ఎస్పీ ఫక్కీరప్పకు ఫిర్యాదుచేస్తున్న గంగాధర్ రెడ్డి
అనంతపురం క్రైం: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తప్పుడు వాంగ్మూలమివ్వాలని సీబీఐ అధికారులు, మరికొందరు ఒత్తిడి తెస్తున్నట్లు కల్లూరు గంగాధరరెడ్డి అనే వ్యక్తి అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వివేకాను హత్య చేయాలని ఆ కేసు నిందితుల్లో ఒకరైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనను కోరారని, ఇందుకు రూ.10 కోట్లు ఆఫర్ చేశారని, ఆయనతోపాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి ప్రమేయంతోనే హత్య జరిగిందని వాంగ్మూలమివ్వాలంటూ సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్, అప్పటి సిట్ సీఐ శ్రీరామ్, వైఎస్ వివేకా కుమార్తె సునీత తీవ్ర ఒత్తిడి తెచ్చారని తెలిపాడు. ఇందుకు ఒప్పుకోకపోవడంతో సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నాడు. తనకు రక్షణ కల్పించాలని కోరాడు. గంగాధరరెడ్డి సోమవారం అనంతపురం జిల్లా ఎస్పీని కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశాడు.
చదవండి: హత్యలో వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిలది కీలకపాత్ర: జర్నలిస్ట్ భరత్
ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు..
నాది కడప జిల్లా పులివెందుల. 12 ఏళ్ల క్రితం అనంతపురం జిల్లా యాడికికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటున్నా. పులివెందులలో డబుల్ మర్డర్ కేసులో ముద్దాయిని. వివేకానందరెడ్డిని హత్య చేయాలని నన్ను దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సంప్రదించినట్లు చెప్పాలని అప్పట్లో సిట్ బృందంలో సీఐగా (ప్రస్తుతం అనంతపురం జిల్లా మడకశిర సీఐ) ఉన్న శ్రీరామ్ నాపై ఒత్తిడి తెచ్చారు. కడప డీటీసీలో చిత్ర హింసలు పెట్టారు. చేయని నేరాన్ని ఒప్పుకోవడానికి నేను ఇష్టపడలేదు. ఈ ఏడాది అక్టోబర్ 2, 3 తేదీల్లో సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ వాట్సాప్ కాల్ చేసి వివేకా హత్యకు శివశంకర్‌రెడ్డి ప్రేరేపించినట్టు చెప్పాలన్నారు. అక్టోబర్ 4న సీబీఐ అధికారులు యాడికిలోని మా ఇంటికి వచ్చారు. వివేకానందరెడ్డి ఇంటికి వెళ్లి హత్య చేసి, దొంగతనం చేసినట్లుగా సీన్ క్రియేట్ చేసి పారిపోవాలని శివశంకర్‌రెడ్డి నాతో చెప్పినట్లు చెప్పాలన్నారు. ఎవరైనా పట్టుకుంటే దొంగతనానికి వెళ్లానని, బీరువా శబ్దం విని వివేకానందరెడ్డి వచ్చినట్లు, ఏమి చేయాలో పాలుపోక హత్య చేశానని చెప్పమన్నారు. ఇందుకు శివశంకర్‌రెడ్డి రూ.10 కోట్లు ఇస్తానన్నట్లు వాంగ్మూలమివ్వాలని రామ్‌సింగ్ ఒత్తిడి చేశారు.
చదవండి: సీబీఐ పిటిషన్లో టీడీపీ పలుకులు!
కడప రింగ్ రోడ్డులో వైఎస్ సునీతను కలిశా
ఈ నెల 24న విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు నోటీసులిచ్చారు. ఆరోగ్యం సరిగా లేక, అబద్ధాలు చెప్పేందుకు మనస్కరించక వెళ్లలేదు. తర్వాత కడప జిల్లా పెద్దకుడాలకు చెందిన బాబురెడ్డి యాడికికి వచ్చి నన్ను కలిశాడు. వైఎస్ సునీత నన్ను విచారణకు హాజరై సీబీఐ వాళ్లు కోరినట్లుగా వివేకాను శివ శంకర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హత్య చేయించారని చెప్పమన్నారని చెప్పాడు. ఇలా చెబితే రూ.10 లక్షలు ఇచ్చి, నా రెండు కాళ్లూ బాగు చేయిస్తామని చెప్పారు. బాబురెడ్డి ముందస్తుగా రూ.15 వేలు ఇచ్చి ఖర్చులకు ఉంచుకోమన్నాడు. నేను భయపడి ఈ నెల 25న కారు బాడుగకు తీసుకుని పులివెందులకు వెళ్లా. అక్కడ రింగ్ రోడ్డు వద్ద కారులో వేచి ఉన్న సునీతను కలిశా.
సీబీఐ అధికారులు చెప్పమన్నట్లు సీబీఐ కోర్టు ముందు చెప్పమన్నారు. కడప సెంట్రల్ జైలు దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడ సీబీఐ వాళ్లు నన్ను కడప ఆర్ అండ్ బీ అతిథి గృహానికి తీసుకెళ్లారు. పైన చెప్పిన విధంగా వాంగ్మూలం తయారు చేసి నాకు చదివి విన్పించి, సంతకం చేయమన్నారు. చేయని తప్పుకు సంతకం చేయబోనని సీబీఐ వారితో గొడవపడ్డా. ఈ నెల 30న కోర్టులో 164 స్టేట్‌మెంట్ రికార్డు చేయాలని, అప్పుడు న్యాయమూర్తి అడిగే ప్రశ్నలకు రెండు పేపర్లలో సమాధానాలు రాశిచ్చారు. దాన్ని తీసుకుని యాడికికి వచ్చేశా. అప్పటి నుంచి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి. వారు చెప్పినట్లు ఒప్పుకోవాలంటూ హింసిస్తున్నారు. నా ఇంటి చుట్టుపక్కల కొత్త వ్యక్తులు తిరుగుతున్నారు. నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ప్రాణ రక్షణ కల్పించాలి’ అని గంగాధర్ రెడ్డి ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
డీఎస్పీతో విచారణ చేయిస్తున్నాం : ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప
గుర్తు తెలియని వ్యక్తులు, వివేకానంద రెడ్డి కుమార్తె సునీత అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని కల్లూరు గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. వివేకా హత్య కేసులో చేయని నేరానికి వాంగ్మూలం ఇవ్వాలని 2019లో అప్పటి సిట్ బృందంలోని సీఐ శ్రీరామ్, ఇటీవల సీబీఐ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు ఫిర్యాదులో తెలిపాడు. సీబీఐ, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన వాట్సాప్ కాల్స్ స్క్రీన్‌షాట్‌ను జత చేశాడు. ఈ ఫిర్యాదుపై విచారణకు తాడిపత్రి డీఎస్పీ చైతన్యను నియమించాం. గంగాధర్‌రెడ్డిని వాచ్ చేయాలని పామిడి సీఐ, ఇతరులను ఆదేశించాం.
Comments
Please login to add a commentAdd a comment