ప్రైవేటువి 1,100.. ఆర్టీసీవి 0 | Demand For Sleeper Coach Bus In Telangana | Sakshi
Sakshi News home page

ప్రైవేటువి 1,100.. ఆర్టీసీవి 0

Published Wed, Feb 12 2020 3:52 AM | Last Updated on Wed, Feb 12 2020 3:52 AM

Demand For Sleeper Coach Bus In Telangana - Sakshi

రాత్రి వేళ హాయిగా విశ్రమించి ప్రయాణించాలని కోరుకునే వారే ఎక్కువ. అందుకే దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లకు డిమాండు ఎక్కువ. కానీ, వాటి సంఖ్య పరిమితం. అన్ని ప్రాంతాలకు రైళ్లు అందుబాటులో లేవు. అందుకే స్లీపర్‌ బస్సులకు డిమాండ్‌ బాగా పెరుగుతోంది. బెంగళూరు, ముంబై, వైజాగ్, తిరుపతి లాంటి సుదూర ప్రాంతాలకు స్లీపర్‌ బస్సుల్లో ప్రయాణాలు ఎక్కువ. ప్రయాణికుల డిమాండును గుర్తించి ప్రైవేటు ట్రావెల్స్‌ యజమానులు ఎప్పటికప్పుడు స్లీపర్‌ బస్సు సర్వీసుల సంఖ్య పెంచుతున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి నిత్యం వివిధ ప్రాంతాలకు దాదాపు 1,100 స్లీపర్‌ సర్వీసులు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా టూరిస్ట్‌ పర్మిట్‌ తీసుకుని స్టేజి క్యారియర్లుగా తిరుగుతున్న బస్సులతోపాటు, అరుణాచల్‌ప్రదేశ్‌ లాంటి పర్యాటకులు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకుని, అక్కడి నుంచే టూరిస్ట్‌ పర్మిట్‌ తీసుకుని హైదరాబాద్‌ కేంద్రంగా తిరుగుతున్న బస్సులు కూడా వీటిలో ఉన్నాయి. అయినా, ప్రయాణికులకు అందుబాటులో ఉంటూ దర్జాగా పరుగుపెడుతూ గల్లా పెట్టెను నింపుకుంటున్నాయి.  ఇంత డిమాండ్‌ ఉండి కూడా స్లీపర్‌ సర్వీసులు నడపడంలో ఆర్టీసీ చేతులెత్తేసింది. ప్రస్తుతం ఆర్టీసీ వద్ద ఒక్క స్లీపర్‌ బస్సు కూడా లేదు.

సమ్మె తర్వాత కూడా మారని తీరు.. 
ఆర్టీసీ తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతూ దివాలా దశకు చేరుకున్న తరుణంలో వచ్చి పడిన సమ్మె దాన్ని పూర్తిగా కుదేలు చేసింది. ప్రభు త్వం మేల్కొని దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించి, ఆదా యం పెంచుకునే క్రమంలో కి.మీ.కు 20 పైసలు చొప్పు న చార్జీలు పెంచుకునేందుకు అనుమతించింది. దీంతో  రోజువారీ ఆదాయం రూ.2 కోట్ల మేర పెరిగింది. ఇలాం టి సమయంలో కూడా డిమాండ్‌కు తగ్గట్టుగా తనను తాను మార్చుకోవడంలో ఆర్టీసీ విఫలమవుతోంది. దూర ప్రాంతాలకు స్లీపర్‌ బస్సులు కావాలని ప్రయాణికులు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. నిత్యం అలాంటి సర్వీసులు సీట్లు రిజర్వ్‌ చేసుకునేందుకు వందలాది మంది ఆర్టీసీని సంప్రదిస్తున్నారు. ‘మా వద్ద అలాంటి బస్సుల్లేవు’అని సింపుల్‌గా సమాధానమిచ్చి సిబ్బంది చేతులు దులుపుకొంటున్నారు. సురక్షిత ప్రయాణంలో ఆర్టీసీతోనే సాధ్యమన్న అభిప్రాయం సాధారణ ప్రయాణికుల్లో ఉంది. అందుకే చాలామంది ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేందుకు మొగ్గుచూపుతారు. కానీ, స్లీపర్‌ బస్సుల్లేక తప్పని పరిస్థితిలో ప్రైవేటు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.

సీఎం భేటీలో ప్రస్తావన వచ్చినా.. 
ఇటీవల సమ్మె ముగిసేవేళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన సమావేశంలో స్లీపర్‌ బస్సుల అంశం ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఇప్పటికిప్పుడు భారీ ఖర్చు చేసి కొత్త బస్సులు కొనడం కంటే, అందుబాటులో ఉన్న గరుడ బస్సుల్లో కొన్నింటిని స్లీపర్‌ సర్వీసులుగా మార్చాలని నిర్ణయించారు. సమ్మె అనంతరం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. తొలుత 25 బస్సులను స్లీపర్‌ సర్వీసులుగా మార్చాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు. కానీ అధికారులు మాత్రం ఇప్పటివరకు అలాంటి కసరత్తే చేయలేదు. సరుకు రవాణా కోసం పాత ఆర్టీసీ బస్సులను బస్‌బాడీ వర్క్‌షాపులో కార్గో సర్వీసులుగా మారుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 50 వరకు బస్సులను కార్గో వాహనాలుగా మార్చేశారు.

వెన్నెల సర్వీసులు.. తుక్కుగా మారి..
వెన్నెల పేరుతో ఆర్టీసీ స్లీపర్‌ బస్సులు నిర్వహించింది. ఇటీవలి వరకు రెండు బస్సులుండేవి. అవి పాతబడి మరమ్మతులు చేస్తే కాని నడిచే పరిస్థితి లేకపోవడంతో వాటిని తుక్కుగా మార్చేశారు. దీంతో ఇప్పుడు ఒక్క స్లీపర్‌ బస్సు కూడా లేకుండా పోయింది. వృద్ధులు, నడుము నొప్పి, వెన్ను పూస సమస్యలున్నవారు కూర్చుని దూర ప్రాంతాలకు ప్రయాణించలేకపోతున్నారు. వీరు స్లీపర్‌ బస్సులనే ఎంచుకుంటున్నారు. దీంతో ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు అలాంటి వారిని ఆకర్షించేందుకు స్లీపర్‌ సర్వీసుల సంఖ్యను పెంచుకుంటున్నాయి.

ఇప్పటివరకు హైదరాబాద్‌ నుంచి మాత్రమే ఆ సర్వీసులు అందుబాటులో ఉండగా.. తాజాగా వరంగల్, కరీంనగర్‌ లాంటి పట్టణాల నుంచి ప్రారంభిస్తున్నారు. ఇటీవల వరంగల్‌ నుంచి ఓ ప్రైవేటు సంస్థ బెంగళూరుకు సర్వీసు ప్రారంభించింది. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో ఆర్టీసీ అధికారులు అడ్డుకున్నారు. కానీ చర్యలు తీసుకోవాల్సిన రవాణా శాఖ చేతులెత్తేయడంతో ఆ బస్సు నిండుగా ప్రయాణికులతో దర్జాగా పరుగులు తీస్తోంది. మరికొద్ది రోజుల్లో ప్రైవేటు సంస్థలు స్లీపర్‌ సర్వీసుల సంఖ్యను 1,500కు పెంచుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement