సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:
పటాన్‌చెరుకు చెందిన ఓ కెమికల్ వ్యాపారి వార్షిక లావాదేవీలు రూ.12 కోట్లు. కానీ వాణిజ్య పన్నుల శాఖకు సమర్పిస్తున్న లెక్కల్లో మాత్రం కేవలం రూ.3 కోట్ల మేర మాత్రమే వ్యాపారం చేస్తున్నట్లు చూపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు పన్ను రూపంలో రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతోంది. వాణిజ్య పన్నుల శాఖ అధికారుల కనుసన్నల్లోనే వ్యాపారులు తప్పుడు లెక్కలు చూపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వివరాలు వెల్లడించేందుకు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు విముఖత చూపుతుండటంతో అనుమానాలు బలపడుతున్నాయి.
వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ పరిధిలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట సహాయ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాలు ఉన్నాయి. ఒక్క సిద్దిపేట కార్యాలయం పరిధిలోనే వాణిజ్య పన్నుల రూపంలో రాష్ట్ర ఖజానాకు రూ.30 కోట్ల ఆదాయం వస్తోంది. మెదక్, సంగారెడ్డి కార్యాలయాల పరిధిలో వార్షికాదాయ లక్ష్యాన్ని కలుపుకుంటే సుమారు వంద కోట్ల రూపాయలపైనే జిల్లా నుంచి సమకూరుతోంది. అయితే వ్యాపారులు సమర్పించిన టర్నోవర్ ఆధారంగానే వాణిజ్య పన్నుల శాఖ లెక్కలు కడుతోంది. వాస్తవ లావాదేవీలకు, వ్యాపారులు చెల్లిస్తున్న పన్నుల లెక్కలకు పొంతన కనిపించడం లేదు.
వ్యాపారులు ఆన్‌లైన్ విధానంలో సమర్పిస్తున్న లెక్కలను మదింపు చేయడం, లావాదేవీలను తనిఖీ చేసే ప్రక్రియ మొక్కుబడిగా కనిపిస్తోంది. ఒక సర్కిల్ పరిధిలో జరుగుతున్న లావాదేవీలను మరో సర్కిల్ పరిధిలోని సిబ్బంది సంపూర్ణంగా కాకుండా మచ్చుకు మాత్రమే పరిశీలిస్తోంది. దీంతో లావాదేవీలకు సంబంధించిన వాస్తవాలు లెక్కకు అందడం లేదు. మరోవైపు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.40 లక్షలకు పైగా లావాదేవీలు నిర్వహించిన వ్యాపారులు ‘వ్యాట్’ పరిధిలోకి వస్తారు. వ్యాట్ పరిధిలో వున్న వారు ఎక్కువ మొత్తాన్ని పన్నుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, సిబ్బంది సహకారంతో టర్నోవర్‌ను రూ.40 లక్షలు దాటకుండా జాగ్రత్తపడుతున్నారు.
మార్గదర్శకాలు బేఖాతరు
వంద రూపాయలు దాటి న ప్రతీ కొనుగోలుపై వినియోగదారులకు వ్యాపారులు రశీదు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే రూ.7.50 లక్షల టర్నోవర్ దాటిన వ్యాపారులు మాత్రమే వంద రూపాయలు దాటిన లావాదేవీలకు రశీదులు ఇవ్వాలనే నిబంధన విధించారు. దీంతో చిన్న వ్యాపారులు రూ.7.50 లక్షల టర్నోవర్ దాటకుండా కాగితాల మీద లెక్కలు వేసి వాణిజ్య పన్నుల శాఖకు సమర్పిస్తున్నారు. అక్రమ లావాదేవీలను వెలికి తీసేం దుకు దాడులు నిర్వహించాల్సి ఉన్నా, మూడేళ్లుగా ఎక్కడా కేసులు నమోదు చేసిన దాఖలా కనిపించడం లేదు. డిప్యూటీ కమిషనర్ కార్యాలయం నుంచి ఆదేశాలు వస్తేనే దాడులు చేస్తామని స్థానిక అధికారులు చెప్తున్నారు. మరోవైపు పొరుగు రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతుల లావాదేవీలపైనా శాస్త్రీయంగా మదింపు జరగడం లేదు. ఆయా కార్యాలయాల వార్షికాదాయం, కేసుల నమోదువంటి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు గోప్యత పాటిస్తున్నారు. ‘లావాదేవీలు మేం సరిచూసేదేముంది. అన్‌లైన్ పద్ధతిలో వ్యాపారులు పన్ను చెల్లిస్తున్నారు’ అంటూ దాటవేత వైఖరి అవలంబిస్తున్నారు.
లెక్కలన్నీ కిరికిరి!
Published Fri, Oct 4 2013 12:37 AM | Last Updated on Fri, Sep 1 2017 11:18 PM
Advertisement
Advertisement