసిందే. కార్మికుడు తెలిపిన 15 స్థావరాల వివరాల ఆధారంగా సిట్ ఇప్పటివరకు రెండు ప్రదేశాల్లో తవ్వకాలు చేసింది. ఆ రెండు ప్రదేశాల్లోనూ ఎలాంటి మానవ అవశేషాలు కనిపించలేదు. నేత్రావతి నది వెంబడి ఉన్న మొదటి ప్రదేశంలో మంగళవారం తవ్వకాలు నిర్వహించారు. జేసీబీని ఉపయోగించి లోతుగా తవ్వినప్పటికీ ఎలాంటి అవశేషాలు దొరకలేదు. రెండవ స్థలం కూడా అలాగే ఖాళీగా కనిపించింది. ప్రస్తుతం మూడో ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నాయి. కార్మికుడు చెప్పిన 15 ప్రదేశాల్లో ఎనిమిది నేత్రావతి నది ఒడ్డున, నాలుగు ప్రదేశాలు నదికి సమీపంలోని హైవే పక్కన ఉన్నాయి. 13వ స్థలం నేత్రావతిని ఆజుకురికి కలిపే రహదారిపై, మిగిలిన రెండు హైవే సమీపంలోని కన్యాడి ప్రాంతంలో ఉన్నాయి.చీఫ్ మార్పు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం: హోంమంత్రి ఈ కేసు దర్యాప్తులో సిట్ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రణబ్ మొహంతీని మార్చే విషయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేయడానికి డైరెక్టర్ జనరల్ ర్యాంకుల అధికారుల జాబితాలో మొహంతీ పేరు కూడా ఉండటంతో.. మార్పు విషయమై మీడియా మంత్రిని ప్రశ్నించింది. కేంద్రంలో ఉండి కూడా ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించే అవకాశం ఆయనకు ఉంటుందని, ఆయనను కొనసాగించాలా? లేదా మరొకరిని నియమించాలా? అనే విషయం రాష్ట్ర ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. చట్టం, నియమాలు అనుమతిస్తే ఆయన అక్కడే కొనసాగుతారని, లేదంటే అదే హోదా కలిగిన అధికారిని నియమిస్తామని పరమేశ్వర స్పష్టం చేశారు. సిట్ దర్యాప్తు గురించి ప్రశ్నించగా.. ‘ప్రస్తుతం ఎలాంటి వ్యాఖ్యలు చేయను. దర్యాప్తు పూర్తయి నివేదిక అందిన తరువాత మాట్లాడతాను’అని హోంమంత్రి తెలిపారు. -
అలనాటి అద్భుతం.. 5,600 ఏళ్ల నాటి సమాధుల దిబ్బ
కొత్త రాతియుగానికి చెందిన సమాధుల దిబ్బ ఒకటి స్పెయిన్‌లో వెలుగు చూసింది. 5,600 ఏళ్ల నాటి ఈ కట్టడంలో అత్యంత భారీ పరిమాణంలో ఉన్న 32 ఏక శిలలను ఉపయోగించడం విశేషం! అవి ఒక్కోటీ కనీసం రెండు జెంబో జెట్ విమానాలంత తూగుతాయట. కొత్త రాతియుగం నాటి అద్భుతంగా చెప్పుకునే బ్రిటన్‌లోని స్టోన్‌హెంజ్‌లో వాడిన రాళ్లకంటే ఇవి పరిమాణంలో చాలా పెద్దవి. వీటిలో అతి పెద్ద రాయి అయితే ఏకంగా 150 టన్నుల బరువుంది. ఇది అతి పెద్ద జీవి అయిన నీలి తిమింగలం బరువుతో సమానం. స్టోన్‌హెంజ్‌లోని అతి పెద్ద శిల కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ! ఇక 32 రాళ్లూ కలిపి 1,140 టన్నులుంటాయట. ఇవి సగటున 25 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పుతో ఉన్నాయి. ఇది దక్షిణ స్పెయిన్‌లోని మెంగా ప్రాంతంలో ఒక చిన్న గుట్టపై ఉన్న ఈ కట్టడాన్ని మెంగా డోల్మెన్గా పిలుస్తున్నారు. అంటే సమాధుల దిబ్బ అని అర్థం. అయితే ఇది సమాధి కాకపోవచ్చని, బహుశా ప్రార్థనా స్థలం కావచ్చని కూడా ఒక అభిప్రాయముంది. నిర్దిష్టమైన వరుసలో రాళ్లను నిటారుగా నిలిపి, వాటిపై రాళ్లను పరచడం ద్వారా దీన్ని నిర్మించారు. ఇంత భారీ శిలలను గుట్టపైకి తీసుకెళ్లేంతటి ఇంజనీరింగ్ పరిజ్ఞనం ఆనాటి మనుషులకు ఎలా తెలుసన్నది అంతుచిక్కడం లేదన్నారు స్పెయిన్‌లోని సెవిల్లే యూనివర్సిటీ పూర్వచరిత్ర విభాగ ప్రొఫెసర్ లియొనార్డో గ్రాకా సంజున్. దీనిపై వెలువరించిన పరిశోధన పత్రానికి ఆయన సహ రచయిత. ఈ పేపర్‌ను జర్నల్ సైన్స్‌లో తాజాగా ప్రచురించారు. ‘‘ఇది ప్రపంచంలోని పురాతన రాతి కట్టడాల్లోకెల్లా అతి గొప్ప అద్భుతం. కొత్త రాతియుగపు మానవుల శాస్త్ర సాంకేతిక ప్రజ్ఞకు అత్యుత్తమ తార్కాణం’’ అని పరిశోధన బృందం అంటోంది. ‘‘మనిషి అప్పుడప్పుడే వ్యవసాయం నేర్చుకుంటున్నాడు. అన్ని అవసరాలకూ రాతినే వాడుతున్నాడు. లోహపు పనిముట్ల కాలం ఇంకా రాలేదు. మనిషి కనీసం భాష కూడా నేర్వని కాలమది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే ఈ డోల్మెన్ నిర్మాణం ఎంత గొప్ప ఘనతో అర్థమవుతుంది’’ అని చెప్పుకొచి్చంది. వారికి అప్పటికే రాళ్ల లక్షణాలు, కోణాలతో పాటు భౌతిక శాస్త్రం గురించిన అవగాహన కూడా ఉండి ఉంటుందని సైంటిస్టులు అంటున్నారు.కచ్చితమైన కొలతలు..ఈ నిర్మాణంలో చుట్టూ నిటారుగా పేర్చిన రాళ్లు లోపలివైపుకు నిర్దిష్ట కోణంలో వాలి ఉన్నాయి. దాంతో లోపలి ఖాళీ భాగం కింద విశాలంగా, పైకప్పుకు వెళ్లేకొద్దీ చిన్నగా ఉంది. వాటిపై ఐదు భారీ రాళ్లను పైకప్పుగా పరిచారు. ఎండ, వాన, చలి వంటివాటిని తట్టుకునేందుకు వీలుగా రాళ్ల మధ్య దట్టమైన మట్టి పూత పూశారు. ‘‘కొలతలన్నీ కచ్చితత్వంతో కూడుకుని ఉన్నాయి. ఇలా కట్టాలంటే సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అనేక పరికరాలు కూడా తప్పనిసరి’’ అని పరిశోధన బృందం చెప్పుకొచి్చంది. నిర్మాణంలో వాడిన రాళ్లను అక్కడికి 850 మీటర్ల దూరంలోని క్వారీ నుంచి తొలిచి తరలించినట్టు తేల్చారు. -
సమాధుల భూమి కోసం ర్యాలీ
రాజమండ్రి సిటీ: క్రైస్తవుల సమాధుల నిర్మాణం కోసం భూమి కేటాయించాలని క్రైస్తవ సంఘాలు ర్యాలీకి దిగాయి. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పట్టణంలో ఈ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో నగరంలోని పలు క్రైస్తవ సంఘాలు పాల్గొన్నాయి. సమాధుల నిర్మాణానికి ప్రభుత్వం వెంటనే తమకు భూమి కేటాయించాలని మత పెద్దలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.