
సాక్షి, అమరావతి: టీడీపీ మహిళా నేతల ఇళ్లలో సోదాలు చేయడంపై దర్యాప్తు జరిపి, పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ కె. ఫకీరప్పను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ ఆదేశాలిచ్చారు. సీఎం, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అనంతపురం జిల్లా టీడీపీ మహిళా నేతలు కొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వారు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యం మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కోర్టు ముందు హాజరయ్యారు. ఏ చట్ట నిబంధనల ప్రకారం మహిళా నేతల ఇళ్లలో సోదాలు చేశారని న్యాయమూర్తి మరోసారి పోలీసులపై మండిపడ్డారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసి అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశిస్తే, దర్యాప్తు అధికారి నివేదిక ఆధారంగా ఎలా అఫిడవిట్ వేస్తారని ఎస్పీని ప్రశ్నించారు. అందులో తగిన వివరాలు లేవన్నారు. దర్యాప్తు జరిపి పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు. వ్యక్తిగత హాజరు నుంచి ఎస్పీకి మినహాయింపునిచ్చారు. తదుపరి విచారణను జనవరి 4కి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment