నగరవాసులకు బైవన్-గెట్ వన్ ఫ్రీ ఆఫర్
ఎన్నికల ప్రచారసభలో బీజేపీ మాజీ ఎంపీ సిద్ధూన్యూఢిల్లీ: కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారంలో ఉన్నందువల్ల నగరవాసులు ఈ ఎన్నికల్లో కిరణ్‌బేడీని ముఖ్యమంత్రిని చేయగలిగితే వారికి బైవన్-గెట్ వన్ ఫ్రీ ఆఫర్ దక్కినట్టేనని బీజేపీ మాజీ ఎంపీ సిద్ధూ పేర్కొన్నారు. పశ్చిమఢిల్లీలోని తిలక్‌నగర్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న సందర్భంగా స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘మీరు ప్రధానిగా మోదీని ఎన్నుకున్నారు.ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా కిరణ్‌బేడీని ఎన్నుకోండి. బైవన్-గెట్ వన్ ఫ్రీ ఆఫర్ ఇదే’ అని అన్నారు. ఇక ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ 49 రోజులపాలన గురించి ప్రస్తావిస్తూ సింహాన్ని బదులు కోతిని ఎన్నుకుంటే అన్నీ ఇటువంటివే జరుగుతాయన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా నగరవాసులకు ఆప్ ఇస్తున్న విద్యుత్, తాగునీటి చార్జీల తగ్గింపు, ఉచిత వైఫై తదితర హామీల సాధ్యాసాధ్యాలపైనా ఆయన అనుమానం వ్యక్తం చేశారు.‘ఇందుకు నిధులు ఎక్కడినుంచి వస్తాయి. ఇంటి కిరాయే చెల్లించలేని కేజ్రీవాల్ డబ్బు ఎక్కడినుంచి తీసుకొస్తారు’ అంటూ నిలదీశారు. ఈ ఎన్నికలు మంచికి, చెడుకు మధ్య జరుగుతున్నాయంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీ నగరం దేశానికి గుండె వంటిదని అభివర్ణిస్తూ ఈ నగర అభివృద్ధి చెందడమనేది దేశాభివృద్ధికి అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు. కాగా ఈ ర్యాలీలో బీజేపీ ఎంపీ అనురాగ్ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.