
బుట్టాయగూడెం: అల్లరి చేస్తున్నాడని మందలిస్తూ వెదురు కర్రతో తలపై కొట్టగా బాలుడు మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో శనివారం జరిగింది. దీనికి సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుట్టాయగూడెం మండలం జెగ్గిశెట్టిగూడేనికి చెందిన ఒనుముల రామ్‌చరణ్ (14), మరికొంతమంది గ్రామంలో ఆడుకుంటున్నారు.
ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన ఒనుముల లక్ష్మణరావు అనే యువకుడు ఆడుకుంటున్న పిల్లల దగ్గరకు వెళ్లి ఎందుకు అల్లరి చేస్తున్నారని మందలించాడు. అయినా వారు ఆడుకుంటుండడంతో తన చేతిలో ఉన్న వెదురు కర్రతో రామ్‌చరణ్ తలపై కొట్టాడు. దీంతో తలకు గాయమైన రామ్‌చరణ్‌ను కుటుంబసభ్యులు స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు.
అక్కడ ప్రాథమిక వైద్యం చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా రామ్‌చరణ్ మృతి చెందాడు. కర్రతో కొట్టిన లక్ష్మణరావు మతిస్థిమితం లేని వ్యక్తి అని పోలీసులు తెలిపారు. మృతుడు రామ్‌చరణ్ తండ్రి ఒనుముల చిన్నబుచ్చిరాజు ఇచ్చిన పిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎం.జయ బాబు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment