ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారుల దాడులు
సాక్షి నెట్‌వర్క్: మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు దుర్ఘటన నేపథ్యంలో రాష్ట్ర రవాణాశాఖలో కదలిక వచ్చింది. ఇన్నిరోజులుగా చోద్యం చూస్తున్న ఆర్టీఏ అధికారులు.. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై దాడులు ప్రారంభించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిని సీజ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 93 బస్సుల్ని సీజ్ చేసి, 70 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఆందోళనకర విషయం ఏమిటంటే.. తనిఖీ చేసిన బస్సుల్లో చాలా వాటిల్లో అగ్నిప్రమాదాల నియంత్రణకు ఏర్పాట్లు లేవు.
ప్రథమ చికిత్స బాక్సులు ఒక్క బస్సులోనూ కనిపించలేదు. హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ రింగురోడ్డు, సాగర్ రింగురోడ్డు, చింతలకుంట సమీపంలో 8 బస్సులను సీజ్ చేశారు. అందులో కేశినేని, ఎస్‌వీఆర్‌ఎస్, శ్రీకృష్ణ, గౌతమి ట్రావెల్స్‌తోపాటు కర్ణాటకకు చెందిన 3 బస్సులున్నాయి. విశాఖ శివార్లలో శుక్రవారం ఉదయంనుంచే తనిఖీలు చేపట్టిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 18 బస్సుల్ని సీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 7 బస్సులను సీజ్ చేశారు.
21 బస్సుల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కోనసీమలో 13 బస్సులపై కేసులు నమోదు చేశారు. విజయనగరం జిల్లాలో 3 బస్సులపై కేసులు నమోదు చేసి, ఒకదాన్ని సీజ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక బస్సును సీజ్ చేసిన అధికారులు.. 24 బస్సులపై కేసులు పెట్టారు. శ్రీకాకుళం జిల్లాలో 3 బస్సుల్ని సీజ్ చేశారు. కృష్ణా, గుంటూరు, ప్రకా శం, నెల్లూరు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో కలిపి 33 బస్సులను సీజ్ చేశారు. దాదాపు 20 బస్సులపై కేసులు పెట్టారు. అనంతపురంలో ఆర్టీఏ అధికారులు 4 బస్సుల్ని సీజ్ చేసినట్లు ప్రకటించారు. కానీ 20కిపైగా బస్సుల్ని స్వాధీనం చేసుకోగా.. ముడుపులు తీసుకుని వదిలేసినట్లు ఆరోపణలొస్తున్నాయి. కర్నూలు జిల్లాలో 12 బస్సులపై కేసులు నమోదు చేయగా.. 4 బస్సుల్ని సీజ్ చేశారు.
93 బస్సులు సీజ్
Published Sat, Nov 2 2013 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM
Advertisement
Advertisement