అలనాటి అద్భుతం.. 5,600 ఏళ్ల నాటి సమాధుల దిబ్బ | 5600 year old burial chamber In Spain | Sakshi
Sakshi News home page

అలనాటి అద్భుతం.. 5,600 ఏళ్ల నాటి సమాధుల దిబ్బ

Aug 25 2024 11:19 AM | Updated on Aug 25 2024 11:19 AM

5600 year old burial chamber In Spain

5,600 ఏళ్ల నాటి సమాధుల దిబ్బ 

స్పెయిన్‌లో కొత్త రాతియుగపు ఆనవాలు 

ఒక్కోటీ రెండు విమానాల బరువున్న భారీ రాళ్లతో నిర్మాణం

కొత్త రాతియుగానికి చెందిన సమాధుల దిబ్బ ఒకటి స్పెయిన్‌లో వెలుగు చూసింది. 5,600 ఏళ్ల నాటి ఈ కట్టడంలో అత్యంత భారీ పరిమాణంలో ఉన్న 32 ఏక శిలలను ఉపయోగించడం విశేషం! అవి ఒక్కోటీ కనీసం రెండు జెంబో జెట్‌ విమానాలంత తూగుతాయట. కొత్త రాతియుగం నాటి అద్భుతంగా చెప్పుకునే బ్రిటన్‌లోని స్టోన్‌హెంజ్‌లో వాడిన రాళ్లకంటే ఇవి పరిమాణంలో చాలా పెద్దవి. వీటిలో అతి పెద్ద రాయి అయితే ఏకంగా 150 టన్నుల బరువుంది. ఇది అతి పెద్ద జీవి అయిన నీలి తిమింగలం బరువుతో సమానం. స్టోన్‌హెంజ్‌లోని అతి పెద్ద శిల కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ! ఇక 32 రాళ్లూ కలిపి 1,140 టన్నులుంటాయట. ఇవి సగటున 25 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పుతో ఉన్నాయి. ఇ

ది దక్షిణ స్పెయిన్‌లోని మెంగా ప్రాంతంలో ఒక చిన్న గుట్టపై ఉన్న ఈ కట్టడాన్ని మెంగా డోల్మెన్‌గా పిలుస్తున్నారు. అంటే సమాధుల దిబ్బ అని అర్థం. అయితే ఇది సమాధి కాకపోవచ్చని, బహుశా ప్రార్థనా స్థలం కావచ్చని కూడా ఒక అభిప్రాయముంది. నిర్దిష్టమైన వరుసలో రాళ్లను నిటారుగా నిలిపి, వాటిపై రాళ్లను పరచడం ద్వారా దీన్ని నిర్మించారు. ఇంత భారీ శిలలను గుట్టపైకి తీసుకెళ్లేంతటి ఇంజనీరింగ్‌ పరిజ్ఞనం ఆనాటి మనుషులకు ఎలా తెలుసన్నది అంతుచిక్కడం లేదన్నారు స్పెయిన్‌లోని సెవిల్లే యూనివర్సిటీ పూర్వచరిత్ర విభాగ ప్రొఫెసర్‌ లియొనార్డో గ్రాకా సంజున్‌. దీనిపై వెలువరించిన పరిశోధన పత్రానికి ఆయన సహ రచయిత. ఈ పేపర్‌ను జర్నల్‌ సైన్స్‌లో తాజాగా ప్రచురించారు. 

‘‘ఇది ప్రపంచంలోని పురాతన రాతి కట్టడాల్లోకెల్లా అతి గొప్ప అద్భుతం. కొత్త రాతియుగపు మానవుల శాస్త్ర సాంకేతిక ప్రజ్ఞకు అత్యుత్తమ తార్కాణం’’ అని పరిశోధన బృందం అంటోంది. ‘‘మనిషి అప్పుడప్పుడే వ్యవసాయం నేర్చుకుంటున్నాడు. అన్ని అవసరాలకూ రాతినే వాడుతున్నాడు. లోహపు పనిముట్ల కాలం ఇంకా రాలేదు. మనిషి కనీసం భాష కూడా నేర్వని కాలమది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే ఈ డోల్మెన్‌ నిర్మాణం ఎంత గొప్ప ఘనతో అర్థమవుతుంది’’ అని చెప్పుకొచి్చంది. వారికి అప్పటికే రాళ్ల లక్షణాలు, కోణాలతో పాటు భౌతిక శాస్త్రం గురించిన అవగాహన కూడా ఉండి ఉంటుందని సైంటిస్టులు అంటున్నారు.

కచ్చితమైన కొలతలు..
ఈ నిర్మాణంలో చుట్టూ నిటారుగా పేర్చిన రాళ్లు లోపలివైపుకు నిర్దిష్ట కోణంలో వాలి ఉన్నాయి. దాంతో లోపలి ఖాళీ భాగం కింద విశాలంగా, పైకప్పుకు వెళ్లేకొద్దీ చిన్నగా ఉంది. వాటిపై ఐదు భారీ రాళ్లను పైకప్పుగా పరిచారు. ఎండ, వాన, చలి వంటివాటిని తట్టుకునేందుకు వీలుగా రాళ్ల మధ్య దట్టమైన మట్టి పూత పూశారు. ‘‘కొలతలన్నీ కచ్చితత్వంతో కూడుకుని ఉన్నాయి. ఇలా కట్టాలంటే సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అనేక పరికరాలు కూడా తప్పనిసరి’’ అని పరిశోధన బృందం చెప్పుకొచి్చంది. నిర్మాణంలో వాడిన రాళ్లను అక్కడికి 850 మీటర్ల దూరంలోని క్వారీ నుంచి తొలిచి తరలించినట్టు తేల్చారు.

  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement