అగ్ని ప్రమాదంలో తగలబడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు నగర శివారులో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన 7 బస్సులు పూర్తిగా దగ్ధమవ్వగా.. ఒక బస్సు పాక్షికంగా దెబ్బతింది. వివరాలు.. ఒంగోలుకు చెందిన వేమూరి సుబ్బారావు అనే వ్యక్తి వేమూరి ట్రావెల్స్, వేమూరి కావేరి ట్రావెల్స్, కావేరి కామాక్షి ట్రావెల్స్, వినోద్ ట్రావెల్స్ అనే పేర్లతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖ, గోవా, షిర్డీలకు బస్సులు నడుపుతుంటారు. కరోనా వల్ల బస్సులు నడపడం కష్టంగా మారిందని.. ఏడాదిన్నర కాలంగా 20 బస్సులను స్థానిక ఉడ్ కాంప్లెక్స్‌లోని తనకున్న 60 సెంట్ల ఖాళీ స్థలంలో పార్కింగ్ చేశాడు.
ఈ క్రమంలో మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో బస్సులు నిలిపి ఉన్నచోట ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఒంగోలులోని మూడు ఫైర్ ఇంజన్లు, టంగుటూరు, అద్దంకి నుంచి మరో రెండు ఫైర్ ఇంజన్లు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేశాయి. కానీ అప్పటికే 7 బస్సులు పూర్తిగా దగ్ధమవ్వగా.. ఒక బస్సు మాత్రం పాక్షికంగా దెబ్బతింది. అగ్నిమాపక అధికారులు శ్రీనివాసరావు, వీరభద్రరావు, కేవీకే ప్రసాద్, ఒంగోలు డీఎస్పీ నాగరాజు, తాలూకా సీఐ శ్రీనివాసరెడ్డి తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
ఈ ఘటనపై ట్రావెల్స్ మేనేజర్ వేమూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కరోనా వల్ల 2020వ సంవత్సరం నుంచి బస్సులను ఉడ్ కాంప్లెక్స్‌లోని తన స్థలంలోనే పార్కింగ్ చేసి ఉంచానని చెప్పారు. అగ్నిమాపక శాఖ అధికారులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. కాగా, బస్సులు పూర్తిగా కాలిపోవడం వల్ల రూ.3.25 కోట్ల నష్టం వాటిల్లినట్లు పోలీసులకు వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశాడు. మంటలు ఎలా చెలరేగాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని.. ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment