పెళ్లి బృందం వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు | - | Sakshi
Sakshi News home page

పెళ్లి బృందం వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Published Tue, Jun 27 2023 9:10 AM | Last Updated on Tue, Jun 27 2023 9:10 AM

 క్షతగ్రాతులను ఎంకేసీజీ ఆస్పత్రికి తరలిస్తున్న ఓడ్రాప్‌ బృందం  - Sakshi

క్షతగ్రాతులను ఎంకేసీజీ ఆస్పత్రికి తరలిస్తున్న ఓడ్రాప్‌ బృందం

అంతా గాఢ నిద్రలో ఉండగా.. ఓ కుదుపు జీవితాన్ని తల్లకిందులు చేసింది. రెప్పపాటులో ఊహకందని విషాదాన్ని మిగిల్చింది. కొద్ది సేపటి వరకు ఆనందంగా గడిపిన వారంతా విగత జీవులుగా మారారు. మరికొద్ది దూరంలో గమ్యం చేరుకోవాల్సిన వారు.. తిరిగిరాని లోకాలకు మరలిపోయారు. చిమ్మ చీకటిలో తప్పెవరిది? అని వెతుకాలాడే కంటే.. అతి వేగమే బాధిత కుటుంబాలకు సమాధానం చెప్పాల్సి ఉంది. – బరంపురం

గంజాం జిల్లాలోని దిగపండి సమీపంలోని కెముండి కళాశాల ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 59వ జాతీయ రహదారిలో బరంపురం నగరానికి కేవలం 16 కిలోమీటర్ల సమీపంలో ఎదురెదురుగా వస్తున్న 2బస్సులు బలంగా ఢీకాన్నాయి. ఈ దుర్ఘటనలో 12మంది ప్రయాణికులు అక్కడిక్కడే చెందగా, మరో 15మందికి తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న కలెక్టర్‌ దివ్యజ్వోతి పరిడా, బరంపురం ఎస్పీ సరవణ్‌ వివేక్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, ఒడ్రాప్‌ బృందం సాయంతో క్షతగాత్రులను తొలుత దిగపండి ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రికి, అక్కడి నుంచి బరంపురం ఎంకేసీజీకి తరలించారు. దీనిపై కలెక్టర్‌ పరిడా, ఎస్పీ వివేక్‌, బాధిత ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడారి నుంచి బరంపురం మీదుగా భువనేశ్వర్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సు.. ఆదివారం రాత్రి 12గంటల సమయంలో దిగపండి చేరుకుంది. బరంపురం నగరంలోని హతిబొందొ వీధికి చెందిన పెళ్లి బృందం ప్రైవేటు బస్సులో దిగపండి సమీపంలో జరిగిన వివాహానికి హాజరై, తిరుగు పయనమైంది. రెండు బస్సులూ కెముండి కళాశాల మలుపులో ఎదురెదురుగా వేగంగా వస్తూ ఢీకొన్నాయి.

ప్రయాణికుల హాహాకారాలు..

అప్పటి వరకు చిమ్మ చీకట్లో నిశ్శబ్ధంగా ఉన్న ఆ ప్రాంతం.. ఒక్కసారిగా ప్రయాణికుల ఆక్రమందనలతో దద్దరిల్లింది. కొంతమంది హాహాకారాలు చేస్తూ.. ప్రాణ భయంతో బస్సు నుంచి కిందకు దూకి, పరుగులు తీశారు. ప్రయాణికుల్లో 12మంది అక్కడికక్కడే మృతిచెందగా, మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న బరంపురం, దిగపండి అగ్నిమాపక, ఓడ్రాప్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని, బస్సులో చిక్కుకున్న మృతదేహాలు, క్షతగ్రాతులను బయటకు తీశారు. తొలుత దిగపండి పీహెచ్‌సీకి తరలించి, ప్రాథమిక వైద్యం అందించారు.

కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో 108 అంబులెన్స్‌లో మెరుగైన చికిత్స నిమిత్తం బరంపురం ఎంకేసీజీ మెడికల్‌ కళాశాల ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కటక్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేశామని ఎంకేసీజీ సూపరింటెండెంట్‌ సంతోష్‌కుమార్‌ మిశ్రా తెలిపారు. ఘటనపై దిగపండి పోలీసులు కేసు నమోదు, చేసి దర్యాప్తు చెస్తున్నారు.

ట్రక్క ఢీకొని యువకుడు..
జయపురం: ట్రక్కు ఢీకొని యువకుడు మృతిచెందిన ఘటనలో బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని బంధువులు, గ్రామస్తులు, ఆందోళనకు దిగారు. జయపురం సబ్‌ డివిజన్‌ పోలీసు అధికారి ఘటనా స్థలానికి చేరుకొని, ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ట్రక్కు యజమానితో చర్చించి, పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై బొయిపరిగుడ పోలీసు అధికారి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ–రాంచీ 326 జాతీయ రహదారి మల్కన్‌గిరి–బొయిపరిగుడ మార్గంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.

మాచ్‌ఖండ్‌ పోలీసు స్టేషన్‌ పరిధి ఖొడాగొజి గ్రామానికి చెందిన చంద్ర ఖిలో(28) శనివారం సాయంత్రం ముదులిగుడ గ్రామంలోని తన బంధువుల ఇంటికి వ్యక్తిగత పనిపై వెళ్లాడు. ఆదివారం సాయంత్రం తన గ్రామానికి బైక్‌పై తిరిగి వస్తుండగా బొయిపరిగుడకు 2 కిలోమీటర్ల దూరంలో బొగ్గు లోడుతో ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొంది. ప్రమాదంలో ఖిలో ట్రక్కు చక్రం కిందపడి, అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే ట్రక్కు డ్రైవర్‌ వెంటనే బొయిపరిగుడ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. ప్రమాద విషయం తెలుసుకున్న మృతుడు బంధువులు, ముదులిగుడ గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

జాతీయ రహదారిపై బైఠాయించి, రస్తారోకో చేపట్టారు. దీంతో అటుగా వెళ్తే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించేందుకు వారంతా అంగీకరించలేదు. ఈ మేరకు బొయిపరిగుడ తహసీల్దార్‌, జయపురం ఎస్‌డీపీఓ ఆందోళనకారులతో చర్చించారు. ట్రక్క యజమానితో చర్చించి తగిన పరిహారం ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో వారంతా శాంతించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/4

 రోడ్డుపై ఆందోళనకు దిగిన మృతుడి కుటుంబ సభ్యులు 2
2/4

రోడ్డుపై ఆందోళనకు దిగిన మృతుడి కుటుంబ సభ్యులు

3
3/4

 మీడియాతో మాట్లాడుతున్న కలెక్టర్‌ దివ్యజ్వోతి పరిడా, ఎస్పీ వివేక్‌ 4
4/4

మీడియాతో మాట్లాడుతున్న కలెక్టర్‌ దివ్యజ్వోతి పరిడా, ఎస్పీ వివేక్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement