Private Travels Buses
-
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీ.. విజయవాడ హైవేపై ప్రమాదం
సాక్షి, యాదాద్రి భువనగిరి: జిల్లాలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి దాటాక రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులు ఒకదానిని మరొకటి ఢీ కొట్టాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడగా, పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. చౌటుప్పల్ మండలం గుండ్లబావి వద్ద హైదరాబాద్-విజయవాడ ఎన్‌హెచ్-65 పై ఈ ఘటన జరిగింది. రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సులు మైత్రి ట్రావెల్స్, ఆరంజ్ ట్రావెల్స్ బస్సులుగా నిర్ధారణ అయ్యింది. ఓవర్ టేక్ చేసే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారని ప్రాథమిక విచారణ ద్వారా పోలీసులు వెల్లడించారు. పదహారు మందికి స్వల్ప గాయాలు కాగా, మరో నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలై విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లను చికిత్స కోసం వివిధ ఆస్పత్రులకు తరలించారు. -
బస్సులో రూ.5 కోట్ల విలువైన బంగారం, వెండి బిస్కెట్లు
కర్నూలు: హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో రూ.5.04 కోట్ల విలువైన బంగారు, వెండి బిస్కెట్లు, నగదును ఎస్ఈబీ పోలీసులు పట్టుకున్నారు. కర్నూలు మండలం పంచలింగాల చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిపై ఎస్ఈబీ సీఐ మంజుల, ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం తనిఖీలు నిర్వహిస్తుండగా స్వామి అయ్యప్ప ట్రావెల్స్ బస్సులో సేలం పట్టణానికి చిందిన దేవరాజు, సెల్వరాజు, కుమారవేలు, మేయలాగ మురుగేశన్, కోయంబత్తూరుకు చెందిన వెంకటేశ్‌లకు చెందిన బ్యాగుల్లో 28.5 కేజీల వెండి బిస్కెట్లు, 8.250 కేజీల బంగారు బిస్కెట్లు, రూ.90 లక్షల నగదు బయటపడ్డాయి. పట్టుబడిన వెండి విలువ రూ.18.52 లక్షలు, బంగారం విలువ రూ.3.96 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నగలు, నగదుకు సంబంధించి జీఎస్టీ, ఈ–వే బిల్లు, ట్రావెలింగ్ ఓచర్ వంటివి చూపకపోవడంతో సీజ్ చేసి సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. -
ఒంగోలులో భారీ అగ్నిప్రమాదం
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు నగర శివారులో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన 7 బస్సులు పూర్తిగా దగ్ధమవ్వగా.. ఒక బస్సు పాక్షికంగా దెబ్బతింది. వివరాలు.. ఒంగోలుకు చెందిన వేమూరి సుబ్బారావు అనే వ్యక్తి వేమూరి ట్రావెల్స్, వేమూరి కావేరి ట్రావెల్స్, కావేరి కామాక్షి ట్రావెల్స్, వినోద్ ట్రావెల్స్ అనే పేర్లతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖ, గోవా, షిర్డీలకు బస్సులు నడుపుతుంటారు. కరోనా వల్ల బస్సులు నడపడం కష్టంగా మారిందని.. ఏడాదిన్నర కాలంగా 20 బస్సులను స్థానిక ఉడ్ కాంప్లెక్స్‌లోని తనకున్న 60 సెంట్ల ఖాళీ స్థలంలో పార్కింగ్ చేశాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో బస్సులు నిలిపి ఉన్నచోట ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఒంగోలులోని మూడు ఫైర్ ఇంజన్లు, టంగుటూరు, అద్దంకి నుంచి మరో రెండు ఫైర్ ఇంజన్లు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేశాయి. కానీ అప్పటికే 7 బస్సులు పూర్తిగా దగ్ధమవ్వగా.. ఒక బస్సు మాత్రం పాక్షికంగా దెబ్బతింది. అగ్నిమాపక అధికారులు శ్రీనివాసరావు, వీరభద్రరావు, కేవీకే ప్రసాద్, ఒంగోలు డీఎస్పీ నాగరాజు, తాలూకా సీఐ శ్రీనివాసరెడ్డి తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై ట్రావెల్స్ మేనేజర్ వేమూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కరోనా వల్ల 2020వ సంవత్సరం నుంచి బస్సులను ఉడ్ కాంప్లెక్స్‌లోని తన స్థలంలోనే పార్కింగ్ చేసి ఉంచానని చెప్పారు. అగ్నిమాపక శాఖ అధికారులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. కాగా, బస్సులు పూర్తిగా కాలిపోవడం వల్ల రూ.3.25 కోట్ల నష్టం వాటిల్లినట్లు పోలీసులకు వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశాడు. మంటలు ఎలా చెలరేగాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని.. ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. -
నిలిచిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు
సాక్షి, అమరావతి: కోవిడ్ ఉధృతి నేపథ్యంలో శనివారం నుంచి రాష్ట్రంలో 880 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రాకపోకలు నిలిచిపోయాయి. కరోనా నేపథ్యంలో బస్సుల్లో 50 శాతం సీట్లతోనే నడపాలని నిబంధన విధించడంతో పాటు ప్రజలు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి కనపరచడం లేదు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు తమంతట తాముగానే శనివారం నుంచి 880 బస్సులు తిప్పడాన్ని నిలిపేస్తున్నట్లు రవాణా శాఖకు ముందుగానే తెలియజేశారు. కోవిడ్ నేపథ్యంలో బస్సులను నడపలేమని ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు రవాణా శాఖకు తెలియజేశారు. రవాణా శాఖ కూడా ఈ బస్సులకు సంబంధించిన పాత పన్నులేమైనా చెల్లించాల్సి ఉంటే వాటిని వసూలు చేసింది. ముందస్తుగా రవాణా శాఖకు సమాచారం ఇవ్వడంతో ఆ తిప్పని కాలానికి బస్సులకు పన్ను నుంచి మినహాయింపు పొందడానికి వీలుంటుందని రవాణా శాఖ అధికార వర్గాలు తెలిపారు. -
ప్రైవేటువి 1,100.. ఆర్టీసీవి 0
రాత్రి వేళ హాయిగా విశ్రమించి ప్రయాణించాలని కోరుకునే వారే ఎక్కువ. అందుకే దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లకు డిమాండు ఎక్కువ. కానీ, వాటి సంఖ్య పరిమితం. అన్ని ప్రాంతాలకు రైళ్లు అందుబాటులో లేవు. అందుకే స్లీపర్ బస్సులకు డిమాండ్ బాగా పెరుగుతోంది. బెంగళూరు, ముంబై, వైజాగ్, తిరుపతి లాంటి సుదూర ప్రాంతాలకు స్లీపర్ బస్సుల్లో ప్రయాణాలు ఎక్కువ. ప్రయాణికుల డిమాండును గుర్తించి ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు ఎప్పటికప్పుడు స్లీపర్ బస్సు సర్వీసుల సంఖ్య పెంచుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి నిత్యం వివిధ ప్రాంతాలకు దాదాపు 1,100 స్లీపర్ సర్వీసులు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా టూరిస్ట్ పర్మిట్ తీసుకుని స్టేజి క్యారియర్లుగా తిరుగుతున్న బస్సులతోపాటు, అరుణాచల్‌ప్రదేశ్ లాంటి పర్యాటకులు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని, అక్కడి నుంచే టూరిస్ట్ పర్మిట్ తీసుకుని హైదరాబాద్ కేంద్రంగా తిరుగుతున్న బస్సులు కూడా వీటిలో ఉన్నాయి. అయినా, ప్రయాణికులకు అందుబాటులో ఉంటూ దర్జాగా పరుగుపెడుతూ గల్లా పెట్టెను నింపుకుంటున్నాయి. ఇంత డిమాండ్ ఉండి కూడా స్లీపర్ సర్వీసులు నడపడంలో ఆర్టీసీ చేతులెత్తేసింది. ప్రస్తుతం ఆర్టీసీ వద్ద ఒక్క స్లీపర్ బస్సు కూడా లేదు. సమ్మె తర్వాత కూడా మారని తీరు.. ఆర్టీసీ తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతూ దివాలా దశకు చేరుకున్న తరుణంలో వచ్చి పడిన సమ్మె దాన్ని పూర్తిగా కుదేలు చేసింది. ప్రభు త్వం మేల్కొని దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించి, ఆదా యం పెంచుకునే క్రమంలో కి.మీ.కు 20 పైసలు చొప్పు న చార్జీలు పెంచుకునేందుకు అనుమతించింది. దీంతో రోజువారీ ఆదాయం రూ.2 కోట్ల మేర పెరిగింది. ఇలాం టి సమయంలో కూడా డిమాండ్‌కు తగ్గట్టుగా తనను తాను మార్చుకోవడంలో ఆర్టీసీ విఫలమవుతోంది. దూర ప్రాంతాలకు స్లీపర్ బస్సులు కావాలని ప్రయాణికులు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. నిత్యం అలాంటి సర్వీసులు సీట్లు రిజర్వ్ చేసుకునేందుకు వందలాది మంది ఆర్టీసీని సంప్రదిస్తున్నారు. ‘మా వద్ద అలాంటి బస్సుల్లేవు’అని సింపుల్‌గా సమాధానమిచ్చి సిబ్బంది చేతులు దులుపుకొంటున్నారు. సురక్షిత ప్రయాణంలో ఆర్టీసీతోనే సాధ్యమన్న అభిప్రాయం సాధారణ ప్రయాణికుల్లో ఉంది. అందుకే చాలామంది ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేందుకు మొగ్గుచూపుతారు. కానీ, స్లీపర్ బస్సుల్లేక తప్పని పరిస్థితిలో ప్రైవేటు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. సీఎం భేటీలో ప్రస్తావన వచ్చినా.. ఇటీవల సమ్మె ముగిసేవేళ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో స్లీపర్ బస్సుల అంశం ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఇప్పటికిప్పుడు భారీ ఖర్చు చేసి కొత్త బస్సులు కొనడం కంటే, అందుబాటులో ఉన్న గరుడ బస్సుల్లో కొన్నింటిని స్లీపర్ సర్వీసులుగా మార్చాలని నిర్ణయించారు. సమ్మె అనంతరం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. తొలుత 25 బస్సులను స్లీపర్ సర్వీసులుగా మార్చాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు. కానీ అధికారులు మాత్రం ఇప్పటివరకు అలాంటి కసరత్తే చేయలేదు. సరుకు రవాణా కోసం పాత ఆర్టీసీ బస్సులను బస్‌బాడీ వర్క్‌షాపులో కార్గో సర్వీసులుగా మారుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 50 వరకు బస్సులను కార్గో వాహనాలుగా మార్చేశారు. వెన్నెల సర్వీసులు.. తుక్కుగా మారి.. వెన్నెల పేరుతో ఆర్టీసీ స్లీపర్ బస్సులు నిర్వహించింది. ఇటీవలి వరకు రెండు బస్సులుండేవి. అవి పాతబడి మరమ్మతులు చేస్తే కాని నడిచే పరిస్థితి లేకపోవడంతో వాటిని తుక్కుగా మార్చేశారు. దీంతో ఇప్పుడు ఒక్క స్లీపర్ బస్సు కూడా లేకుండా పోయింది. వృద్ధులు, నడుము నొప్పి, వెన్ను పూస సమస్యలున్నవారు కూర్చుని దూర ప్రాంతాలకు ప్రయాణించలేకపోతున్నారు. వీరు స్లీపర్ బస్సులనే ఎంచుకుంటున్నారు. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు అలాంటి వారిని ఆకర్షించేందుకు స్లీపర్ సర్వీసుల సంఖ్యను పెంచుకుంటున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి మాత్రమే ఆ సర్వీసులు అందుబాటులో ఉండగా.. తాజాగా వరంగల్, కరీంనగర్ లాంటి పట్టణాల నుంచి ప్రారంభిస్తున్నారు. ఇటీవల వరంగల్ నుంచి ఓ ప్రైవేటు సంస్థ బెంగళూరుకు సర్వీసు ప్రారంభించింది. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో ఆర్టీసీ అధికారులు అడ్డుకున్నారు. కానీ చర్యలు తీసుకోవాల్సిన రవాణా శాఖ చేతులెత్తేయడంతో ఆ బస్సు నిండుగా ప్రయాణికులతో దర్జాగా పరుగులు తీస్తోంది. మరికొద్ది రోజుల్లో ప్రైవేటు సంస్థలు స్లీపర్ సర్వీసుల సంఖ్యను 1,500కు పెంచుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి. -
ఆర్టీఏ తనిఖీలు: ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని నాగ్‌పూర్ జాతీయ రహదారిపరై ఆర్టీఏ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఏడు ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు. అలాగే సరైన పత్రాలు లేని రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. -
ఆర్టీఏ తనిఖీలు : ప్రైవేట్ బస్సులపై కేసు నమోదు
హైదరాబాద్ : రాజేంద్రనగర్ గగన్‌పహాడ్ వద్ద మంగళవారం ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 14 ప్రైవేట్ బస్సులపై కేసు నమోదు చేశారు. ఆర్టీఏ అధికారుల తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. -
ఆర్టీఏ దాడులు : ప్రైవేట్ బస్సులపై కేసులు
హైదరాబాద్ : పెద్ద అంబర్‌పేట్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు శనివారం అకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఆరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. -
ఆర్టీఏ తనిఖీలు : 32 బస్సులపై కేసులు నమోదు
హైదరాబాద్ : హయత్‌నగర్‌లో మంగళవారం ఆర్టీఏ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న సుమారు వంద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 32 ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. -
54 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఆర్టీఏ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 54 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేశారు. సదరు ప్రైవేట్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు. -
నాలుగు బస్సులు.. 19 కార్లు సీజ్
హైదరాబాద్ : నగరంలోని పెద్దఅంబర్‌పేట్‌లో ఆర్టీఏ అధికారులు మంగళవారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారి పన్ను చెల్లించని 4 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అధికారులు గుర్తించి... వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని ఆర్టీఏ కార్యాలయానికి తరలించి... సీజ్ చేశారు. అలాగే సరైన పత్రాలు చూపని మరో 22 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కూడా ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే... నగరం నుంచి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికులను తరలిస్తున్న 19 కార్లను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. సదరు కార్లకు అనుమతులు లేవని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. -
ప్రైవేట్ బాదుడు !
సగటు మానవుడికి సంక్రాంతికి ప్రయాణం గగనమైపోయింది. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చిన వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. రైళ్ల రిజర్వేషన్లు దొరకని వారు, జనరల్ బోగీల్లో కిక్కిరిసి కూర్చునే ప్రయాణికులను చూసి ఇదేమి బాధ అని భయపడి బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఆమాంతం టికెట్ ధరను రెండింతలు పెంచేసి ప్రయాణికుల నడ్డివిరుస్తున్నారు. విజయనగరం మున్సిపాలిటీ : పట్టణంలోని బాబామెట్ట కాలనీకి చెందిన విశ్వేశ్వరరావు ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో సెలవు పెట్టాడు. సెలవు మంజూరైందే తడవుగా చిక్కడపల్లిలోని తన రూమ్‌కు వెళ్లి బ్యాగ్ సర్దుకుని భుజానికి తగలించుకున్నాడు. రైల్వేస్టేషన్‌కు వెళ్తే కాలు పెట్టేందుకు వీలు లేని పరిస్థితి. అక్కడి నుంచి నేరుగా బస్‌స్టాండ్‌కు వెళితే అక్కడా అలాగే ఉంది. ఉన్న సర్వీస్‌ల సీట్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నిండిపోగా స్పెషల్ బస్సుల పేరుతో చార్జీలు వడ్డీస్తున్నా అక్కడా సీటు దొరకడం అనుమానమే. దీంతో చేసేదేమి లేక నేరుగా ప్రైవేటు ట్రావెల్స్‌కు వెళ్లిన విశ్వేశ్వరరావు విజయనగరం వెళ్లేందుకు బస్సు ఉందా అని అడిగాడు. అంతే సదరు ట్రావెల్స్ నిర్వాహకుడు రూ. 2 వేలు అవుతుందంటూ ఠక్కున చెప్పాడు. అదేంటి అని అడగకముందే నచ్చితే ఎక్కండి లేకుంటే మీ ఇష్టం. ఇక్కడ నస వద్దు అంటూ సమాధాన మిచ్చాడు. దీంతో చేసేదేమి లేని విశ్వేశ్వరరావు అడిగిన మొత్తం చెల్లించి డొక్కు బస్సులోనే రావాల్సి వచ్చింది. ఇది ఒక్క విశ్వేశ్వరరావు అనుభవమే కాదు... వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల రీత్యా ఉంటూ పండగకు జిల్లాకు వచ్చిన అందరూ ఇలా దోపిడీకి గురయ్యారు. పిల్లాపాపలతో సొంత ఊరు చేరుకున్న వారికి ప్రయాణచార్జీలు నడ్డివిరిచాయి. ప్రయాణానికే వేలల్లో ఖర్చు అయిపోవడంతో వారిలో పండగ సరదా కనిపించడం లేదు. రోజుకో రేటు... జిల్లా కేంద్రనుంచి హైదరాబాద్‌కు ప్రతి రోజూ ఆరు నాన్ ఏసీ బస్‌లు, మూడు ఏసీ బస్‌లను ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలు నడుపుతున్నాయి. సంక్రాంతి పండగ సీజన్లో అదనంగా మరో ఏసీ బస్‌ను నడుపుతున్నారు. సాధారణ రోజుల్లో విజయనగరం, హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే వారి నుంచి నాన్ ఏసీ బస్‌లకు అయితే రూ. 600లు వసూలు చేయగా, ప్రస్తుతం పండుగ నేపధ్యంలో రూ. 1200ల నుంచి రూ. 1500లు వరకు గుంజుతున్నారు. అదే ఏసీ బస్సులకు అయితే సాధారణ రోజుల్లో రూ. 900లు వసూలు చేయగా, ప్రస్తుతం రూ. 1330 నుంచి రూ. 2500లు వరకు వసూలు చేస్తున్నారు. విజయవాడ -విజయనగరం మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల వద్ద నుంచి సాధారణ రోజుల్లో నాన్ ఏసీ బస్సులకు అయితే రూ. 400లు, ఏసీ బస్సుకు అయితే రూ. 600లు వసూలు చేసే వారు. ప్రస్తుతం నాన్ ఏసీ బస్సుకే రూ. 600లు వసూలు చేస్తుండగా, ఏసీ బస్సు ప్రయాణీకుల నుంచి రూ. 750లు వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ప్రయాణికుల రద్దీ బట్టీ రోజుకో రేటు చొప్పున వసూలు చేస్తున్నారు. నచ్చితే ప్రయాణించవచ్చు .. లేకపోతే పోవచ్చు అంటూ ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులు ఖరాకండీగా చెబుతున్నారు. వాస్తవానికి ప్రయాణ చార్జీల ధరలన్నీ సదరు ట్రావెల్ ఏజెన్సీలు ఆన్లైన్లో ఉంచినప్పటికీ ఆ ధరలతో సంబంధం లేకుండా అడ్డంగా వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ సర్వీసులు అంతంతమాత్రమే..... మారుమూల గ్రామాలకు సైతం ఆర్టీసీ సేవలందిస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న ఆర్టీసీ సంస్థ దూర ప్రాంతాలకు అవసరమైనన్ని సర్వీసులు నడపడంలో విఫలమవుతోంది. విజయనగరం పట్టణం నుంచి ప్రతి రోజు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, తదితర దూర ప్రాంతాలకు వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఆర్టీసీ నడుపుతున్న సర్వీసులు అరకొరగానే ఉన్నాయి. విజయనగరం నుంచి ప్రతి రోజూ హైదరాబాద్‌కు కేవలం మూడు హైటెక్ సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. రైళ్లలో బెర్త్‌లు ముందుగానే ఫుల్ అవడం, ఆర్టీసీ సేవలు అంతంత మాత్రంగానే ఉండటంతో పట్టణానికి వచ్చివెళ్లే వారి పరిస్థితి దయనీయంగా మారింది. చివరికి తమ ప్రయాణాలు మానుకోలేక జేబులకు చిల్లు పెట్టుకుని మరీ పైవ్రేటు వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ముగ్గురికి జైలు శిక్ష విజయనగరం క్రైం : మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురికి ఎక్సైజ్ మెజిస్ట్రేట్ జైలు శిక్ష విధించారని ట్రాఫిక్ డీఎస్పీ ఎల్. రాజేశ్వరరావు తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. ముగ్గురికి మూడు రోజుల జైలు శిక్ష, రూ. 2 వేలు జరిమానా విధించారని చెప్పారు. -
30 బస్సులపై కేసులు... 20 బస్సులు సీజ్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ వివిధ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు గురువారం తెల్లవారుజామున ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న 30 బస్సులపై కేసులు నమోదు చేశారు. అలాగే సరైన పత్రాలు లేకుండా ప్రయాణికులను తరలిస్తున్న చేస్తున్న 20 బస్సులను సీజ్ చేశారు. కృష్ణా జిల్లా గరికపాడు వద్ద 7 ప్రైవేట్ బస్సులు, నెల్లూరు జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 5, విశాఖపట్నం జిల్లాలో 2 బస్సులపై కేసులు నమోదు చేశారు. దసరా పండగ సమయంలో రేట్టింపు ఛార్జీలను ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. -
93 బస్సులు సీజ్
ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారుల దాడులు సాక్షి నెట్వర్క్: మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు దుర్ఘటన నేపథ్యంలో రాష్ట్ర రవాణాశాఖలో కదలిక వచ్చింది. ఇన్నిరోజులుగా చోద్యం చూస్తున్న ఆర్టీఏ అధికారులు.. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై దాడులు ప్రారంభించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిని సీజ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 93 బస్సుల్ని సీజ్ చేసి, 70 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఆందోళనకర విషయం ఏమిటంటే.. తనిఖీ చేసిన బస్సుల్లో చాలా వాటిల్లో అగ్నిప్రమాదాల నియంత్రణకు ఏర్పాట్లు లేవు. ప్రథమ చికిత్స బాక్సులు ఒక్క బస్సులోనూ కనిపించలేదు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ రింగురోడ్డు, సాగర్ రింగురోడ్డు, చింతలకుంట సమీపంలో 8 బస్సులను సీజ్ చేశారు. అందులో కేశినేని, ఎస్వీఆర్ఎస్, శ్రీకృష్ణ, గౌతమి ట్రావెల్స్‌తోపాటు కర్ణాటకకు చెందిన 3 బస్సులున్నాయి. విశాఖ శివార్లలో శుక్రవారం ఉదయంనుంచే తనిఖీలు చేపట్టిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 18 బస్సుల్ని సీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 7 బస్సులను సీజ్ చేశారు. 21 బస్సుల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కోనసీమలో 13 బస్సులపై కేసులు నమోదు చేశారు. విజయనగరం జిల్లాలో 3 బస్సులపై కేసులు నమోదు చేసి, ఒకదాన్ని సీజ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక బస్సును సీజ్ చేసిన అధికారులు.. 24 బస్సులపై కేసులు పెట్టారు. శ్రీకాకుళం జిల్లాలో 3 బస్సుల్ని సీజ్ చేశారు. కృష్ణా, గుంటూరు, ప్రకా శం, నెల్లూరు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో కలిపి 33 బస్సులను సీజ్ చేశారు. దాదాపు 20 బస్సులపై కేసులు పెట్టారు. అనంతపురంలో ఆర్టీఏ అధికారులు 4 బస్సుల్ని సీజ్ చేసినట్లు ప్రకటించారు. కానీ 20కిపైగా బస్సుల్ని స్వాధీనం చేసుకోగా.. ముడుపులు తీసుకుని వదిలేసినట్లు ఆరోపణలొస్తున్నాయి. కర్నూలు జిల్లాలో 12 బస్సులపై కేసులు నమోదు చేయగా.. 4 బస్సుల్ని సీజ్ చేశారు. -
రవాణా శాఖ తనిఖీలు, 47 బస్సులు జప్తు
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ దాడులు రెండోరోజు కూడా కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 47 ప్రైవేటు బస్సులను అధికారులు సీజ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు దగ్ధం ఘటన నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, హైదరాబాద్, రంగారెడ్డి, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ముమ్మరంగా ఈ తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా జాతీయ రహదారిపై వెళ్లే బస్సులను ఆపి ఫిట్నెస్ పరిశీలించారు. డ్రైవర్ల ఫిట్నెస్ను కూడా తనిఖీ చేశారు. కొన్ని బస్సులు పర్మిట్ కూడా లేకుండా తిరుగుతున్నట్టు ఈ సందర్భంగా వెల్లడైంది. గుంటూరులో కంకరగుంట, బస్టాండ్ వద్ద తనిఖీలు జరిపిన అధికారులు పది బస్సులను జప్తు చేశారు. అలాగే నెల్లూరు జిల్లా కోవూరు జాతీయ రహదారిపై ఓ బస్సును సీజ్ చేశారు. కర్నూలులో నాలుగు, జహీరాబాద్లోనూ నాలుగు బస్సులను జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు.