pakirappa
-
ఆ వీడియో ఒరిజినల్ కాదు
అనంతపురం క్రైం: ఎంపీ గోరంట్ల మాధవ్ పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ కాదని అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ కె.ఫక్కీరప్ప స్పష్టం చేశారు. ఈ వీడియోకు సంబంధించి బాధితులమంటూ ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. బుధవారం ఆయన అనంతపురంలోని జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో విలేకరులతో మాట్లాడారు. ఆ వీడియోను మొట్టమొదటగా ‘ఐ టీడీపీ అఫీషియల్’ అనే వాట్సాప్ గ్రూపులో +447443703968 నంబరు ద్వారా ఈ నెల 4వ తేదీ తెల్లవారుజామున 2.07 గంటలకు పోస్టు చేశారన్నారు. ఈ నంబర్ యునైటెడ్ కింగ్డమ్ (యూకే) వొడాఫోన్‌కు సంబంధించినదిగా తేలిందని చెప్పారు. ఈ వీడియోను ఆ గ్రూపులో పోస్టు చేసే ముందు ఐదుగురు వ్యక్తులకు షేర్ చేసినట్లుగా గుర్తించామని తెలిపారు. ఆ వీడియో పోస్ట్ చేసే కొన్ని క్షణాల ముందు మాత్రమే ‘ఐ టీడీపీ అఫీషియల్’ అనే వాట్సాప్ గ్రూపులో ఆ నంబర్ (+447443703968)ను యాడ్ చేశారని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో తొలిసారిగా వీడియోను పోస్ట్ చేసింది ఇంటర్నేషనల్ నంబర్ నుంచి కావడంతో దానికి సంబంధించిన వ్యక్తి వివరాలు సేకరించే దిశగా దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ వీడియోకు సంబంధించి ఎస్పీ ఇంకా ఏం చెప్పారంటే.. మార్ఫింగ్, ఎడిటింగ్‌పై అనుమానాలు ► ఈ వీడియోను చాలాసార్లు ఫార్వర్డ్, రీ పోస్టింగ్ చేశారు. దీని కారణంగా ఇది ఒరిజినల్ అని నిర్ధారించలేకపోతున్నాం. మార్ఫింగ్/ఎడిటింగ్ జరిగి ఉండొచ్చు. కొన్ని వీడియోల్లో ఒకవైపు ఎంపీ ఫొటో ఉంచి మరోవైపు సందేశాలు నమోదు చేశారు. మరో వీడియోలో ఎంపీ ఫొటో, మరో వీడియోను పార్లల్గా నమోదు చేశారు. ఇవన్నీ ఎడిటింగ్/మార్ఫింగ్ కిందకే వస్తాయి. స్క్రీన్ టెక్నాలజీ యాప్స్ ద్వారా వీడియో కాల్‌ను రికార్డు చేయొచ్చు. అసలు బాధితుల మంటూ ఎవరూ ముందుకు రాలేదు. బాధితులెవరైనా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే ఎంతటి వారినైనా విచారిస్తాం. అందువల్ల ఎంపీ, బాధితుల స్టేట్మెంట్ను నమోదు చేయలేదు. ► ప్రస్తుతం సాంకేతిక దర్యాప్తు చేపట్టాం. తదుపరి దర్యాప్తులో భాగంగా వీడియో పోస్టు చేసిన వ్యక్తి వివరాల కోసం వొడాఫోన్ ప్రొవైడర్‌కు లేఖ రాశాం. ► గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రతిష్టకు భంగం కలిగించారని ఈ నెల 4వ తేదీన ఎంపీ అభిమాని కొనతాలపల్లి వెంకటేశ్వర రావు అనంతపురం టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 185/2022 సెక్షన్ 67 ఏ, 66 ఈ ఆఫ్ ఐటీ యాక్ట్, సెక్షన్ 292, 509 ఆఫ్ ఐపీసీ కింద అదే రోజు ఆ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ► ఒక వ్యక్తి రికార్డు చేసిన వీడియోను మరొకరికి పంపించారు. సదరు వ్యక్తి మొబైల్లో చూస్తున్నప్పుడు ఇంకో వ్యక్తి ఆ వీడియోను చిత్రీకరించారు. చుట్టుపక్కల ఎవరో మాట్లాడుతున్నట్లు, పశువుల చప్పుడు కూడా అందులో విన్పిస్తోంది. అందువల్ల ఇది ఒరిజినల్ వీడియో కాదని తెలుస్తోంది. -
సెకన్ల వ్యవధిలో బారికేడ్లు దాటారు.. ఆ ఆరోపణలు అవాస్తవం: ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప
అనంతపురం క్రైం: ‘శెట్టూరు మండలం చెర్లోపల్లికి చెందిన గణేష్ ద్విచక్ర వాహనం సెకన్ల వ్యవధిలోనే పోలీస్ బారికేడ్లను దాటి వెళ్లింది. పోలీసులు దారి ఇవ్వకపోవడంతో చిన్నారికి సకాలంలో వైద్యం అందక మృతి చెందిందని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఇలా చేయడం పద్ధతి కాదు’ అని అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప అన్నారు. ఈ నెల 15న మంత్రి ఉషశ్రీ చరణ్ కాన్వాయ్ కోసం పోలీసులు కల్యాణదుర్గంలోని బ్రహ్మయ్య గుడి సమీపంలో వాహన రాకపోకలు ఆపడం వల్ల 8 నెలల చిన్నారి మృతి చెందిందన్న అంశంపై ఎస్పీ ఫక్కీరప్ప స్పందించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గణేష్, ఈరక్క దంపతులు బైక్‌పై వారి 8 నెలల చిన్నారిని ఇంటినుంచి ఆస్పత్రికి తీసుకువచ్చిన దృశ్యాలను సీసీ కెమెరాల ఫుటేజిని మీడియాకు చూపించారు. వివిధ సెల్ టవర్ లొకేషన్లను దాటిన తీరును కూడా వివరించారు. ఈ ఘటనపై లోతుగా విచారణ చేపట్టి శాస్త్రీయ ఆధారాలను సేకరించామన్నారు. మంత్రి ఉషశ్రీ చరణ్ కాన్వాయ్ కోసం చిన్నారి తండ్రి బైక్‌ను పోలీసులు ఆపలేదన్నారు. ‘ఈ నెల 15న సాయంత్రం 6 గంటలకు గణేష్, ఈరక్క దంపతుల చిన్నారికి ఫిట్స్ వచ్చాయి. 6.10 గంటలకు బైక్‌పై చెర్లోపల్లి నుంచి కల్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రికి బయలుదేరారు. మంత్రి ఇంటి సమీపంలోని బ్రహ్మయ్య గుడి పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద 6.36 గంటలకు కన్పించారు. అక్కడి నుంచి సెకన్ల వ్యవధిలోనే ముందుకు సాగారు. సాయంత్రం 6.40 గంటలకు కల్యాణదుర్గం పట్టణంలోకి ప్రవేశించి, 6.48 గంటలకు ఆర్డీటీ ఆస్పత్రికి చేరారు. 6.50 గంటలకు ఓపీ తీసుకున్నట్లు ఆస్పత్రి రికార్డుల్లో నమోదైంది. 7.18 గంటలకు చిన్నారి మృతిని వైద్యులు ధ్రువీకరించారు. చెర్లోపల్లి నుంచి ఆర్డీటీ ఆస్పత్రికి 20 కిలోమీటర్ల దూరం ఉంది. బైక్‌పై 38 నిమిషాల వ్యవధిలోనే ఆస్పత్రికి చేరుకున్నారు. చిన్నారి మృతి చెందిన తర్వాత కూడా అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని గణేష్ కుటుంబీకులను పోలీసులు కోరారు. కానీ వారు నిరాకరించారు. రాత్రి 8.15 గంటల సమయంలో చిన్నారి మృతదేహంతో రోడ్డుపై ఆందోళనకు దిగారు’ అని ఎస్పీ వివరించారు. రాద్ధాంతం చేయొద్దు చిన్నారి మృతి చెందడం చాలా బాధగా ఉందని, కానీ కొందరు వాస్తవాలను వక్రీకరించి లేనిపోని రాద్ధాంతం చేయడం సరికాదని ఎస్పీ ఫక్కీరప్ప అన్నారు. చిన్నారి తల్లిదండ్రులు అమాయకులని, వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయబోమని స్పష్టం చేశారు. ఎవరైనా పోలీసులపై బురద జల్లడమే కాకుండా శాంతిభద్రతల సమస్యకు కారణమైతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
పోలీసుల పిల్లలకు ఉచితంగా సివిల్స్ కోచింగ్
అనంతపురం క్రైం: పోలీసుల పిల్లలు సివిల్స్, గ్రూప్స్‌లో ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో లైబ్రరీ కమ్ స్టడీ సెంటర్ ఏర్పాటైంది. దీన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప.. పెనుకొండ సబ్ కలెక్టర్ మల్లారపు నవీన్, రాష్ట్ర గ్రేహౌండ్స్ విభాగం అసాల్ట్ కమాండర్ కొమ్మి శివకిషోర్, ఐఏఎస్ అధికారిణి ధాత్రిరెడ్డితో కలసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫక్కీరప్ప మాట్లాడుతూ.. పోలీసుల పిల్లలు ఏదో ఒక ఉన్నత ఉద్యోగం సాధించాలనే ఆశయంతో ఆధునిక సౌకర్యాలతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. సివిల్ సర్వీసెస్, గ్రూప్ –1 ఉద్యోగాలు సాధించేందుకు ఈ లైబ్రరీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఢిల్లీ, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లకుండానే పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ పొందవచ్చన్నారు. ఇందులో ఉండే పుస్తకాలను డిజిటల్ విధానంలో కూడా చదువుకునేలా సెంట్రలైజ్డ్ సర్వర్‌తో 15 కంప్యూటర్లను సిద్ధం చేశామన్నారు. 50 మంది విద్యార్థులు కూర్చునేలా డిజిటల్ క్లాస్ రూమ్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఢిల్లీలోని వాజీరాం లాంటి ప్రముఖ కోచింగ్ సెంటర్ల ద్వారా ప్రత్యక్ష తరగతులను నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వచ్చే నెల 6 నుంచి ఈ క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు. రౌండ్ ద క్లాక్ లైబ్రరీ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. మొదట పోలీసు కుటుంబాల పిల్లలకు ప్రాధాన్యతనిస్తామని వివరించారు. భవిష్యత్తులో నిరుపేద అభ్యర్థులకు అవకాశం కల్పిస్తామన్నారు. అలాగే రాబోయే రోజుల్లో రెసిడెన్షియల్ కోచింగ్ అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు.. నాగేంద్రుడు, రామమోహన్‌రావు, హనుమంతు, డీఎస్పీలు.. వీరరాఘవరెడ్డి, చైతన్య, ఉమామహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో సివిల్ సర్వీసెస్‌పై నిర్వహించిన వర్క్‌షాపులో అధికారులు తమ అనుభవాలను అభ్యర్థులతో పంచుకున్నారు. నిర్దిష్ట ప్రణాళికతో సన్నద్ధమవ్వాలి నిర్ధిష్ట ప్రణాళికతో సివిల్స్‌కు సన్నద్ధమవ్వాలి. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారికి సరైన గైడెన్స్ తప్పనిసరి. సరైన గైడెన్స్ ఉంటే ఎలాంటి తప్పులు లేకుండా లక్ష్యం సాధించవచ్చు. – మల్లారపు నవీన్, సబ్ కలెక్టర్, పెనుకొండ సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి సివిల్స్ సాధించాలనుకునేవారు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి. మొదటిసారే మంచి ర్యాంకు సాధించాలన్న సంకల్పంతో ముందుకెళ్లాలి. – ధాత్రిరెడ్డి, ఐఏఎస్ గొప్ప అవకాశం మా నాన్న హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. మా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఢిల్లీ, హైదరాబాద్ వెళ్లి శిక్షణ పొందాలంటే కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో అనంతపురంలోనే లైబ్రరీ కమ్ స్టడీ సెంటర్ ఏర్పాటు మాకు గొప్ప అవకాశాన్ని ఇస్తోంది. – మాధవి, బీటెక్ గ్రాడ్యుయేట్, అనంతపురం భవిష్యత్తుకు బంగారు బాట పోలీసుల పిల్లల భవిష్యత్తుకు ఎస్పీ బంగారు బాటలు వేశారు. సివిల్స్‌కు శిక్షణ పొందే అవకాశాన్ని జిల్లాలోనే కల్పించడం చాలా గొప్ప విషయం. – సాకే త్రిలోక్‌నాథ్, పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యుడు -
పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయండి
సాక్షి, అమరావతి: టీడీపీ మహిళా నేతల ఇళ్లలో సోదాలు చేయడంపై దర్యాప్తు జరిపి, పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ కె. ఫకీరప్పను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ ఆదేశాలిచ్చారు. సీఎం, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అనంతపురం జిల్లా టీడీపీ మహిళా నేతలు కొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వారు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యం మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కోర్టు ముందు హాజరయ్యారు. ఏ చట్ట నిబంధనల ప్రకారం మహిళా నేతల ఇళ్లలో సోదాలు చేశారని న్యాయమూర్తి మరోసారి పోలీసులపై మండిపడ్డారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసి అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశిస్తే, దర్యాప్తు అధికారి నివేదిక ఆధారంగా ఎలా అఫిడవిట్ వేస్తారని ఎస్పీని ప్రశ్నించారు. అందులో తగిన వివరాలు లేవన్నారు. దర్యాప్తు జరిపి పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు. వ్యక్తిగత హాజరు నుంచి ఎస్పీకి మినహాయింపునిచ్చారు. తదుపరి విచారణను జనవరి 4కి వాయిదా వేశారు. -
వివేకా హత్యపై తప్పుడు వాంగ్మూలం ఇమ్మంటున్నారు
అనంతపురం క్రైం: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తప్పుడు వాంగ్మూలమివ్వాలని సీబీఐ అధికారులు, మరికొందరు ఒత్తిడి తెస్తున్నట్లు కల్లూరు గంగాధరరెడ్డి అనే వ్యక్తి అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వివేకాను హత్య చేయాలని ఆ కేసు నిందితుల్లో ఒకరైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనను కోరారని, ఇందుకు రూ.10 కోట్లు ఆఫర్ చేశారని, ఆయనతోపాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి ప్రమేయంతోనే హత్య జరిగిందని వాంగ్మూలమివ్వాలంటూ సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్, అప్పటి సిట్ సీఐ శ్రీరామ్, వైఎస్ వివేకా కుమార్తె సునీత తీవ్ర ఒత్తిడి తెచ్చారని తెలిపాడు. ఇందుకు ఒప్పుకోకపోవడంతో సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నాడు. తనకు రక్షణ కల్పించాలని కోరాడు. గంగాధరరెడ్డి సోమవారం అనంతపురం జిల్లా ఎస్పీని కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. చదవండి: హత్యలో వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిలది కీలకపాత్ర: జర్నలిస్ట్ భరత్ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు.. నాది కడప జిల్లా పులివెందుల. 12 ఏళ్ల క్రితం అనంతపురం జిల్లా యాడికికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటున్నా. పులివెందులలో డబుల్ మర్డర్ కేసులో ముద్దాయిని. వివేకానందరెడ్డిని హత్య చేయాలని నన్ను దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సంప్రదించినట్లు చెప్పాలని అప్పట్లో సిట్ బృందంలో సీఐగా (ప్రస్తుతం అనంతపురం జిల్లా మడకశిర సీఐ) ఉన్న శ్రీరామ్ నాపై ఒత్తిడి తెచ్చారు. కడప డీటీసీలో చిత్ర హింసలు పెట్టారు. చేయని నేరాన్ని ఒప్పుకోవడానికి నేను ఇష్టపడలేదు. ఈ ఏడాది అక్టోబర్ 2, 3 తేదీల్లో సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ వాట్సాప్ కాల్ చేసి వివేకా హత్యకు శివశంకర్‌రెడ్డి ప్రేరేపించినట్టు చెప్పాలన్నారు. అక్టోబర్ 4న సీబీఐ అధికారులు యాడికిలోని మా ఇంటికి వచ్చారు. వివేకానందరెడ్డి ఇంటికి వెళ్లి హత్య చేసి, దొంగతనం చేసినట్లుగా సీన్ క్రియేట్ చేసి పారిపోవాలని శివశంకర్‌రెడ్డి నాతో చెప్పినట్లు చెప్పాలన్నారు. ఎవరైనా పట్టుకుంటే దొంగతనానికి వెళ్లానని, బీరువా శబ్దం విని వివేకానందరెడ్డి వచ్చినట్లు, ఏమి చేయాలో పాలుపోక హత్య చేశానని చెప్పమన్నారు. ఇందుకు శివశంకర్‌రెడ్డి రూ.10 కోట్లు ఇస్తానన్నట్లు వాంగ్మూలమివ్వాలని రామ్‌సింగ్ ఒత్తిడి చేశారు. చదవండి: సీబీఐ పిటిషన్లో టీడీపీ పలుకులు! కడప రింగ్ రోడ్డులో వైఎస్ సునీతను కలిశా ఈ నెల 24న విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు నోటీసులిచ్చారు. ఆరోగ్యం సరిగా లేక, అబద్ధాలు చెప్పేందుకు మనస్కరించక వెళ్లలేదు. తర్వాత కడప జిల్లా పెద్దకుడాలకు చెందిన బాబురెడ్డి యాడికికి వచ్చి నన్ను కలిశాడు. వైఎస్ సునీత నన్ను విచారణకు హాజరై సీబీఐ వాళ్లు కోరినట్లుగా వివేకాను శివ శంకర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హత్య చేయించారని చెప్పమన్నారని చెప్పాడు. ఇలా చెబితే రూ.10 లక్షలు ఇచ్చి, నా రెండు కాళ్లూ బాగు చేయిస్తామని చెప్పారు. బాబురెడ్డి ముందస్తుగా రూ.15 వేలు ఇచ్చి ఖర్చులకు ఉంచుకోమన్నాడు. నేను భయపడి ఈ నెల 25న కారు బాడుగకు తీసుకుని పులివెందులకు వెళ్లా. అక్కడ రింగ్ రోడ్డు వద్ద కారులో వేచి ఉన్న సునీతను కలిశా. సీబీఐ అధికారులు చెప్పమన్నట్లు సీబీఐ కోర్టు ముందు చెప్పమన్నారు. కడప సెంట్రల్ జైలు దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడ సీబీఐ వాళ్లు నన్ను కడప ఆర్ అండ్ బీ అతిథి గృహానికి తీసుకెళ్లారు. పైన చెప్పిన విధంగా వాంగ్మూలం తయారు చేసి నాకు చదివి విన్పించి, సంతకం చేయమన్నారు. చేయని తప్పుకు సంతకం చేయబోనని సీబీఐ వారితో గొడవపడ్డా. ఈ నెల 30న కోర్టులో 164 స్టేట్మెంట్ రికార్డు చేయాలని, అప్పుడు న్యాయమూర్తి అడిగే ప్రశ్నలకు రెండు పేపర్లలో సమాధానాలు రాశిచ్చారు. దాన్ని తీసుకుని యాడికికి వచ్చేశా. అప్పటి నుంచి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి. వారు చెప్పినట్లు ఒప్పుకోవాలంటూ హింసిస్తున్నారు. నా ఇంటి చుట్టుపక్కల కొత్త వ్యక్తులు తిరుగుతున్నారు. నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ప్రాణ రక్షణ కల్పించాలి’ అని గంగాధర్ రెడ్డి ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. డీఎస్పీతో విచారణ చేయిస్తున్నాం : ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప గుర్తు తెలియని వ్యక్తులు, వివేకానంద రెడ్డి కుమార్తె సునీత అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని కల్లూరు గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. వివేకా హత్య కేసులో చేయని నేరానికి వాంగ్మూలం ఇవ్వాలని 2019లో అప్పటి సిట్ బృందంలోని సీఐ శ్రీరామ్, ఇటీవల సీబీఐ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు ఫిర్యాదులో తెలిపాడు. సీబీఐ, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన వాట్సాప్ కాల్స్ స్క్రీన్‌షాట్‌ను జత చేశాడు. ఈ ఫిర్యాదుపై విచారణకు తాడిపత్రి డీఎస్పీ చైతన్యను నియమించాం. గంగాధర్‌రెడ్డిని వాచ్ చేయాలని పామిడి సీఐ, ఇతరులను ఆదేశించాం. -
9 బృందాలు.. 36 గంటలు
ఆదోని: కర్నూలు జిల్లా ఆదోనిలో శిశువు అపహరణ మిస్టరీని తొమ్మిది బృందాల సాయంతో 36 గంటల్లో ఛేదించగలిగామని ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి తెలిపారు. ఆదోనిలో శనివారం పసికందును తల్లిదండ్రులు రేణుకమ్మ, శ్రీనివాసులుకు అందించారు. చంటి బిడ్డకు ‘దిశ’గా నామకరణం చేసి ఆశీర్వదించారు. అనంతరం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎస్పీ తెలిపిన వివరాలు ఇవీ.. మండగిరికి చెందిన కనకుర్తి ఝాన్సీలక్ష్మి (30), మంజునాథ దంపతులకు 9 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఆడపిల్ల కావాలనే కోరికతో దత్తత తీసుకోవాలనే ప్రయత్నాల్లో ఈనెల 3న ఎస్కేడీ కాలనీలోని ప్రైవేట్ నర్సిగ్‌హోమ్ వద్దకు వచ్చి ఆయాగా పని చేస్తున్న యశోదను ఝాన్సీలక్ష్మి సంప్రదించింది. ఆ సమయంలో అలసందగుత్తికి చెందిన పూజారి రేణుక ఆడబిడ్డకు జన్మనిచ్చిందని తెలిసింది. దీంతో ఝాన్సీలక్ష్మి బురఖా ధరించి, టీకా పేరుతో డ్రామా నడిపి పసిబిడ్డను అపహరించింది. ఫోన్ సంభాషణ ఆధారంగా పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. -
సడలింపులు ఉన్నా: కర్నూల్లో వీటికి నో!
సాక్షి, కర్నూలు : జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉందని, కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాని ప్రాంతంలో లాకడౌన్‌కు సంబంధించి సడలింపులు ఉన్నాయని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కిరప్ప తెలిపారు. సడలింపులు ఉన్నప్పటికి ఎలాంటి వేడుకలు, పండుగలను జరుపుకోకూడదని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి సీజ్ అయిన వాహనాలను ఆదివారంనుంచి విడుదల చేస్తామని చెప్పారు. కరోనా డిశ్చార్జ్‌లు: కర్నూలు మొదటిస్థానం కరోనా వైరస్ బారినుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య పరంగా కర్నూలు జిల్లా మొదటి స్థానంలో.. పరీక్షలు చేయడంలో నాల్గవ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 608 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ఇందులో 397 మంది డిశ్చార్జ్ అయ్యారని, 19 మంది చనిపోగా 199 పాజిటివ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల మేరకు పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్ ద్వారా లాక్డౌన్ కొనసాగుతుందని చెప్పారు. ( ఆదోనిలో ‘కోయంబేడు’ కలకలం ) జిల్లాలో 50 కంటైన్మెంట్ క్లస్టర్లను ఏర్పాటు చేశామని, ఇందులో 9 క్లస్టర్ కంటైన్మెంట్ జోన్లలో 45 రోజుల నుండి యాక్టివ్ కేసులు లేక పోవడంతో 9 జోన్లలో లాక్డౌన్ ఎత్తి వేస్తున్నామని తెలిపారు. ఇతర క్లస్టర్లలో 20 రోజుల పాటు పాజిటివ్ కేసు నమోదు కాకపోతే అక్కడ కూడా లాక్డౌన్ సడలింపులు కొనసాగుతాయన్నారు. పాజిటివ్ కేసులు నమోదు అయిన ప్రదేశాలలో ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు. కాగా, జిల్లాలోని నందికొట్కూరు రెడ్‌జోన్ ప్రాంతంలో శనివారం కేంద్ర కమిటీ బృందం పర్యటించింది. డా" మధు మిత దుబే ఆధ్వర్యంలోని ఈ బృందం హౌసింగ్ బోర్డ్ కాలనీలో కోవిడ్ -19 పై తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించింది. కరోనాపై ప్రజలకు అవగహన కల్పించాలని అధికారులకు సూచనలు చేసింది. రెడ్ జోన్ ప్రాంతంలో రాపిడ్ కిట్లతో టెస్టులు చేయడంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర బృందం కితాబునిచ్చింది. -
కరోనా వైరస్ కట్టడికి పోలీస్ యంత్రాంగం శ్రమిస్తోంది
-
‘కరోనా’ వెబ్సైట్లు ఓపెన్ చేయొద్దండి
సాక్షి, కర్నూలు: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఈ వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడేందుకు యువత గూగుల్‌లో వెతుకుతున్నారు. అందుకు సంబంధించిన ఆర్టికల్స్‌ను కూడా చదువుచున్నారు. ఈ వైరస్ సమాచారంపై ప్రజల్లో ఆసక్తి పెరగడంతో సైబర్ నేరగాళ్ల కూడా అదే రూట్లో వల వేస్తున్నారని ఎస్పీ ఫక్కీరప్ప శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మెయిల్, బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వాటిని హ్యాక్ చేసేందుకు కరోనా వైరస్ పేరుతో వెబ్సైట్లు రూపొందించి యువతకు వల వేస్తున్నారని తెలిపారు. (కరోనాపై ఇన్ఫోసిస్ ఉద్యోగి పైత్యం...అరెస్టు) పదుల సంఖ్యలో ఇలా కరోనా వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయని వాటిని సైబర్ క్రైం పోలీస్‌లు గుర్తించారని పేర్కొన్నారు. coronavirursstatus(.)space, coro navirus(.)zone, coronavir s-realtime(.com) bgvfr.coro navirusaware(.)xyz ఇవి చాలా డేంజరస్ డొమైన్స్ అని వీటిని క్లిక్ చేయవద్దని ఎస్పీ పేర్కొన్నారు. కరోనా వైరస్ అలర్ట్ వెబ్సైట్లు అసలు ఓపెన్ చేయొద్దని సూచించారు. ఏవైనా సందేహాలు ఉంటే సైబర్ ల్యాబ్ పోలీస్‌లకు గాని, సైబర్ మిత్ర వాట్సాప్ నెంబర్ 9121211100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. -
అల్లర్లకు పాల్పడితే బైండోవర్ కేసులు
సాక్షి, కర్నూలు : అల్లర్లకు పాల్పడిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ పక్కిరప్ప అన్నారు. గురువారం నందికోట్కూరు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారాయన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గత ఎన్నికల్లో గ్రామాల్లో అల్లర్లు సృష్టించిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలు వెంటనే పరిష్కరించడంలో జిల్లా మొదటి స్థానంలో ఉందని తెలిపారు. -
అల్లుడి చేతిలో మామ హత్య
హత్యపై ఏఎస్పీ విచారణ.. కోల్‌సిటీ : గోదావరిఖనిలో అల్లుడి చేతిలో మామ హత్యకు గురైన ఘటనపై ఏఎస్పీ పకీరప్ప బుధవారం విచారణ చేపట్టారు. వివరాలు వన్‌టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక గంగానగర్‌కు చెందిన వేమ అంకూస్(50) ఆర్జీ-1లోని 11ఏ గనిలో జనరల్ మజ్దూర్‌గా పని చేస్తున్నాడు. అంకూస్‌కు భార్య సరోజన, నలుగురు కూతుళ్లు. రెండో కూతురు సుమలతను ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల సమీపంలోని సీసీసీకి చెందిన నరెడ్ల సతీశ్‌కు ఇచ్చి ఏడేళ్ల క్రితం పెళ్లి చేశారు. సతీశ్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తొలి ఏకాదశి పండుగకు రెండో కూతరు, అల్లుడు అంకూస్ ఇం టికొచ్చారు. అయితే సతీశ్ కొద్ది రోజులుగా ఆటో నడపకుండా జులాయిగా తిరుగుతున్నాడు. ఈ విషయమై మా మ, అల్లుడిని మంగళవారం రాత్రి నిలదీశాడు. కోపోద్రిక్తుడైన సతీశ్ మామపై దాడికి దిగాడు. అడ్డుకోబోయిన అత్త, భార్య, మరదలును గదిలో బంధించి.. మామ తలపై ఇటుకలతో దాడి చేయడంతో అంకూస్ అక్కడిక్కడే ప్రాణాలొది లాడు. నిందితుడి ని ఎస్సై మురళీ అదుపులోకి తీసుకున్నారు. మృతుడి భార్య సరోజన ఫిర్యాదుతో సతీశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఇన్చార్జి సీఐ నారాయణ తెలిపారు.