బస్సును క్రేన్ల సాయంతో పైకి లాగుతున్న దృశ్యం
బహరాంపూర్: పశ్చిమ బెంగాల్‌లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు వంతెన పై నుంచి కాలువలోకి పడిపోవడంతో పది మంది మహిళలు సహా మొత్తం 36 మంది దుర్మరణం చెందారు. బస్సు నదియా జిల్లాలోని షికార్‌పూర్ నుంచి మాల్దాకు వెళ్తుండగా ముర్షీదాబాద్ జిల్లాలోని దౌల్తాబాద్ పరిధిలో ఆరు గంటలకు ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు అందించేందుకు పోలీసులు ఆలస్యంగా వచ్చారంటూ స్థానికులు నిరసన చేపట్టి, ఓ పోలీస్ వాహనానికి నిప్పంటించారు.
ఆ మంటలను ఆర్పడానికి వచ్చిన అగ్నిమాపక యంత్రంపైనా వారు దాడి చేశారు. కాలువలోని బస్సును గుర్తించి క్రేన్ల సాయంతో బయటకు తీయడానికి ఎనిమిది గంటలు పట్టిందని అధికారులు చెప్పారు. 32 మృతదేహాలను సిబ్బంది వెలికితీయగా, మరో రెండు నీటిలో కొట్టుకుపోయాయి. ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సీఎం మమతా బెనర్జీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పొగమంచు లేదా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే దుర్ఘటన జరిగి ఉండొచ్చని ఆమె అన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ. 1 లక్ష, స్పల్ప గాయాలైన వారికి రూ. 50 వేల నష్టపరిహారాన్ని ఆమె ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment