bussiness income tax
-
నిండా ముంచారు!
అద్దంకిరూరల్: పోలవరంలో అది చేశాం. ఇది చేశాం చూడండి. ప్రతిపక్షం మా మీద కక్ష కట్టి మాట్లాడుతోందంటూ రాష్ట్ర ప్రభుత్వం నానా యాగీ చేసింది. వాస్తవాలు మీరే చూడండని, పోలవరం ప్రాజెక్టును ప్రజలకు చూపించి తద్వారా సార్వత్రిక ఎన్నికల్లో లబ్ది పొందాలని భావించింది. తమ పార్టీ నేతలను పురామాయించి గ్రామాల వారీగా ప్రజలను ఉచితంగా పోలవరం సందర్శన చేసే కార్యక్రమం చేపట్టింది. దానికి ప్రైవేటు వాహనాలను వినియోగించకుండా, రెండు నెలలపాటు ఆర్టీసీ బస్సులను తిప్పింది. తీరా బిల్లులు చెల్లించకుండా ఆ సంస్థను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ప్రయాణికులను తిప్పలు పెట్టిన ఆర్టీసీ... ప్రభుత్వం అధికారుల ఆదేశాలను తూ.చ. తప్పని ఆర్టీసీ యాజమాన్యం ప్రజల కష్టాలను లెక్క చేయకుండా అత్యుత్సాహంతో వందల కొద్దీ బస్సులను పోలవరం పంపింది. జిల్లాలోని 8 డిపోల నుంచి రోజుకు 30 నుంచి 50 బస్సులను రద్దు చేసి పోలవరం సందర్శనకు పెట్టింది. ఆర్టీసీని పెంచి పెద్ద చేసిన ప్రయాణికుల ఇబ్బందులను ఖాతరు చేయకుండా ఆయా డిపోల పరిధిలో రెండునెలల పాటు బస్సులు నడిపింది. చేసేది లేక ప్రయాణికులు అధిక చార్జీలు చెల్లించి ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించారు. అయినా ప్రభుత్వం మాత్రం ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదు. అద్దంకి నుంచే 335 బస్సులు... పోలవరం సందర్శనకు ఒక్క అద్దంకి డిపో నుంచి జనవరి నెలలో 95 బస్సులు, ఫిబ్రవరిలో 240 బస్సులను నడిపారు. దీంతో ఆ రెండు నెలల్లో డిపో నుంచి వివిధ గ్రామాలతోపాటు ముఖ్య పట్టణాలకు ప్రయాణిచాల్సిన ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరడానికి నానా అవస్థలు పడ్డారు. నిలిచిపోయిన 16 కోట్లు బిల్లులు.. జిల్లా వ్యాప్తంగా 8 డిపోల్లో పొలవరం సందర్శన కోసం ఏర్పాటు చేసిన బస్సులకు రూ. 14 కోట్లు, రాజధాని అమరావతి సందర్శన కోసం పెట్టిన బస్సులుకు రూ. 2 కోట్లు మొత్తం రూ.16 కోట్లు బిల్లులు నిలిపోయాయి. అందులో ఒక్క అద్దంకిలోనే రెండు నెలలో 335 బస్సులను వినియోగించుకున్నారు. దానికి సంబందించి జనవరిలో రూ.1,09,34,601, ఫిబ్రవరిలో43,98,848. మొత్తం కోటిన్నర వరకు ప్రభుత్వం చెల్లించాల్సి వుంది. ప్రశ్నార్ధకంగా మారిన ఆర్టీసీ భవిష్యత్... ప్రభుత్వం నుంచి రావాల్సి ఇంత పెద్దమొత్తం ఎప్పటికి వస్తుందో ఆర్టీసీకి అంతు చిక్కడం లేదు. చెల్లించాల్సిన సమయంలో బిల్లులు చెల్లించకపోవడం, తరువాత సార్వత్రిక ఎన్నికల ప్రకటన, కోడ్ అమలుతో నిలిచిపోయిన బిల్లులు ప్రస్తుతం చెల్లించే పరిస్తితి లేదనేది తెలిసిన విషయమే. ఈ పరిస్థితుల్లో జిల్లాల్లో ఒక్క కనిగిరి తప్ప మిగిలిన ఎనిమిది డిపోల్లో ఏ డిపో పరిస్థితి సరిగా లేదు. నష్టాల్లో ఉన్నాయి. అటువంటి సమయంలో ఆర్టీసీని ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కంచే చేను మేసిన చందంగా ఆర్టీసీ బస్సులను సందర్శనకు వాడుకుని బిల్లులు చెల్లించకపోవడం సరికాదని ప్రజలు విమర్శిస్తున్నారు. -
లెక్కలన్నీ కిరికిరి!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పటాన్‌చెరుకు చెందిన ఓ కెమికల్ వ్యాపారి వార్షిక లావాదేవీలు రూ.12 కోట్లు. కానీ వాణిజ్య పన్నుల శాఖకు సమర్పిస్తున్న లెక్కల్లో మాత్రం కేవలం రూ.3 కోట్ల మేర మాత్రమే వ్యాపారం చేస్తున్నట్లు చూపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు పన్ను రూపంలో రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతోంది. వాణిజ్య పన్నుల శాఖ అధికారుల కనుసన్నల్లోనే వ్యాపారులు తప్పుడు లెక్కలు చూపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వివరాలు వెల్లడించేందుకు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు విముఖత చూపుతుండటంతో అనుమానాలు బలపడుతున్నాయి. వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ పరిధిలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట సహాయ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాలు ఉన్నాయి. ఒక్క సిద్దిపేట కార్యాలయం పరిధిలోనే వాణిజ్య పన్నుల రూపంలో రాష్ట్ర ఖజానాకు రూ.30 కోట్ల ఆదాయం వస్తోంది. మెదక్, సంగారెడ్డి కార్యాలయాల పరిధిలో వార్షికాదాయ లక్ష్యాన్ని కలుపుకుంటే సుమారు వంద కోట్ల రూపాయలపైనే జిల్లా నుంచి సమకూరుతోంది. అయితే వ్యాపారులు సమర్పించిన టర్నోవర్ ఆధారంగానే వాణిజ్య పన్నుల శాఖ లెక్కలు కడుతోంది. వాస్తవ లావాదేవీలకు, వ్యాపారులు చెల్లిస్తున్న పన్నుల లెక్కలకు పొంతన కనిపించడం లేదు. వ్యాపారులు ఆన్లైన్ విధానంలో సమర్పిస్తున్న లెక్కలను మదింపు చేయడం, లావాదేవీలను తనిఖీ చేసే ప్రక్రియ మొక్కుబడిగా కనిపిస్తోంది. ఒక సర్కిల్ పరిధిలో జరుగుతున్న లావాదేవీలను మరో సర్కిల్ పరిధిలోని సిబ్బంది సంపూర్ణంగా కాకుండా మచ్చుకు మాత్రమే పరిశీలిస్తోంది. దీంతో లావాదేవీలకు సంబంధించిన వాస్తవాలు లెక్కకు అందడం లేదు. మరోవైపు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.40 లక్షలకు పైగా లావాదేవీలు నిర్వహించిన వ్యాపారులు ‘వ్యాట్’ పరిధిలోకి వస్తారు. వ్యాట్ పరిధిలో వున్న వారు ఎక్కువ మొత్తాన్ని పన్నుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, సిబ్బంది సహకారంతో టర్నోవర్‌ను రూ.40 లక్షలు దాటకుండా జాగ్రత్తపడుతున్నారు. మార్గదర్శకాలు బేఖాతరు వంద రూపాయలు దాటి న ప్రతీ కొనుగోలుపై వినియోగదారులకు వ్యాపారులు రశీదు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే రూ.7.50 లక్షల టర్నోవర్ దాటిన వ్యాపారులు మాత్రమే వంద రూపాయలు దాటిన లావాదేవీలకు రశీదులు ఇవ్వాలనే నిబంధన విధించారు. దీంతో చిన్న వ్యాపారులు రూ.7.50 లక్షల టర్నోవర్ దాటకుండా కాగితాల మీద లెక్కలు వేసి వాణిజ్య పన్నుల శాఖకు సమర్పిస్తున్నారు. అక్రమ లావాదేవీలను వెలికి తీసేం దుకు దాడులు నిర్వహించాల్సి ఉన్నా, మూడేళ్లుగా ఎక్కడా కేసులు నమోదు చేసిన దాఖలా కనిపించడం లేదు. డిప్యూటీ కమిషనర్ కార్యాలయం నుంచి ఆదేశాలు వస్తేనే దాడులు చేస్తామని స్థానిక అధికారులు చెప్తున్నారు. మరోవైపు పొరుగు రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతుల లావాదేవీలపైనా శాస్త్రీయంగా మదింపు జరగడం లేదు. ఆయా కార్యాలయాల వార్షికాదాయం, కేసుల నమోదువంటి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు గోప్యత పాటిస్తున్నారు. ‘లావాదేవీలు మేం సరిచూసేదేముంది. అన్లైన్ పద్ధతిలో వ్యాపారులు పన్ను చెల్లిస్తున్నారు’ అంటూ దాటవేత వైఖరి అవలంబిస్తున్నారు.