ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సులు
కొవ్వూరు: దొమ్మేరు గ్రామ శివారున రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో 26 మంది గాయపడ్డారు. వివరాలివీ.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి రాజమహేంద్రవరం వస్తున్న పల్లె వెలుగు బస్సును.. కొవ్వూరు నుంచి ఏలూరు వెళ్తు మరో పల్లె వెలుగు బస్సు ఢీకొంది. లారీని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో రెండు బస్సుల ముందు భాగాలూ దెబ్బ తిన్నాయి. ప్రమాదానికి గురైన రెండు బస్సులూ కొవ్వూరు డిపోకు చెందినవే. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన 18 మందికి కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం ఇళ్లకు పంపించారు.
మరో ముగ్గురికి కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో కేవీ సాగర్ (కొవ్వూరు), వి.మంగయమ్మ, ఎం.శేషారెడ్డి (ఏలూరు), రాజయ్య (దేవరపల్లి మండలం యాదవోలు), సీహెచ్ రామకృష్ణ (బంగారమ్మపేట), తుపాకుల దుర్గారావు (చింతూరు) తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో లారీ ముందు వెళ్తున్న మోటార్ సైక్లిస్టు బస్సు ముందు చక్రంలో పడిపోయారు.
అయితే, అదృష్టవశాత్తూ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఆయన మోటార్ సైకిల్ నుజ్జునుజ్జయ్యింది. హైవే పెట్రోలింగ్ ఏఎస్సై జీఆర్‌కే గంగాధర్ ఆధ్వర్యాన క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రికి తరలించారు. కొవ్వూరు ఆర్టీసీ డిపో మేనేజర్ వైవీవీఎన్ కుమార్ స్థానిక ప్రభుత్వాసుపత్రికి చేరుకుని, క్షతగాత్రులను పరామర్శించారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సేవలందించేందుకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు నగళ్లపాటి శ్రీనివాస్, వరిగేటి సుధాకర్ సహకరించారు. సూపరింటెండెంట్ సాయికిరణ్ వెంటనే ఆసుపత్రికి చేరుకుని వైద్య సేవలను పర్యవేక్షించారు. పట్టణ ఎస్సై బి.దుర్గాప్రసాద్ క్షతగాత్రులతో మాట్లాడి, ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మెరుగైన వైద్యం అందించాలి : మంత్రి వనిత
ఈ ప్రమాదంపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ, పోలీసులు అధికారులను ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టమూ లేకపోయినప్పటికీ 26 మంది గాయపడటం దురదృష్టకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment