మన బిడ్డల భవిష్యత్‌ కోసం జగన్‌ కావాలి | YSRCP Ministers and Leaders in Samajika Sadhikaratha Bus Yatra | Sakshi
Sakshi News home page

మన బిడ్డల భవిష్యత్‌ కోసం జగన్‌ కావాలి

Published Fri, Oct 27 2023 4:44 AM | Last Updated on Fri, Oct 27 2023 4:44 AM

YSRCP Ministers and Leaders in Samajika Sadhikaratha Bus Yatra - Sakshi

అనంతపురం జిల్లా శింగనమలలో జరిగిన సామాజిక సాధికార యాత్ర సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నేతలు

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘ఇన్నేళ్లూ ప్రభుత్వా­లన్నీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగానే చూశాయి. వాడుకుని వదిలేశాయి. కానీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాక మన బిడ్డలకు ఇంగ్లిష్‌ చదువులు చెబుతున్నారు. వారి రక్షణకు భరోసా కల్పిస్తున్నారు, అక్కచెల్లెమ్మలకు చేయూతనిస్తు­న్నారు. అవ్వా తాతలను మనవడిలా వెంట ఉండి నడిపిస్తున్నాడు.

మన బిడ్డల ఉన్నత చదువులకు, వారి భవిష్యత్‌కు మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని పలువురు మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలు చెప్పారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో చేపట్టిన సామాజిక సాధికార యాత్ర గురువారం భారీ జన సందోహంమధ్య పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో సాగింది. సాయంత్రం 5 గంటలకు బుక్కరాయ­సముద్రం సభా వేదిక వద్దకు చేరుకుంది. 

సాధికారత అంటే ఏంటో చేసి చూపించారు: మంత్రి ఉషశ్రీ
సామాజిక సాధికారత అంటే ఏమిటో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేసి చూపించారని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌ చెప్పారు. మహిళా సాధికారత కోసం రూ.25 వేల కోట్లు వెచ్చించారని తెలిపారు. జనరంజక పాలన అందించారని, ప్రతి ఎమ్మెల్యే కూడా ఆయన పేరు చెప్పుకుని గర్విస్తున్నామన్నారు.

కేబినెట్‌లో పదకొండు మంది బీసీ మంత్రులు: అంజాద్‌ బాషా
సీట్లు, ఓట్లతో పాటు మంత్రి పదవులు, ఇతర పద­వుల్లోనూ సామాజిక న్యాయం కల్పించిన సీఎం జగన్‌ అన్ని వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చా­రని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా చెప్పా­రు. జగన్‌ హయాంలో 11 మంది బీసీలు, ఐదు­గు­రు ఎస్సీలు మంత్రులయ్యారన్నారు. 2024­లో పేదలకు–పెత్తందార్లకు మధ్య కురు­క్షేత్ర సంగ్రామం జరుగుతోందని, పేదల పక్షాన మ­నం­ద­రం జగన్‌కు ఓటేసి గెలిపించుకో­వాలని చెప్పారు.

స్వాతంత్య్రం ఇప్పుడే వచ్చింది: మంత్రి జయరాం
భారత స్వాతంత్య్ర చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు ఇప్పుడే అసలు సిసలు స్వాతంత్య్రం వచ్చిందని కార్మిక శాఖ మంత్రి జి.జయరాం చెప్పారు. పదవుల్లో, ఉద్యోగాల్లో, సంక్షేమ పథకాల లబ్ధిలో అన్నింటా స్వేచ్ఛ వచ్చిందన్నారు. పల్లెల్లో ప్రతి తల్లి, ప్రతి తండ్రీ జగన్‌ను కొడుకుగా భావిస్తున్నారని, చదువుకునే చిన్నారులతో మేనమామగా పిలిపించుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్‌ అని తెలిపారు.

ఎస్సీలకు మేలు జరగకుండా బాబు అడ్డుకున్నారు: ఎంపీ సురేష్‌
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తే మురికివాడ అవుతుందని చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకొన్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ చెప్పారు. పేదలందరికీ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందిస్తున్న ఘనత వైఎస్‌ జగన్‌దేనని అన్నారు. 14 ఏళ్ల సీఎం అనుభవం నలభై ఏళ్ల కుర్రాడి ముందు వెలవెల పోయిందని అన్నారు. 

శింగనమల సెంటిమెంటు పనిచేస్తుంది: జొన్నలగడ్డ
శింగనమల నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, మీరందరూ ఇక్కడ మళ్లీ వైఎస్సార్‌సీపీకి ఓటేసి జగన్‌ను సీఎం చెయ్యాలని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కోరారు. నియోజకవర్గంలో 40 చెరువులను లోకలైజ్‌ చేసి రైతులకు జగన్‌ అండగా నిలిచారని, ఈ నియోజకవర్గంపై ఆయనకు ప్రత్యేక ప్రేమ ఉందన్నారు. జగన్‌ అన్నట్టు 175కు 175 సీట్లు సాధ్యమే అని తెలిపారు.

ఈ యాత్రలో ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, సిద్దారెడ్డి, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, మంగమ్మ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ నదీం అహ్మద్, బీసీ సెల్‌ రీజనల్‌ కోఆర్డినేటర్‌ బీసీ రమేష్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement