kid dead
-
బస్సు డ్రైవర్‌కు ఫిట్స్
శృంగవరపుకోట: బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు ఆకస్మికంగా ఫిట్స్ రావడంతో స్టీరింగ్‌పై పడిపోయాడు. బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంటిని, బాలుడిని ఢీకొట్టింది. బాలుడు మృతిచెందగా, ఇంటి వద్ద ఉన్న మరో మహిళకు గాయాలయ్యాయి. ఎస్.కోట ఆర్టీసీ డిపో నుంచి ఆదివారం ఉదయం విజయనగరం బయలుదేరిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ధర్మవరం శివారు మారుతీనగర్ మలుపు వద్దకు వచ్చేసరికి డ్రైవర్ గంగునాయుడుకు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చింది. డ్రైవర్ స్టీరింగ్‌పై పడిపోవడంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంటిపైకి దూసుకుపోయింది. ఇంటి ముందు ఉన్న బాలుడు శిరికి అభిషేక్ (12)ను, సమీపంలో వంట చేస్తున్న తొత్తడి పాపను ఢీకొట్టింది. అభిషేక్‌ను 108లో ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పాపకు కూడా గాయాలయ్యాయి. -
అల్లరి చేస్తున్నాడని కొడితే.. ప్రాణమే పోయింది!
బుట్టాయగూడెం: అల్లరి చేస్తున్నాడని మందలిస్తూ వెదురు కర్రతో తలపై కొట్టగా బాలుడు మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో శనివారం జరిగింది. దీనికి సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుట్టాయగూడెం మండలం జెగ్గిశెట్టిగూడేనికి చెందిన ఒనుముల రామ్‌చరణ్ (14), మరికొంతమంది గ్రామంలో ఆడుకుంటున్నారు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన ఒనుముల లక్ష్మణరావు అనే యువకుడు ఆడుకుంటున్న పిల్లల దగ్గరకు వెళ్లి ఎందుకు అల్లరి చేస్తున్నారని మందలించాడు. అయినా వారు ఆడుకుంటుండడంతో తన చేతిలో ఉన్న వెదురు కర్రతో రామ్‌చరణ్ తలపై కొట్టాడు. దీంతో తలకు గాయమైన రామ్‌చరణ్‌ను కుటుంబసభ్యులు స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక వైద్యం చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా రామ్‌చరణ్ మృతి చెందాడు. కర్రతో కొట్టిన లక్ష్మణరావు మతిస్థిమితం లేని వ్యక్తి అని పోలీసులు తెలిపారు. మృతుడు రామ్‌చరణ్ తండ్రి ఒనుముల చిన్నబుచ్చిరాజు ఇచ్చిన పిర్యాదు మేరకు ఎస్ఐ ఎం.జయ బాబు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
సెకన్ల వ్యవధిలో బారికేడ్లు దాటారు.. ఆ ఆరోపణలు అవాస్తవం: ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప
అనంతపురం క్రైం: ‘శెట్టూరు మండలం చెర్లోపల్లికి చెందిన గణేష్ ద్విచక్ర వాహనం సెకన్ల వ్యవధిలోనే పోలీస్ బారికేడ్లను దాటి వెళ్లింది. పోలీసులు దారి ఇవ్వకపోవడంతో చిన్నారికి సకాలంలో వైద్యం అందక మృతి చెందిందని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఇలా చేయడం పద్ధతి కాదు’ అని అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప అన్నారు. ఈ నెల 15న మంత్రి ఉషశ్రీ చరణ్ కాన్వాయ్ కోసం పోలీసులు కల్యాణదుర్గంలోని బ్రహ్మయ్య గుడి సమీపంలో వాహన రాకపోకలు ఆపడం వల్ల 8 నెలల చిన్నారి మృతి చెందిందన్న అంశంపై ఎస్పీ ఫక్కీరప్ప స్పందించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గణేష్, ఈరక్క దంపతులు బైక్‌పై వారి 8 నెలల చిన్నారిని ఇంటినుంచి ఆస్పత్రికి తీసుకువచ్చిన దృశ్యాలను సీసీ కెమెరాల ఫుటేజిని మీడియాకు చూపించారు. వివిధ సెల్ టవర్ లొకేషన్లను దాటిన తీరును కూడా వివరించారు. ఈ ఘటనపై లోతుగా విచారణ చేపట్టి శాస్త్రీయ ఆధారాలను సేకరించామన్నారు. మంత్రి ఉషశ్రీ చరణ్ కాన్వాయ్ కోసం చిన్నారి తండ్రి బైక్‌ను పోలీసులు ఆపలేదన్నారు. ‘ఈ నెల 15న సాయంత్రం 6 గంటలకు గణేష్, ఈరక్క దంపతుల చిన్నారికి ఫిట్స్ వచ్చాయి. 6.10 గంటలకు బైక్‌పై చెర్లోపల్లి నుంచి కల్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రికి బయలుదేరారు. మంత్రి ఇంటి సమీపంలోని బ్రహ్మయ్య గుడి పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద 6.36 గంటలకు కన్పించారు. అక్కడి నుంచి సెకన్ల వ్యవధిలోనే ముందుకు సాగారు. సాయంత్రం 6.40 గంటలకు కల్యాణదుర్గం పట్టణంలోకి ప్రవేశించి, 6.48 గంటలకు ఆర్డీటీ ఆస్పత్రికి చేరారు. 6.50 గంటలకు ఓపీ తీసుకున్నట్లు ఆస్పత్రి రికార్డుల్లో నమోదైంది. 7.18 గంటలకు చిన్నారి మృతిని వైద్యులు ధ్రువీకరించారు. చెర్లోపల్లి నుంచి ఆర్డీటీ ఆస్పత్రికి 20 కిలోమీటర్ల దూరం ఉంది. బైక్‌పై 38 నిమిషాల వ్యవధిలోనే ఆస్పత్రికి చేరుకున్నారు. చిన్నారి మృతి చెందిన తర్వాత కూడా అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని గణేష్ కుటుంబీకులను పోలీసులు కోరారు. కానీ వారు నిరాకరించారు. రాత్రి 8.15 గంటల సమయంలో చిన్నారి మృతదేహంతో రోడ్డుపై ఆందోళనకు దిగారు’ అని ఎస్పీ వివరించారు. రాద్ధాంతం చేయొద్దు చిన్నారి మృతి చెందడం చాలా బాధగా ఉందని, కానీ కొందరు వాస్తవాలను వక్రీకరించి లేనిపోని రాద్ధాంతం చేయడం సరికాదని ఎస్పీ ఫక్కీరప్ప అన్నారు. చిన్నారి తల్లిదండ్రులు అమాయకులని, వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయబోమని స్పష్టం చేశారు. ఎవరైనా పోలీసులపై బురద జల్లడమే కాకుండా శాంతిభద్రతల సమస్యకు కారణమైతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
జవానే 'హంతకుడు'! వీడిన బాలుడి హత్య కేసు మిస్టరీ
ఒంగోలు: దేశ ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఓ సైనికుడే నరరూప రాక్షసుడిగా మారాడు. అభంశుభం తెలియని బాలుడిపై లైంగిక దాడి చేసి.. ఆపై దారుణంగా హత్య చేశాడు. పోలీసులకు దొరకకుండా తప్పించుకునేందుకు.. ప్రూఫ్ లేని సిమ్‌తో బెదిరింపు డ్రామాలాడాడు. చివరకు పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేసే పరిస్థితి తలెత్తడంతో అర్ధరాత్రి పూట వీఆర్వో ముందు లొంగిపోయాడు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఈ నెల 22 జరిగిన బాలుడి హత్య వెనుక మిస్టరీ వీడింది. ఈ వివరాలను ఎస్పీ మలికాగర్గ్ ఆదివారం ఒంగోలులో మీడియాకు వెల్లడించారు. కొమరోలు మండలం అక్కపల్లికి చెందిన భూమా శ్రీనాథ్(11) ఈనెల 22న స్నేహితులతో ఆడుకునేందుకు వెళ్లి అదృశ్యమయ్యాడు. దీనిపై బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనాథ్ కోసం పోలీసులు గాలిస్తుండగా.. 25వ తేదీన కత్తులవానిపల్లి–ఇడమకల్లు గ్రామాల మధ్య ఉన్న రెడ్డి బావిలో మృతదేహం దొరికింది. శరీరానికి రాయి కట్టి ఉండటంతో.. హత్యగా నిర్ధారించుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే సమయంలో వారిని పక్కదారి పట్టించేందుకు నిందితుడు ఎలాంటి ప్రూఫ్ లేని సిమ్‌కార్డును ఉపయోగించి బాలుడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. వెంటనే రూ.50 లక్షలు ఇవ్వాలని.. లేకుంటే మరొకరిని చంపేస్తానని హెచ్చరించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సాంకేతికతను ఉపయోగించి నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇక తనను అరెస్టు చేస్తారని అర్థం చేసుకున్న దోనపాటి వెంకట ప్రశాంత్ (21) బాలుడ్ని తానే హత్య చేసినట్లు అంగీకరిస్తూ శనివారం అర్ధరాత్రి గ్రామ వీఆర్వో వద్ద లొంగిపోయాడు. వీఆర్వో అతడిని వెంటనే పోలీసులకు అప్పగించారు. అక్కపల్లికి చెందిన ప్రశాంత్ పంజాబ్‌లోని భటిండా రెజిమెంట్‌లో సైనికుడిగా పనిచేస్తున్నాడు. సెలవుపై ఇటీవల ఇంటికి వచ్చాడు. అశ్లీల వీడియోలు ఎక్కువగా చూసే ప్రశాంత్.. 22వ తేదీన స్నేహితులతో ఆడుకుంటున్న శ్రీనాథ్ ద్వారా కూల్‌డ్రింక్ తెప్పించుకున్నాడు. అనంతరం తన బైక్‌పై ఎక్కించుకుని రెడ్డి బావి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ బాలుడ్ని భయపెట్టి.. లైంగిక దాడి చేశాడు. బాలుడు పెద్దగా కేకలు వేస్తుండటంతో.. ప్రశాంత్ గొంతు పిసికి చంపేశాడు. మృతదేహానికి బండరాయి కట్టి బావిలో పడేశాడు. నిందితుడు వెంకట ప్రశాంత్‌పై ఐపీసీ సెక్షన్లు 364, 377, 302, 201, పోక్సో యాక్టు సెక్షన్ 6 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. దర్యాప్తులో పాల్గొన్న మార్కాపురం ఓఎస్డీ కె.చౌడేశ్వరి, మార్కాపురం డీఎస్పీ డాక్టర్ ఎం.కిషోర్ కుమార్, గిద్దలూరు సీఐ ఫిరోజ్‌లను ఎస్పీ మలికాగర్గ్ అభినందించారు. -
గాలిపటం దారమే.. యమపాశమై
గుంటూరు ఈస్ట్: అమ్మమ్మ ఇంటికెళ్దామని ఎంతో సంతోషంగా తండ్రితో బయల్దేరిన ఆ చిన్నారిని గాలిపటం దారం యమపాశమై పొట్టనపెట్టుకుంది. నాన్నా.. ఈ రోజు స్కూల్‌కి సెలవు.. అమ్మమ్మ ఇంటికెళ్లి ఆడుకుంటా అని కొద్దిసేపటి క్రితం ముద్దులొలుకుతూ చెప్పిన మూడేళ్ల కొడుకు.. గాలిపటం మాంజా చుట్టుకుని తన ఒడిలోనే కళ్లముందే ప్రాణాలు వదలడంతో ఆ తండ్రి కన్నీరుకు అంతేలేదు. గుంటూరు నగరంలో సోమవారం ఈ విషాదం చోటుచేసుకుంది. గుంటూరు నగరం కాకుమానువారితోట నాలుగో లైన్‌కు చెందిన తలకొండపాటి దుర్గారావు ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగి. దుర్గారావు దంపతులకు ఆదిత్య(5), కౌశిక్(3)లు సంతానం. సోమవారం పాఠశాలల బంద్ కావడంతో సెలవు ప్రకటించారు. దుర్గారావు ఇద్దరు కొడుకులను అత్తగారింట్లో వదిలిపెట్టేందుకు ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. పెద్దకుమారుడు ఆదిత్యను ద్విచక్రవాహనం వెనుక.. కౌశిక్‌ను ముందు కూర్చోబెట్టుకున్నాడు. అమ్మమ్మ ఇంటికి చేరకుండానే.. అమ్మమ్మ ఇంటికి బయల్దేరిన చిన్నారి కౌశిక్ గమ్యం చేరలేదు. మరికొద్ది నిమిషాల్లో అమ్మమ్మ ఇల్లు చేరేలోపే ఎవరో పిల్లలు సరదాగా ఆడుకోవడానికి ఎగురవేసిన గాలిపటం దారం ఆ పిల్లవాడి పాలిట యమపాశమైంది. బైక్ లాంచస్టర్ రోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాల వద్దకు చేరేసరికి.. సమీపంలోని పిల్లలు ఎగురవేసిన గాలిపటం దారం కౌశిక్ మెడకు చుట్టుకుంది. వాహనం వేగంగా వెళ్లడం వల్ల కౌశిక్ మెడకు దారం గట్టిగా బిగుసుకుని మెడ కోసుకుపోయింది. కొడుకు గట్టిగా అరవడంతో ఉలిక్కిపడ్డ దుర్గారావు వాహనం ఆపి దారాన్ని తొలగించాడు. స్థానికుల సాయంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. మెరుగైన చికిత్స కోసం బాలుడిని జీజీహెచ్‌కు తరలించగా.. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో కౌశిక్ మృతిచెందాడని వైద్యులు ప్రకటించారు.అమ్మమ్మ ఇంట్లో సరదాగా ఆడుకోవాల్సిన చిన్నారి విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పుత్రశోకాన్ని మిగిల్చిన ఈత సరదా..
సాక్షి, డోర్నకల్(వరంగల్ ): తల్లిదండ్రులకు తెలియకుండా ఈత నేర్చుకోవాలన్న సరదా ప్రాణాలను తీయడమే కాకుండా పుత్రశోకాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఫకీరాతండాకు చెందిన బానోత్ రామా, విజయ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్దకుమారుడైన బానోత్ ప్రవీణ్(13) ఖమ్మం ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి పూర్తి చేశాడు. రెండు రోజులలో సెలవులు పూర్తి కానుండటంతో తిరిగి ఖమ్మం వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ప్రవీణ్ తండ్రి రామా ఖమ్మం వెళ్లాడు. దీంతో తమ్ముడు, మిత్రులతో కలిసి తండా సమీపంలోని చెరువు పక్కనే ఉన్న వ్యవసాయ బావికి ఈతకు వెళ్లాడు. ప్రవీణ్‌కు ఈత రాకున్నా ఖాళీ కూల్‌డ్రింక్, వాటర్ బాటిళ్లకు మూతలు బిగించి వాటికి తాడు కట్టి నడుం చుట్టూ కట్టుకున్నాడు. ఖాళీ బాటిళ్లను నడుంకు కట్టుకోవడంతో నీటిలోకి దిగినా గాలిలో తేలుతుండటంతో వాటి సహాయంతో ఈత కొట్టసాగాడు. నీటి మధ్యలోకి వెళ్లిన తరువాత నడుంకు ఉన్న తాడు తెగిపోవడంతో కేకలు వేస్తూ నీట మునిగాడు. ప్రవీణ్ నీట మునిగిన విషయాన్ని గమనించిన మిత్రులు తండా పెద్దలకు సమాచారం అందించారు. తండావాసులు వచ్చి బావిలోకి దిగి వెతికినా ప్రవీణ్ ఆచూకీ దొరకలేదు. 108 వాహనంతో పాటు డోర్నకల్ సీఐ జె.శ్యాంసుందర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. తండావాసులు పలు వ్యవసాయ పనిముట్ల సహకారంతో రెండు గంటల పాటు శ్రమించి బావి అడుగున ఉన్న ప్రవీణ్ మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రవీణ్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి గూడూరు: తల్లి ఇంట్లో పనిలో నిమగ్నమైన ఉండగా ఇంటి ముందు ఉన్న ఓ చిన్నారి నీటి తొట్టిలో పడి మృతి చెందిన సంఘటన మండలంలోని దుబ్బగూడెంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..దుబ్బగూడెంకు చెందిన మూడు రమేష్ దంపతుల రెండో కూతురు అభినయ (1) ఇంటి ముందు ఆడుకుంటుంది. ఈ క్రమంలో తల్లి ఇంట్లో పనిలో నిమగ్నమై ఉంది. కొద్ది సేపటి తరువాత బయటికి వచ్చిన కూతురు కనిపించకపోవడంతో వెతికింది. ఆ తరువాత ఇంటి పక్కనే ఉన్న నీటి తొట్టిలో పడి ఉండడాన్ని చూసి బోరున విలపించి బయటికి తీసింది. అప్పటికే చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
చికిత్స పొందుతూ చిన్నారి ప్రణతి మృతి
హైదరాబాద్: యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం వద్ద ఈ నెల 8న పోలీసు వాహనం ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ప్రణతి ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది. వివరాలు.. ఎల్బీనగర్ చైతన్యపురి డివిజన్ మున్సిపల్ కాలనీకి చెందిన పి.మల్లేష్ జీహెచ్ఎంసీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి. 7 నెలల క్రితం మల్లేశ్ భార్య సంధ్య డెంగ్యూ వ్యాధితో మృతి చెందింది. మల్లేశ్‌కు ఇద్దరు కుమార్తెలు ప్రీతి (5), ప్రణతి (మూడున్నరేళ్లు) ఉన్నారు. అక్క కుమార్తె నవీనకు బియ్యం పోస్తుండటంతో ఈ 8వ తేదీ సాయంత్రం తన తల్లి, పిల్లలతో కలసి మల్లేశ్ యాదగిరిగుట్టకు వెళ్లాడు. అనంతరం 9వ తేదీ ఉదయం పాత లక్ష్మీనర్సింహస్వామి గుడిలో సత్యనారాయణస్వామి వ్రతం చేయించుకునేందుకు బంధువులతో కలసి పాత గుట్టకు వెళ్లాడు. ఈ క్రమంలో మల్లేశ్ తన తల్లి బుచ్చ మ్మ, చిన్న కుమార్తె ప్రణతితో కలసి దేవాలయానికి ఎదురుగా ఉన్న పార్కింగ్లోని చెట్టు నీడలో సేద తీరుతున్నారు. ఈ సమయంలో అటుగా వచ్చిన యాదాద్రి పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసు వాహనం (టీఎస్09 పీఏ 5508) నీడలో సేద తీరుతున్న మల్లేశ్, ప్రణతిలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ప్రణతిని ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ప్రణతి ఆదివారం తెల్లవారుజామున 5.45 గంటలకు మృతి చెందింది. దీంతో చిన్నారి తండ్రి మల్లేశ్, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ప్రమాదానికి వాహన డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు, కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల క్రితం భార్య, ఇప్పుడు కుమార్తె మృతి చెంద డంతో మల్లేశ్ బోరున విలపించాడు. ప్రణతి అంత్యక్రియలను సైదాబాద్ దోభిఘాట్ శ్మశానవాటికలో నిర్వహించారు. ప్రణతి మృతి చెందిన సమాచారం అందుకున్న రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఆస్పత్రికి చేరుకుని చిన్నారి మృతదేహానికి నివాళులర్పించారు. ప్రణతి అక్క ప్రీతి చదువుకు అయ్యే ఖర్చును భరిస్తామని, ఆర్థికంగా సాయం అందిస్తామని ఎల్బీనగర్ ఏసీపీ పృద్వేందర్రావు తెలిపారు. చిన్నారి అంత్యక్రియలకు పోలీసులు రూ.50 వేలు ప్రణతి కుటుంబసభ్యులకు అందజేశారు. -
చిన్నారిని చిదిమేసిన పాఠశాల బస్సు
పెర్కిట్(ఆర్మూర్): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో శుక్రవారం ఉదయం స్కూల్ బస్ చక్రాల క్రింద నలిగి సమీర కౌసర్ (2) అనే చిన్నారి మృతి చెందింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన షేక్ మహబూబ్ జీవనోపాధికోసం ఐదు సంవత్సరాల కిత్రం మామిడిపల్లికి వలస వచ్చారు. మహబూబ్‌కు భార్య ఉమెద్ సౌద, కూతురు సమీర కౌసర్ ఉంది. మహబూబ్ స్థానిక విద్యానగర్‌లో ఉంటూ నూతనంగా నిర్మించే ఇళ్లలో టైల్స్ వేస్తూ జీవనం సాగిస్తుంటాడు. కాగా, వీరి ఇంటి పక్కనే నివాసముంటున్న లక్ష్మీ అనే మహిళ తన పిల్లలను మామిడిపల్లిలోని సేయింట్‌పాల్ స్కూల్లో చదివిస్తుంటుంది. రోజూ తన పిల్లలను బస్‌లో ఎక్కించడానికి వెళ్తూ సమీర కౌసర్‌ను సైతం వెంట తీసుకెళ్తుంది. తన పిల్లలను బస్ ఎక్కించే సమయంలో ఒడిలో ఉన్న సమీరను కిందకు దించింది. అదే సమయంలో చిన్నారి బస్ కిందకు వెళ్లింది. బస్ డ్రైవర్ గమనించకుండా నడపడంతో చిన్నారి చక్రాల కింద పడి నలిగి పోయింది. ఎస్‌హెచ్‌వో సీతారాం, ఎస్ఐలు యాకూబ్, గోపి ఘటన స్థలిని పరిశీలించారు. తండ్రి మహబూబ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. ఏడు నెలల గర్భవతిగా ఉన్న తల్లి ఉమెద్ సౌద తన కుమార్తె చనిపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనయింది. -
అన్న కోసం ఎదురెళ్లి..
కామవరపుకోట : అన్న వస్తున్నాడనే సంతోషంతో ఎదురెళ్లిన ఆ చిన్నారి అనూహ్యంగా కానరాని లోకాలకు చేరుకుంది. తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురి చేసిన ఈ ఘటన మండలంలోని ఆడమిల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఆడమిల్లికి చెందిన వేముల వెంకటేశ్వరరావు కుమారుడు గణేశ్ కామవరపుకోటలోని ఒక ప్రైవేట్ విద్యాసంస్ధలో ఎల్కేజీ చదువుతున్నాడు. అతడు రోజూ పాఠశాలకు చెందిన బస్సులో వెళ్లి వస్తాడు. రోజూ సాయంత్రం బస్సు వచ్చే సమయానికి అన్న కోసం లోహిత (3) బస్సు వద్దకు వెళుతుంది. శుక్రవారం కూడా అన్న వచ్చాడన్న సంతోషంతో లోహిత బస్సు వద్దకు వెళ్లింది. బస్సు దిగిన గణేష్ ఇంటికి వెళుతుండగా అతడి వెనుకే లోహిత వెళుతోంది. ఈలోగా అదే స్కూల్ బస్ వెనుక నుంచి లోహితను ఢీకొట్టింది. దీంతో చిన్నారి బస్సు చక్రం కింద పడి మరణించింది. ఈ ఘటనతో స్థానికులంతా అవాక్కయ్యారు. అప్పటివరకు తమ మధ్య ఆడుతూపాడుతూ తిరిగిన చిన్నారి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆమె తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా ప్రమాదానికి కారణమైన బస్సును డైవర్ ఆపకుండా వెళ్లిపోవడంతో గ్రామస్తులు కామవరపుకోట స్కూల్ వద్దకు వచ్చి ఆ బస్సును డ్రైవర్‌తో పాటు ఆడమిల్లి తీసుకెళ్లారు. తడికలపూడి స్టేషన్ హౌస్ ఆఫీసర్ దీక్షితులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నాలుగేళ్లకే నూరేళ్లు నిండాయి
కలెక్టర్ సారూ... నా వయసు నాలుగేళ్లే...ఇప్పుడిప్పుడే లోకం తెలుసుకుంటున్న సమయంలోనే నా శ్వాస ఆగిపోయింది. మా ఏజెన్సీప్రాంతంలో అమ్మ ఒడికి చేరకుండానే అకాలంగా మృత్యు కౌగిల్లోకి చేరిపోయిన ఎంతో మందిలానే నేను కూడా. జిల్లా కేంద్రమైన కాకినాడలో బతికిస్తారేమో... అమ్మ చెంత పెరిగి... నాన్న భుజాలపైకెక్కి ఈ లోకాన్ని చూస్తాననుకున్నా... జీవితంలో పైకెదుగుతాననుకున్నా... ఆ ఆశ అడియాసైంది... నా ప్రాణయాత్ర ఆగిపోయింది. అడ్డతీగల (రంపచోడవరం): తీవ్ర జ్వరంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ అడ్డతీగల మండలం వేటమామిడి గ్రామానికి చెందిన మద్దికొండ అలకనంద (4) అనే బాలిక సోమవారం రాత్రి మృతి చెందింది. ఐదు రోజుల క్రితం జ్వరం తీవ్రంగా రావడంతో తమ కుమార్తెను తొలుత కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు మృతురాలి తండ్రి ఆనంద్ తెలిపారు. రెండు రోజుల అనంతరం తాము ఇక చికిత్స చేయలేమని, ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లమన్న అక్కడి వైద్యుల సూచన మేరకు కాకినాడలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లామని వివరించారు. మూడు రోజులుగా చికిత్స చేస్తున్నారని, బాలికకు మలేరియా, టైఫాయిడ్, డెంగీ ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించి చికిత్స అందించినా ఫలితం లేకపోయిందని, సోమవారం రాత్రి చనిపోయిందని ఆ తండ్రి కన్నీళ్ల పర్యంతమయ్యారు. -
నిర్లక్ష్యం ఖరీదు..నిండు ప్రాణం
సాక్షి , ఖమ్మం క్రైం : ఒకడి అంతులేని నిర్లక్ష్యం.. బాలుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. ఆ తల్లిదండ్రులకు ఆజన్మ గర్భ శోకాన్ని మిగిల్చింది. ⇔ తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం గ్రామానికి చెందిన నిరుపేద దంపతులు అర్వపల్లి రాము, రమ. బతుకుదెరువు కోసం ఖమ్మం వచ్చారు. నగరంలోని మామిళ్లగూడెంలోగల ఎస్ఎన్ మూర్తి తోట ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు వర్షిత్(7), హర్షిత్(5). దగ్గరలోగల పాఠశాలలో వర్షిత్ రెండోతరగతి చదువుతున్నాడు. శ్రీనివాస థియేటర్ సమీపంలోగల ఎలక్ట్రికల్ షాపులో గుమస్తాగా రాము పనిచేస్తున్నాడు. తాము నివాసముంటున్న ప్రాంతంలోనే ఇటీవల చిన్న కిరాణం దుకాణం పెట్టుకున్నారు. ⇔ బుధవారం రోజున పిల్లలిద్దరూ ఇంట్లో ఆడుకుంటున్నారు. పండుగ కోసం పిండి వంటలు చేద్దామనుకుంది ఆ తల్లి. పిండి పట్టించేందుకు బియ్యపు సంచీని వర్షిత్‌కు ఇచ్చి, తండ్రి నడుపుతున్న కిరాణా దుకాణానికి పంపింది. ఆ చిన్నారి వడివడిగా నడుచుకుంటూ రోడ్డు దాటుతున్నాడు. ⇔ అక్కడున్న ఖాళీ స్థలంలో ఓ ట్రాక్టర్ ఎప్పుడూ ఖాళీగా ఉండేది. సరిగ్గా అదే సమయంలో దానిని యజమాని కొప్పుల రామకృష్ణారెడ్డి నడుపుకుంటూ రోడ్డు మీదకు వేగంగా తీసుకొచ్చాడు. ఆ రోడ్డు అసలే చాలా చిన్నది. వేగంగా వచ్చిన ఆ ట్రాక్టర్.. రోడ్డుపై నడుస్తున్న చిన్నారి వర్షిత్‌ను ఢీకొనొ కొంత దూరం లాక్కెళ్లింది. ఆ తరువాత అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాల్వలోకి దూసుకెళ్లింది. ⇔ ఆ చిన్నారి.. అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. తల, ముఖం ఛిద్రమైంది. చేతిలోని బియ్యపు సంచి ఎగిరిపడింది. ⇔ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. స్థానికులు కంట తడి పెట్టారు. ⇔ ట్రాక్టర్‌ను నడిపిన యజమాని పారిపోయాడు. అతని కోసం స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలతో గాలించారు. అక్కడకు దగ్గరలోగల అతడి నుంచి ఏ ఒక్కరూ కూడా బయటకు రాకపోవడంపై స్థానికులు మండిపడ్డారు. ⇔ ప్రమాద స్థలాన్ని ఖమ్మం అర్బన్ సీఐ నాగేంద్రచారి పరిశీలించారు. టూటౌన్ ఎస్ఐ కృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వాగులో పడి మూడేళ్ల బాలుడు మృతి
రంగన్నగూడెం (హనుమాన్‌జంక్షన్ రూరల్): బాపులపాడు మండలం రంగన్నగూడెంలోని వెట్టివాగులో పడి మూడేళ్లు బాలుడు దుర్మరణం చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పొలుకొండ హేమంత్ (3) సాయంత్రం సమయంలో ఆడుకుంటూ ఇంటికి దగ్గరలోని వెట్టివాగు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తూ వాగులో పడిపోయాడు. పొలవరం కుడిప్రధానకాలువ నుంచి గోదావరి నీళ్లను వెట్టివాగు ద్వారా వీరవల్లి చెరువుకు తరలిస్తుండటంతో వాగులో నీటి ఉధృతి ఎక్కువగా ఉంది. వెట్టివాగులో పడిన బాలుడు హేమంత్ నీటి ప్రవాహానికి కొద్దిదూరం కొట్టుకుపోవటంతో స్థానికులు చూసి రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు బాలుడి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. హేమంత్ మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబు గుండెలవిసేలా ఏడ్చారు. అప్పటివరకు కళ్ల ముందు నవ్వుతూ ఆటలాడుకున్న కొడుకు క్షణాల్లో విగతజీవిగా మారటం ఆ తల్లిదండ్రులకు తీవ్రశోకాన్ని మిగిల్చింది.