వానొచ్చింది.. వరద ముంచింది...
జడివాన జిల్లాను ముంచెత్తింది. విడవకుండా కురుస్తున్న వర్షంతో వాన చినుకులు వరదగా మారి ప్రతాపం చూపాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్షం నీరు ఒంగోలును చుట్టుముట్టింది. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక ఎక్కడ చూసినా వర్షం నీరే దర్శనమిస్తోంది. పలు రహదారుల మీదుగా వాగులు ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించాయి. ఇటీవల వరకు వర్షం కోసం ఎదురుచూసిన ప్రజలకు కుంభవృష్టి ఇబ్బందులు తెచ్చింది. వాన విడవకుంటే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
జిల్లాలో 40.3 మిల్లీమీటర్ల సగటు వర్షం
ఆరు ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకుపైగా వర్షం
ఒంగోలు టౌన్ : అల్పపీడన ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సగటు వర్షపాతం 40.3 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఆరు ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడం విశేషం. ప్రాంతాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు ఈవిధంగా ఉన్నాయి. ఒంగోలు 138.8, టంగుటూరు 133.4, కొత్తపట్నం 102.8, నాగులుప్పలపాడు 96.4, చీమకుర్తి 84.2, మద్దిపాడు 180.2, సంతనూతలపాడు 149.4, అద్దంకి 45.4, కొరిశపాడు 45.2, జే పంగులూరు 8.4, బల్లికురవ 7.2, సంతమాగులూరు 3.2, మార్టూరు 12.2, యద్దనపూడి 20, చీరాల 14.4, వేటపాలెం 13, చినగంజాం 11.4, పర్చూరు 51.8, ఇంకొల్లు 20.2, కారంచేడు 32.2, కందుకూరు 68.8, గుడ్లూరు 10.4, వలేటివారిపాలెం 13.8, పొన్నలూరు 50, కొండపి 62.6, జరుగుమల్లి 105.4, సింగరాయకొండ 96.8, ఉలవపాడు 58, లింగసముద్రం 12.2, కనిగిరి 12.2, హనుమంతునిపాడు 9.8, పామూరు 7.2, వెలిగండ్ల 12.6, సీఎస్‌పురం 5.2, పీసీపల్లి 12.6, పొదిలి 39.6, కొనకనమిట్ల 20.4, మర్రిపూడి 42.6, దర్శి 42.0, తాళ్లూరు 90.2, ముండ్లమూరు 55.2, దొనకొండ 48.2, కురిచేడు 30, తర్లుపాడు 14.2, మార్కాపురం 32.2, దోర్నాల 19.2, పెద్దారవీడు 20.6, యర్రగొండపాలెం 15.2, త్రిపురాంతకం 7.4, పుల్లలచెరువు 21.6, గిద్దలూరు 13.0, రాచర్ల 5.4, కొమరోలు 9.2, బేస్తవారపేట 8.6, కంభం 6.8, అర్ధవీడులో 11 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నవంబర్‌లో 143.7 మిల్లీమీటర్ల సగటు వర్షానికిగాను ఇప్పటి వరకు 96.5 మిల్లీమీటర్లు నమోదైంది.
నాలుగు గేట్ల ఎత్తివేత
18,500 క్యూసెక్కుల నీరు విడుదల
మద్దిపాడు : గుండ్లకమ్మ రిజర్వాయర్ పైభాగంలో విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో దోర్నపువాగు, చిలకలేరు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 13,718 క్యూసెక్కుల నీరు గుండ్లకమ్మ నదిలో వదులుతుండగా సాయంత్రం 6 గంటల నుంచి నీటి ఉధృతి పెరగడంతో ఎక్కువగా విడుదల చేస్తున్నారు. రాత్రి 9.30 గంటల సమయంలో ప్రాజెక్టు నాలుగు గేట్ల ద్వారా 18,500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు ఏఈ కిరణ్ తెలిపారు. నాగులుప్పలపాడు మండలంలోని మద్దిరాలపాడు, చదలవాడ మధ్య ఉన్న చీరాల రోడ్డును పూర్తిగా మూసివేసినట్లు పేర్కొన్నారు. నీటి ఉధృతి 15వ తేదీ ఉదయానికి తగ్గవచ్చన్నారు.