buttayagudem mandal
-
అల్లరి చేస్తున్నాడని కొడితే.. ప్రాణమే పోయింది!
బుట్టాయగూడెం: అల్లరి చేస్తున్నాడని మందలిస్తూ వెదురు కర్రతో తలపై కొట్టగా బాలుడు మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో శనివారం జరిగింది. దీనికి సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుట్టాయగూడెం మండలం జెగ్గిశెట్టిగూడేనికి చెందిన ఒనుముల రామ్చరణ్ (14), మరికొంతమంది గ్రామంలో ఆడుకుంటున్నారు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన ఒనుముల లక్ష్మణరావు అనే యువకుడు ఆడుకుంటున్న పిల్లల దగ్గరకు వెళ్లి ఎందుకు అల్లరి చేస్తున్నారని మందలించాడు. అయినా వారు ఆడుకుంటుండడంతో తన చేతిలో ఉన్న వెదురు కర్రతో రామ్చరణ్ తలపై కొట్టాడు. దీంతో తలకు గాయమైన రామ్చరణ్ను కుటుంబసభ్యులు స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక వైద్యం చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా రామ్చరణ్ మృతి చెందాడు. కర్రతో కొట్టిన లక్ష్మణరావు మతిస్థిమితం లేని వ్యక్తి అని పోలీసులు తెలిపారు. మృతుడు రామ్చరణ్ తండ్రి ఒనుముల చిన్నబుచ్చిరాజు ఇచ్చిన పిర్యాదు మేరకు ఎస్ఐ ఎం.జయ బాబు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
చేపలు పడుతూ.. ఊబిలో చిక్కుకుని
బుట్టాయగూడెం (జీలుగుమిల్లి): చెరువులో చేపలు పడుతూ ప్రమాదవశాత్తూ ఊబిలో చిక్కుకుని ఊపిరాడక ఓ బాలిక, మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. జీలుగుమిల్లి సమీపంలోని బుడుగల చెరువులో బుధవారం ఈ ఘటన జరిగింది. జీలుగుమిల్లి మండలం వంకావారిగూడేనికి చెందిన ఎం.కల్యాణి (15) ఇటీవల పదో తరగతి పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటుండగా, తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం – భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం రామిరెడ్డిగూడేనికి చెందిన ఎం.మహాలక్ష్మి (31) ఉపాధి పనుల కోసం వంకావారిగూడేనికి వచ్చింది. వర్షాలు బాగా పడుతుండటంతో స్థానికులతో కలిసి వీరు జీలుగుమిల్లి సమీపంలోని బుడుగల చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. చెరువులోకి దిగి వలతో చేపలు పడుతూ ముందుకు వెళ్లారు. అక్కడ అనుకోకుండా ఊబిలో చిక్కుకుని మృతి చెందారు. వీరితో పాటు వెళ్లిన మరో ఇద్దరు మహిళలు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న జీలుగుమిల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ల సీజ్
బుట్టాయగూడెం : మండలంలోని కొవ్వాడ కాలువ నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు మంగళవారం సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. తహసీల్దార్ ఎ.జి.చిన్నికృష్ణ కథనం ప్రకారం.. కొయ్యలగూడెం మండలానికి చెందిన మూడు ట్రాక్టర్లు బుట్టాయగూడెం మండలం కొవ్వాడ నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్టు సమాచారం అందడంతో వీఆర్ఏ పోతురాజు అక్కడికి వెళ్లి పరిశీలించారు. మూడు ట్రాక్టర్లను పట్టుకుని వాటిని సీజ్ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. నిందితులు పరారయ్యారు. ట్రాక్టర్ల యజమానులపై వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పేర్కొన్నారు. మండలంలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.