విలేకరులతో మాట్లాడుతున్న ఎస్పీ ఫక్కీరప్ప
అనంతపురం క్రైం: ‘శెట్టూరు మండలం చెర్లోపల్లికి చెందిన గణేష్ ద్విచక్ర వాహనం సెకన్ల వ్యవధిలోనే పోలీస్ బారికేడ్లను దాటి వెళ్లింది. పోలీసులు దారి ఇవ్వకపోవడంతో చిన్నారికి సకాలంలో వైద్యం అందక మృతి చెందిందని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఇలా చేయడం పద్ధతి కాదు’ అని అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప అన్నారు. ఈ నెల 15న మంత్రి ఉషశ్రీ చరణ్ కాన్వాయ్ కోసం పోలీసులు కల్యాణదుర్గంలోని బ్రహ్మయ్య గుడి సమీపంలో వాహన రాకపోకలు ఆపడం వల్ల 8 నెలల చిన్నారి మృతి చెందిందన్న అంశంపై ఎస్పీ ఫక్కీరప్ప స్పందించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గణేష్, ఈరక్క దంపతులు బైక్‌పై వారి 8 నెలల చిన్నారిని ఇంటినుంచి ఆస్పత్రికి తీసుకువచ్చిన దృశ్యాలను సీసీ కెమెరాల ఫుటేజిని మీడియాకు చూపించారు.
వివిధ సెల్ టవర్ లొకేషన్లను దాటిన తీరును కూడా వివరించారు. ఈ ఘటనపై లోతుగా విచారణ చేపట్టి శాస్త్రీయ ఆధారాలను సేకరించామన్నారు. మంత్రి ఉషశ్రీ చరణ్ కాన్వాయ్ కోసం చిన్నారి తండ్రి బైక్‌ను పోలీసులు ఆపలేదన్నారు. ‘ఈ నెల 15న సాయంత్రం 6 గంటలకు గణేష్, ఈరక్క దంపతుల చిన్నారికి ఫిట్స్ వచ్చాయి. 6.10 గంటలకు బైక్‌పై చెర్లోపల్లి నుంచి కల్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రికి బయలుదేరారు. మంత్రి ఇంటి సమీపంలోని బ్రహ్మయ్య గుడి పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద 6.36 గంటలకు కన్పించారు. అక్కడి నుంచి సెకన్ల వ్యవధిలోనే ముందుకు సాగారు.
సాయంత్రం 6.40 గంటలకు కల్యాణదుర్గం పట్టణంలోకి ప్రవేశించి, 6.48 గంటలకు ఆర్డీటీ ఆస్పత్రికి చేరారు. 6.50 గంటలకు ఓపీ తీసుకున్నట్లు ఆస్పత్రి రికార్డుల్లో నమోదైంది. 7.18 గంటలకు చిన్నారి మృతిని వైద్యులు ధ్రువీకరించారు. చెర్లోపల్లి నుంచి ఆర్డీటీ ఆస్పత్రికి 20 కిలోమీటర్ల దూరం ఉంది. బైక్‌పై 38 నిమిషాల వ్యవధిలోనే ఆస్పత్రికి చేరుకున్నారు. చిన్నారి మృతి చెందిన తర్వాత కూడా అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని గణేష్ కుటుంబీకులను పోలీసులు కోరారు. కానీ వారు నిరాకరించారు. రాత్రి 8.15 గంటల సమయంలో చిన్నారి మృతదేహంతో రోడ్డుపై ఆందోళనకు దిగారు’ అని ఎస్పీ వివరించారు.
రాద్ధాంతం చేయొద్దు
చిన్నారి మృతి చెందడం చాలా బాధగా ఉందని, కానీ కొందరు వాస్తవాలను వక్రీకరించి లేనిపోని రాద్ధాంతం చేయడం సరికాదని ఎస్పీ ఫక్కీరప్ప అన్నారు. చిన్నారి తల్లిదండ్రులు అమాయకులని, వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయబోమని స్పష్టం చేశారు. ఎవరైనా పోలీసులపై బురద జల్లడమే కాకుండా శాంతిభద్రతల సమస్యకు కారణమైతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment