ఎమ్మెల్యే బాలకృష్ణ ఆచూకీ ఎక్కడ?: వైఎస్సార్‌సీపీ
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: పుట్టపర్తి ఏఎస్పీ ఆర్ల శ్రీనివాస్‌ను వైఎస్సార్‌సీపీ నేతల బృందం సోమవారం కలిసింది. హిందూపురం నియోజకవర్గంలో అత్తా కోడలిపై సామూహిక లైంగికదాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఏఎస్పీని కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ హిందూపురం సమన్వయకర్త దీపిక తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మీడియాతో మాట్లాడుతూ, నిందితులను పట్టుకోవడంలో పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
అత్తాకోడళ్లపై జరిగిన ఘటనతో అనంతపురం జిల్లా ఉలిక్కిపడింది. మహిళలు, సామాన్య ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. నిందితులను తక్షణం అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేసేవరకు వైఎస్సార్సీపీ పోరాడుతుంది. ఈ ఘటనపై జిల్లా మంత్రి సవిత సాయంత్రానికల్లా నిందితులను అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. ఎస్పీ నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పి వదిలేశారు. స్థానిక (హిందూపూర్) ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆచూకీ తెలియడం లేదు. ఇంతవరకు ఈ ఘటనపై గా ఆయన స్పందించకపోవడం దారుణం.’’ అని ఉషశ్రీచరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలు సరిపోవడం లేదు. పుంగనూరు ఘటనలోనూ మూడు రోజులైనా పోలీసులు స్పందించలేదు. మా నాయకులు వైఎస్ జగన్ వస్తారని తెలియగానే మంత్రులు పర్యటించారు. అప్పటిదాకా ప్రభుత్వంలో కానీ, పోలీసుల్లో కానీ చలనం లేదు ఈ ఘటనలోనూ వైఎస్ జగన్ వస్తే తప్ప బాధితులకు న్యాయం చేయరా..? అలాగే అయితే మా నాయకులు ప్రజల కోసం రావడానికి ఎప్పుడూ సిద్ధమే’’ అని ఉషశ్రీచరణ్ పేర్కొన్నారు.
బాలకృష్ణకు బాధితులను పరామర్శించే తీరిక లేదా?: దీపిక
ఎమ్మెల్యే బాలకృష్ణకు బాధితులను పరామర్శించే తీరిక లేదా? అంటూ హిందూపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దీపిక ప్రశ్నించారు. చిలమత్తూరు మండలం నల్లబొమ్మలపల్లి గ్రామంలో పక్క రాష్ట్రం నుంచి ఉపాధి కోసం వచ్చి నివాసం ఉంటున్న కుటుంబంలోని అత్తా కోడళ్లపై శనివారం లైంగికదాడి జరిగింది. స్ధానికుల సాయంతో శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంత జరిగినా నియోజకవర్గ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆచూకీ లేదు. ఆయనకు నియోజకవర్గ ప్రజల మాన ప్రాణాలపై ఇంత నిర్లక్ష్యమా. ఫోన్లో పరామర్శించి చేతులు దులిపేసుకోవడం న్యాయమా? రెండు రోజుల తర్వాత మంత్రి సవిత వచ్చి హడావుడి చేసి వెళ్లారు. సంఘటన జరిగిన 12 గంటల్లోనే ప్రతిపక్ష పార్టీ నుంచి మేం బాధితులకు అండగా నిలబడితే, వ్యవస్థలన్నీ చేతుల్లో ఉంచుకుని నిందితులను పట్టుకోవడానికి ప్రభుత్వం ఎందుకంత తాత్సారం చేస్తోంది.
..సాయంత్రం లోపు నిందితులను అరెస్ట్ చేస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. ఇంతవరకు నిందితులను పట్టుకోలేదు. మా పార్టీని తిట్టడం మాని ఇప్పటికైనా నిందితులను పట్టుకోవడంలో దృష్టిపెట్టాలి. మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన దిశ చట్టం ఉండుంటే నిందితులు ఇంత స్వేచ్ఛగా నేరాలు చేసే వాళ్లు కాదు. 21 రోజుల్లో నిందితులను పట్టుకుని శిక్షలు విధించిన సందర్భాలున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన 120 రోజుల్లో మహిళలపై ఎన్నో నేరాలు చేసినా ఒక్క కేసులో కూడా నిందితులకు శిక్ష పడింది లేదు.
ఇదీ చదవండి: ‘మాట మార్చడంలో బాబు తరువాతే ఎవరైనా’
..హిందూపురం ప్రజలు గెలిపించింది బాలకృష్ణనా లేదా ఆయన పీఏనా. హైదరాబాద్‌లో కూర్చుని అన్‌స్టాపబుల్‌కి తర్వాతైనా ప్రిపేర్ అవొచ్చు.. హైదరాబాద్ నుంచి హిందూపురం ఇప్పటికైనా వచ్చి బాధితులకు న్యాయం చేయాలి. పోలీసుల నుంచి కూడా సరైన స్పందన లేదు. బాధితులను పరామర్శించడానికి కూడా మాకు అవకాశం ఇవ్వడం లేదు. మహిళా నాయకులు కూడా వెళ్లడం తప్పా.. బాధితులకు అండగా నిలవాల్సిన సామాజిక బాధ్యత మాపై ఉంది. కానీ దాన్ని కూడా అణచివేసేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది’’ అని దీపిక నిప్పులు చెరిగారు.
రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు: దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి
చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో ప్రతినెలా ఏదోక చొట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు. ముచ్చుమర్రి, పుంగనూరు, గుడ్లవల్లేరు, నేడు చిలమత్తూరు ఘటనలన్నీ చూస్తుంటే రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అర్థం అవుతుంది. కూటమి పాలనలో రాష్ట్రాన్ని దోపిడీలు, దాడులకు అడ్డాగా మార్చేశారు. రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు. ఆదాయం కోసం బెట్టింగులు, పేకాట క్లబ్బులు, గంజాయి అమ్మకాలను ఎమ్మెల్యేలే దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తున్నారు. పోలీసులకు కూడా నేరాలపై నియంత్రణ లేకుండా పోయింది. గంజాయి, జూదం అరికడితే తప్ప ఈ నేరాలు అదుపులోకి వచ్చే అవకాశం ఉండదని సీఎం చంద్రబాబు గమనించాలి. రవి బిష్ణోయ్ గ్యాంగ్ తరహాలో అనంతపురంలో కూడా ఒక గ్యాంగ్ తయారవుతోంది. మహిళల రక్షణ కోసం గతంలో మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ చట్టాన్ని కొనసాగించాలి’’ అని శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment