Bus road accident
-
ఎదురెదురుగా ఢీకొన్న ఆర్టీసీ బస్సులు
కొవ్వూరు: దొమ్మేరు గ్రామ శివారున రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో 26 మంది గాయపడ్డారు. వివరాలివీ.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి రాజమహేంద్రవరం వస్తున్న పల్లె వెలుగు బస్సును.. కొవ్వూరు నుంచి ఏలూరు వెళ్తు మరో పల్లె వెలుగు బస్సు ఢీకొంది. లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో రెండు బస్సుల ముందు భాగాలూ దెబ్బ తిన్నాయి. ప్రమాదానికి గురైన రెండు బస్సులూ కొవ్వూరు డిపోకు చెందినవే. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన 18 మందికి కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం ఇళ్లకు పంపించారు. మరో ముగ్గురికి కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో కేవీ సాగర్ (కొవ్వూరు), వి.మంగయమ్మ, ఎం.శేషారెడ్డి (ఏలూరు), రాజయ్య (దేవరపల్లి మండలం యాదవోలు), సీహెచ్ రామకృష్ణ (బంగారమ్మపేట), తుపాకుల దుర్గారావు (చింతూరు) తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో లారీ ముందు వెళ్తున్న మోటార్ సైక్లిస్టు బస్సు ముందు చక్రంలో పడిపోయారు. అయితే, అదృష్టవశాత్తూ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఆయన మోటార్ సైకిల్ నుజ్జునుజ్జయ్యింది. హైవే పెట్రోలింగ్ ఏఎస్సై జీఆర్కే గంగాధర్ ఆధ్వర్యాన క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రికి తరలించారు. కొవ్వూరు ఆర్టీసీ డిపో మేనేజర్ వైవీవీఎన్ కుమార్ స్థానిక ప్రభుత్వాసుపత్రికి చేరుకుని, క్షతగాత్రులను పరామర్శించారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సేవలందించేందుకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు నగళ్లపాటి శ్రీనివాస్, వరిగేటి సుధాకర్ సహకరించారు. సూపరింటెండెంట్ సాయికిరణ్ వెంటనే ఆసుపత్రికి చేరుకుని వైద్య సేవలను పర్యవేక్షించారు. పట్టణ ఎస్సై బి.దుర్గాప్రసాద్ క్షతగాత్రులతో మాట్లాడి, ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలి : మంత్రి వనిత ఈ ప్రమాదంపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ, పోలీసులు అధికారులను ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టమూ లేకపోయినప్పటికీ 26 మంది గాయపడటం దురదృష్టకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. -
పెళ్లి బృందం వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
అంతా గాఢ నిద్రలో ఉండగా.. ఓ కుదుపు జీవితాన్ని తల్లకిందులు చేసింది. రెప్పపాటులో ఊహకందని విషాదాన్ని మిగిల్చింది. కొద్ది సేపటి వరకు ఆనందంగా గడిపిన వారంతా విగత జీవులుగా మారారు. మరికొద్ది దూరంలో గమ్యం చేరుకోవాల్సిన వారు.. తిరిగిరాని లోకాలకు మరలిపోయారు. చిమ్మ చీకటిలో తప్పెవరిది? అని వెతుకాలాడే కంటే.. అతి వేగమే బాధిత కుటుంబాలకు సమాధానం చెప్పాల్సి ఉంది. – బరంపురం గంజాం జిల్లాలోని దిగపండి సమీపంలోని కెముండి కళాశాల ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 59వ జాతీయ రహదారిలో బరంపురం నగరానికి కేవలం 16 కిలోమీటర్ల సమీపంలో ఎదురెదురుగా వస్తున్న 2బస్సులు బలంగా ఢీకాన్నాయి. ఈ దుర్ఘటనలో 12మంది ప్రయాణికులు అక్కడిక్కడే చెందగా, మరో 15మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కలెక్టర్ దివ్యజ్వోతి పరిడా, బరంపురం ఎస్పీ సరవణ్ వివేక్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, ఒడ్రాప్ బృందం సాయంతో క్షతగాత్రులను తొలుత దిగపండి ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రికి, అక్కడి నుంచి బరంపురం ఎంకేసీజీకి తరలించారు. దీనిపై కలెక్టర్ పరిడా, ఎస్పీ వివేక్, బాధిత ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడారి నుంచి బరంపురం మీదుగా భువనేశ్వర్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సు.. ఆదివారం రాత్రి 12గంటల సమయంలో దిగపండి చేరుకుంది. బరంపురం నగరంలోని హతిబొందొ వీధికి చెందిన పెళ్లి బృందం ప్రైవేటు బస్సులో దిగపండి సమీపంలో జరిగిన వివాహానికి హాజరై, తిరుగు పయనమైంది. రెండు బస్సులూ కెముండి కళాశాల మలుపులో ఎదురెదురుగా వేగంగా వస్తూ ఢీకొన్నాయి. ప్రయాణికుల హాహాకారాలు.. అప్పటి వరకు చిమ్మ చీకట్లో నిశ్శబ్ధంగా ఉన్న ఆ ప్రాంతం.. ఒక్కసారిగా ప్రయాణికుల ఆక్రమందనలతో దద్దరిల్లింది. కొంతమంది హాహాకారాలు చేస్తూ.. ప్రాణ భయంతో బస్సు నుంచి కిందకు దూకి, పరుగులు తీశారు. ప్రయాణికుల్లో 12మంది అక్కడికక్కడే మృతిచెందగా, మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న బరంపురం, దిగపండి అగ్నిమాపక, ఓడ్రాప్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని, బస్సులో చిక్కుకున్న మృతదేహాలు, క్షతగ్రాతులను బయటకు తీశారు. తొలుత దిగపండి పీహెచ్‌సీకి తరలించి, ప్రాథమిక వైద్యం అందించారు. కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో 108 అంబులెన్స్‌లో మెరుగైన చికిత్స నిమిత్తం బరంపురం ఎంకేసీజీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కటక్ ఆస్పత్రికి రిఫర్ చేశామని ఎంకేసీజీ సూపరింటెండెంట్ సంతోష్‌కుమార్ మిశ్రా తెలిపారు. ఘటనపై దిగపండి పోలీసులు కేసు నమోదు, చేసి దర్యాప్తు చెస్తున్నారు. ట్రక్క ఢీకొని యువకుడు.. జయపురం: ట్రక్కు ఢీకొని యువకుడు మృతిచెందిన ఘటనలో బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని బంధువులు, గ్రామస్తులు, ఆందోళనకు దిగారు. జయపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి ఘటనా స్థలానికి చేరుకొని, ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ట్రక్కు యజమానితో చర్చించి, పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై బొయిపరిగుడ పోలీసు అధికారి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ–రాంచీ 326 జాతీయ రహదారి మల్కన్‌గిరి–బొయిపరిగుడ మార్గంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. మాచ్‌ఖండ్ పోలీసు స్టేషన్ పరిధి ఖొడాగొజి గ్రామానికి చెందిన చంద్ర ఖిలో(28) శనివారం సాయంత్రం ముదులిగుడ గ్రామంలోని తన బంధువుల ఇంటికి వ్యక్తిగత పనిపై వెళ్లాడు. ఆదివారం సాయంత్రం తన గ్రామానికి బైక్‌పై తిరిగి వస్తుండగా బొయిపరిగుడకు 2 కిలోమీటర్ల దూరంలో బొగ్గు లోడుతో ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొంది. ప్రమాదంలో ఖిలో ట్రక్కు చక్రం కిందపడి, అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే ట్రక్కు డ్రైవర్ వెంటనే బొయిపరిగుడ పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. ప్రమాద విషయం తెలుసుకున్న మృతుడు బంధువులు, ముదులిగుడ గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జాతీయ రహదారిపై బైఠాయించి, రస్తారోకో చేపట్టారు. దీంతో అటుగా వెళ్తే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించేందుకు వారంతా అంగీకరించలేదు. ఈ మేరకు బొయిపరిగుడ తహసీల్దార్, జయపురం ఎస్డీపీఓ ఆందోళనకారులతో చర్చించారు. ట్రక్క యజమానితో చర్చించి తగిన పరిహారం ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో వారంతా శాంతించారు. -
బస్సు ప్రమాదంలో 11 మంది మృతి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించారు. మైసూరు నుంచి మంగళూరుకు వెళ్తున్న బస్సు ఉడుపి– చిక్కమగళూరు ఘాట్ రోడ్డు కార్కళ తాలూకా మాళె సమీపంలో శనివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. బస్సు ఘాట్ రోడ్డులో వెళ్తుండగా అదుపు తప్పి కుడివైపు బండరాళ్లను అతివేగంతో బలంగా ఢీకొట్టుకుంటూ దూసుకెళ్లింది. బస్సు ముందుభాగం తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఉడుపి జిల్లాలోని మణిపాల్, కార్కళలోని ఆస్పత్రులకు తరలించారు. మైసూరు జిల్లాకు చెందిన ఈ టూరిజం బస్సులో మొత్తం 35 మంది పర్యాటకులు ఉన్నారు. మైసూరుకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగులను విహార యాత్రకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. -
36 మంది జలసమాధి
బహరాంపూర్: పశ్చిమ బెంగాల్లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు వంతెన పై నుంచి కాలువలోకి పడిపోవడంతో పది మంది మహిళలు సహా మొత్తం 36 మంది దుర్మరణం చెందారు. బస్సు నదియా జిల్లాలోని షికార్పూర్ నుంచి మాల్దాకు వెళ్తుండగా ముర్షీదాబాద్ జిల్లాలోని దౌల్తాబాద్ పరిధిలో ఆరు గంటలకు ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు అందించేందుకు పోలీసులు ఆలస్యంగా వచ్చారంటూ స్థానికులు నిరసన చేపట్టి, ఓ పోలీస్ వాహనానికి నిప్పంటించారు. ఆ మంటలను ఆర్పడానికి వచ్చిన అగ్నిమాపక యంత్రంపైనా వారు దాడి చేశారు. కాలువలోని బస్సును గుర్తించి క్రేన్ల సాయంతో బయటకు తీయడానికి ఎనిమిది గంటలు పట్టిందని అధికారులు చెప్పారు. 32 మృతదేహాలను సిబ్బంది వెలికితీయగా, మరో రెండు నీటిలో కొట్టుకుపోయాయి. ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సీఎం మమతా బెనర్జీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పొగమంచు లేదా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే దుర్ఘటన జరిగి ఉండొచ్చని ఆమె అన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. 1 లక్ష, స్పల్ప గాయాలైన వారికి రూ. 50 వేల నష్టపరిహారాన్ని ఆమె ప్రకటించారు. -
93 బస్సులు సీజ్
ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారుల దాడులు సాక్షి నెట్వర్క్: మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు దుర్ఘటన నేపథ్యంలో రాష్ట్ర రవాణాశాఖలో కదలిక వచ్చింది. ఇన్నిరోజులుగా చోద్యం చూస్తున్న ఆర్టీఏ అధికారులు.. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై దాడులు ప్రారంభించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిని సీజ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 93 బస్సుల్ని సీజ్ చేసి, 70 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఆందోళనకర విషయం ఏమిటంటే.. తనిఖీ చేసిన బస్సుల్లో చాలా వాటిల్లో అగ్నిప్రమాదాల నియంత్రణకు ఏర్పాట్లు లేవు. ప్రథమ చికిత్స బాక్సులు ఒక్క బస్సులోనూ కనిపించలేదు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ రింగురోడ్డు, సాగర్ రింగురోడ్డు, చింతలకుంట సమీపంలో 8 బస్సులను సీజ్ చేశారు. అందులో కేశినేని, ఎస్వీఆర్ఎస్, శ్రీకృష్ణ, గౌతమి ట్రావెల్స్‌తోపాటు కర్ణాటకకు చెందిన 3 బస్సులున్నాయి. విశాఖ శివార్లలో శుక్రవారం ఉదయంనుంచే తనిఖీలు చేపట్టిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 18 బస్సుల్ని సీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 7 బస్సులను సీజ్ చేశారు. 21 బస్సుల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కోనసీమలో 13 బస్సులపై కేసులు నమోదు చేశారు. విజయనగరం జిల్లాలో 3 బస్సులపై కేసులు నమోదు చేసి, ఒకదాన్ని సీజ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక బస్సును సీజ్ చేసిన అధికారులు.. 24 బస్సులపై కేసులు పెట్టారు. శ్రీకాకుళం జిల్లాలో 3 బస్సుల్ని సీజ్ చేశారు. కృష్ణా, గుంటూరు, ప్రకా శం, నెల్లూరు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో కలిపి 33 బస్సులను సీజ్ చేశారు. దాదాపు 20 బస్సులపై కేసులు పెట్టారు. అనంతపురంలో ఆర్టీఏ అధికారులు 4 బస్సుల్ని సీజ్ చేసినట్లు ప్రకటించారు. కానీ 20కిపైగా బస్సుల్ని స్వాధీనం చేసుకోగా.. ముడుపులు తీసుకుని వదిలేసినట్లు ఆరోపణలొస్తున్నాయి. కర్నూలు జిల్లాలో 12 బస్సులపై కేసులు నమోదు చేయగా.. 4 బస్సుల్ని సీజ్ చేశారు.