సగటు మానవుడికి సంక్రాంతికి ప్రయాణం గగనమైపోయింది. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చిన వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. రైళ్ల రిజర్వేషన్లు దొరకని వారు, జనరల్ బోగీల్లో కిక్కిరిసి కూర్చునే ప్రయాణికులను చూసి ఇదేమి బాధ అని భయపడి బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఆమాంతం టికెట్ ధరను రెండింతలు పెంచేసి ప్రయాణికుల నడ్డివిరుస్తున్నారు.
విజయనగరం మున్సిపాలిటీ : పట్టణంలోని బాబామెట్ట కాలనీకి చెందిన విశ్వేశ్వరరావు ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో సెలవు పెట్టాడు. సెలవు మంజూరైందే తడవుగా చిక్కడపల్లిలోని తన రూమ్‌కు వెళ్లి బ్యాగ్ సర్దుకుని భుజానికి తగలించుకున్నాడు. రైల్వేస్టేషన్‌కు వెళ్తే కాలు పెట్టేందుకు వీలు లేని పరిస్థితి. అక్కడి నుంచి నేరుగా బస్‌స్టాండ్‌కు వెళితే అక్కడా అలాగే ఉంది. ఉన్న సర్వీస్‌ల సీట్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నిండిపోగా స్పెషల్ బస్సుల పేరుతో చార్జీలు వడ్డీస్తున్నా అక్కడా సీటు దొరకడం అనుమానమే. దీంతో చేసేదేమి లేక నేరుగా ప్రైవేటు ట్రావెల్స్‌కు వెళ్లిన విశ్వేశ్వరరావు విజయనగరం వెళ్లేందుకు బస్సు ఉందా అని అడిగాడు.
అంతే సదరు ట్రావెల్స్ నిర్వాహకుడు రూ. 2 వేలు అవుతుందంటూ ఠక్కున చెప్పాడు. అదేంటి అని అడగకముందే నచ్చితే ఎక్కండి లేకుంటే మీ ఇష్టం. ఇక్కడ నస వద్దు అంటూ సమాధాన మిచ్చాడు. దీంతో చేసేదేమి లేని విశ్వేశ్వరరావు అడిగిన మొత్తం చెల్లించి డొక్కు బస్సులోనే రావాల్సి వచ్చింది. ఇది ఒక్క విశ్వేశ్వరరావు అనుభవమే కాదు... వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల రీత్యా ఉంటూ పండగకు జిల్లాకు వచ్చిన అందరూ ఇలా దోపిడీకి గురయ్యారు. పిల్లాపాపలతో సొంత ఊరు చేరుకున్న వారికి ప్రయాణచార్జీలు నడ్డివిరిచాయి. ప్రయాణానికే వేలల్లో ఖర్చు అయిపోవడంతో వారిలో పండగ సరదా కనిపించడం లేదు.
రోజుకో రేటు...
జిల్లా కేంద్రనుంచి హైదరాబాద్‌కు ప్రతి రోజూ ఆరు నాన్ ఏసీ బస్‌లు, మూడు ఏసీ బస్‌లను ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలు నడుపుతున్నాయి. సంక్రాంతి పండగ సీజన్‌లో అదనంగా మరో ఏసీ బస్‌ను నడుపుతున్నారు. సాధారణ రోజుల్లో విజయనగరం, హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే వారి నుంచి నాన్ ఏసీ బస్‌లకు అయితే రూ. 600లు వసూలు చేయగా, ప్రస్తుతం పండుగ నేపధ్యంలో రూ. 1200ల నుంచి రూ. 1500లు వరకు గుంజుతున్నారు. అదే ఏసీ బస్సులకు అయితే సాధారణ రోజుల్లో రూ. 900లు వసూలు చేయగా, ప్రస్తుతం రూ. 1330 నుంచి రూ. 2500లు వరకు వసూలు చేస్తున్నారు. విజయవాడ -విజయనగరం మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల వద్ద నుంచి సాధారణ రోజుల్లో నాన్ ఏసీ బస్సులకు అయితే రూ. 400లు, ఏసీ బస్సుకు అయితే రూ. 600లు వసూలు చేసే వారు. ప్రస్తుతం నాన్ ఏసీ బస్సుకే రూ. 600లు వసూలు చేస్తుండగా, ఏసీ బస్సు ప్రయాణీకుల నుంచి రూ. 750లు వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ప్రయాణికుల రద్దీ బట్టీ రోజుకో రేటు చొప్పున వసూలు చేస్తున్నారు. నచ్చితే ప్రయాణించవచ్చు .. లేకపోతే పోవచ్చు అంటూ ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులు ఖరాకండీగా చెబుతున్నారు. వాస్తవానికి ప్రయాణ చార్జీల ధరలన్నీ సదరు ట్రావెల్ ఏజెన్సీలు ఆన్‌లైన్‌లో ఉంచినప్పటికీ ఆ ధరలతో సంబంధం లేకుండా అడ్డంగా వసూలు చేస్తున్నారు.
ఆర్టీసీ సర్వీసులు అంతంతమాత్రమే.....
మారుమూల గ్రామాలకు సైతం ఆర్టీసీ సేవలందిస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న ఆర్టీసీ సంస్థ దూర ప్రాంతాలకు అవసరమైనన్ని సర్వీసులు నడపడంలో విఫలమవుతోంది. విజయనగరం పట్టణం నుంచి ప్రతి రోజు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, తదితర దూర ప్రాంతాలకు వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఆర్టీసీ నడుపుతున్న సర్వీసులు అరకొరగానే ఉన్నాయి. విజయనగరం నుంచి ప్రతి రోజూ హైదరాబాద్‌కు కేవలం మూడు హైటెక్ సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. రైళ్లలో బెర్త్‌లు ముందుగానే ఫుల్ అవడం, ఆర్టీసీ సేవలు అంతంత మాత్రంగానే ఉండటంతో పట్టణానికి వచ్చివెళ్లే వారి పరిస్థితి దయనీయంగా మారింది. చివరికి తమ ప్రయాణాలు మానుకోలేక జేబులకు చిల్లు పెట్టుకుని మరీ పైవ్రేటు వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు.
ముగ్గురికి జైలు శిక్ష
విజయనగరం క్రైం : మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురికి ఎక్సైజ్ మెజిస్ట్రేట్ జైలు శిక్ష విధించారని ట్రాఫిక్ డీఎస్పీ ఎల్. రాజేశ్వరరావు తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. ముగ్గురికి మూడు రోజుల జైలు శిక్ష, రూ. 2 వేలు జరిమానా విధించారని చెప్పారు.
ప్రైవేట్ బాదుడు !
Published Tue, Jan 13 2015 3:29 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM
Advertisement