కల్యాణి, మహాలక్ష్మి మృతదేహం
బుట్టాయగూడెం (జీలుగుమిల్లి): చెరువులో చేపలు పడుతూ ప్రమాదవశాత్తూ ఊబిలో చిక్కుకుని ఊపిరాడక ఓ బాలిక, మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. జీలుగుమిల్లి సమీపంలోని బుడుగల చెరువులో బుధవారం ఈ ఘటన జరిగింది. జీలుగుమిల్లి మండలం వంకావారిగూడేనికి చెందిన ఎం.కల్యాణి (15) ఇటీవల పదో తరగతి పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటుండగా, తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం – భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం రామిరెడ్డిగూడేనికి చెందిన ఎం.మహాలక్ష్మి (31) ఉపాధి పనుల కోసం వంకావారిగూడేనికి వచ్చింది.
వర్షాలు బాగా పడుతుండటంతో స్థానికులతో కలిసి వీరు జీలుగుమిల్లి సమీపంలోని బుడుగల చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. చెరువులోకి దిగి వలతో చేపలు పడుతూ ముందుకు వెళ్లారు. అక్కడ అనుకోకుండా ఊబిలో చిక్కుకుని మృతి చెందారు. వీరితో పాటు వెళ్లిన మరో ఇద్దరు మహిళలు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న జీలుగుమిల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment