C1 India
-
శారదా గ్రూప్ ఆస్తుల వేలం
న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా చిట్ ఫండ్ తదితర అక్రమ పథకాలను నిర్వహించిన శారదా గ్రూప్ ఆస్తులను వేలం వేయనున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పేర్కొంది. ఏప్రిల్ 11న నిర్వహించనున్న వేలానికి రూ. 32 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించింది. ఆస్తులలో కంపెనీకి చెందిన పశ్చిమ బెంగాల్‌లోని భూములు న్నట్లు సెబీ నోటీసులో ప్రకటించింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 మధ్య ఈవేలం నిర్వహించనున్నట్లు తెలియజేసింది. ఆస్తుల అమ్మకంలో సహకరించేందుకు క్వికార్ రియల్టీని, ఈవేలం నిర్వహణకు సీ1 ఇండియాను ఎంపిక చేసుకుంది. శారదా గ్రూప్ ఆస్తుల వేలానికి 2022 జూన్‌లో కోల్‌కతా హైకోర్టు అనుమతించడంతో సెబీ తాజా చర్యలకు దిగింది. మూడు నెలల్లోగా ప్రక్రియను ముగించవలసిందిగా కోర్టు ఆదేశించింది. శారదా గ్రూప్ 239 ప్రయివేట్ కంపెనీల కన్సార్షియంగా ఏర్పాటైంది. పశ్చిమ బెంగాల్, అస్సామ్, ఒడిషాలలో కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా చిట్ ఫండ్ బిజినెస్‌ను చేపట్టింది. 2013 ఏప్రిల్‌లో మూతపడటానికి ముందు 17 లక్షల మంది కస్టమర్ల ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించింది. ముందుగానే శారదా గ్రూప్ ఆస్తులకు సంబంధించి సొంతంగా వివరాలు తెలుసుకోవలసి ఉంటుందని సెబీ స్పష్టం చేసింది. తదుపరి వేలంలో బిడ్స్ దాఖలు చేసుకోమని సూచించింది. -
అగ్రిగోల్డ్ భూముల వేలం కమీషన్‌పై తకరారు
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ భూముల వేలం వ్యవహారంలో వేలం నిర్వహణ సంస్థకు చెల్లించాల్సిన కమీషన్ విషయంలో తకరారు మొదలైంది. వేలం పర్యవేక్షణ కమిటీ నిర్ణయించిన 0.2 శాతం కమీషన్ తమకు సరిపోదని, కనీసం 0.5 శాతం చెల్లిస్తేనే గిట్టుబాటు అవుతుందని వేలం నిర్వహణ సంస్థ సీ1 ఇండియా హైకోర్టుకు స్పష్టం చేసింది. ప్రస్తుత దశలో 0.5 శాతం కమీషన్ చెల్లించడం సాధ్యం కాదని, 0.2 శాతం ప్రకారమే వేలం కార్యకపాలాను కొనసాగించాలని హైకోర్టు తేల్చి చెప్పింది. 0.2 శాతం కమీషన్‌తో వేలం నిర్వహిస్తారా? లేదా? అనే విషయాన్ని సోమవారం నాటికి చెప్పాలని, ఇందులో ఎటువంటి బేరసారాలకూ తావు లేదని సీ1 ఇండియాకు హైకోర్టు తెలిపింది. వేలానికి సీ1 ఇండియా ముందుకు రాకపోతే ఇతర వేలం నిర్వహణ సంస్థల వివరాలను సిద్ధం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్‌కు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సామాన్య ప్రజల నుంచి అగ్రిగోల్డ్ యాజమాన్యం రూ.6,350 కోట్లను డిపాజిట్ల రూపంలో వసూలు చేసి చేతులెత్తేసిందని, ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అగ్రిగోల్డ్ డిపాజిట్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ.రమేష్‌బాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా సీ1 ఇండియా తరఫు న్యాయవాది నాగేశ్వర్‌రెడ్డి స్పందిస్తూ...కమీషన్‌ను మొత్తం అమ్మకాల విలువపై 0.2 శాతంగా నిర్ణయించారని, దీన్ని 0.5 శాతానికి పెంచాలని కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘వేలం ప్రక్రియ పురోగతి ఆధారంగా కమీషన్‌పై తగిన నిర్ణయం తీసుకుంటాం. వేలం ప్రక్రియను కొనసాగించండి. ఈ మొత్తం వ్యవహారంలో లక్షల మంది డిపాజిటర్ల భవిష్యత్తు ముడిపడి ఉంది. మానవతా దృక్పథంతో వ్యవహరించండి. మీ తీరుపై మేం సంతృప్తికరంగా లేము’ అని వ్యాఖ్యానించింది. దీనికి నాగేశ్వర్‌రెడ్డి స్పందిస్తూ, తనకు సోమవారం వరకు గడువునివ్వాలని, తన క్లెయింట్ (సీ1 ఇండియా)ను ఒప్పించే ప్రయత్నం చేస్తానని తెలిపారు. -
కమిటీ ఆమోదం పొందగానే భూముల వేలం
* ప్రముఖ దినపత్రికల్లో ప్రకటనలు ఇవ్వండి * సీ1 ఇండియాకు హైకోర్టు ఆదేశం * అగ్రిగోల్డ్ కేసులో విచారణ రెండు వారాలకు వాయిదా సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ భూముల విషయంలో పర్యవేక్షణ కమిటీ ఆమోదం పొందిన వెంటనే వేలం ప్రక్రియను ప్రారంభించాలని హైకోర్టు గురువారం వేలం సంస్థ ‘సీ1 ఇండియా’ను ఆదేశించింది. భూముల వేలం విషయంలో ఆయా రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికల్లో ప్రముఖంగా ప్రకటనలు ఇవ్వాలని, ఆ ప్రకటనలు అందరి దష్టిని ఆకర్షించేలా ఉండాలని తెలిపింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం సామాన్య ప్రజల నుంచి రూ.6,350 కోట్లను డిపాజిట్ల రూపంలో వసూలు చేసి చేతులెత్తేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అగ్రిగోల్డ్ డిపాజిట్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ.రమేశ్‌బాబు పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా పర్యవేక్షణ కమిటీ తరఫు న్యాయవాది రవిప్రసాద్ వాదనలు వినిపించారు. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యారావు నేతత్వంలోని పర్యవేక్షణ కమిటీ బుధవారం సమావేశమైందని తెలిపారు. వేలం విధివిధానాలపై హైకోర్టు ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తోందని చెప్పారు. అగ్రిగోల్డ్ తరఫు సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, లేఔట్ల అభివద్ధికి తాము పెట్టుకునే దరఖాస్తులపై సత్వరమే నిర్ణయం తీసుకునేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. తప్పుదోవ పట్టిస్తున్నారు అగ్రిగోల్డ్ యాజమాన్యం కేసులో అగ్రిగోల్డ్ దాఖలు చేసిన కౌంటర్‌కు పిటిషనర్ రమేశ్‌బాబు తిరుగు సమాధానం(రిప్లై) దాఖ లు చేశారు. మొత్తం 14 ఎకరాల భూమిని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి ప్రత్తిపాటి వెంకాయమ్మకు విక్రయించారన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించి, లావాదేవీల సొమ్మును హైకోర్టు రిజిష్ట్రార్ వద్ద డిపాజిట్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వేలం ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే బినామీల ద్వారా తమ భూములను అమ్మి సొమ్ము చేసుకోవాలని అగ్రిగోల్డ్ యాజమాన్యం భావిస్తోందని, అందుకు ఉదాహరణే ఈ 14 ఎకరాల భూమి విక్రయమని వెల్లడించారు.