సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ భూముల వేలం వ్యవహారంలో వేలం నిర్వహణ సంస్థకు చెల్లించాల్సిన కమీషన్ విషయంలో తకరారు మొదలైంది. వేలం పర్యవేక్షణ కమిటీ నిర్ణయించిన 0.2 శాతం కమీషన్ తమకు సరిపోదని, కనీసం 0.5 శాతం చెల్లిస్తేనే గిట్టుబాటు అవుతుందని వేలం నిర్వహణ సంస్థ సీ1 ఇండియా హైకోర్టుకు స్పష్టం చేసింది. ప్రస్తుత దశలో 0.5 శాతం కమీషన్ చెల్లించడం సాధ్యం కాదని, 0.2 శాతం ప్రకారమే వేలం కార్యకపాలాను కొనసాగించాలని హైకోర్టు తేల్చి చెప్పింది.
0.2 శాతం కమీషన్‌తో వేలం నిర్వహిస్తారా? లేదా? అనే విషయాన్ని సోమవారం నాటికి చెప్పాలని, ఇందులో ఎటువంటి బేరసారాలకూ తావు లేదని సీ1 ఇండియాకు హైకోర్టు తెలిపింది. వేలానికి సీ1 ఇండియా ముందుకు రాకపోతే ఇతర వేలం నిర్వహణ సంస్థల వివరాలను సిద్ధం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్‌కు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
సామాన్య ప్రజల నుంచి అగ్రిగోల్డ్ యాజమాన్యం రూ.6,350 కోట్లను డిపాజిట్ల రూపంలో వసూలు చేసి చేతులెత్తేసిందని, ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అగ్రిగోల్డ్ డిపాజిట్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ.రమేష్‌బాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది.
ఈ సందర్భంగా సీ1 ఇండియా తరఫు న్యాయవాది నాగేశ్వర్‌రెడ్డి స్పందిస్తూ...కమీషన్‌ను మొత్తం అమ్మకాల విలువపై 0.2 శాతంగా నిర్ణయించారని, దీన్ని 0.5 శాతానికి పెంచాలని కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘వేలం ప్రక్రియ పురోగతి ఆధారంగా కమీషన్‌పై తగిన నిర్ణయం తీసుకుంటాం. వేలం ప్రక్రియను కొనసాగించండి. ఈ మొత్తం వ్యవహారంలో లక్షల మంది డిపాజిటర్ల భవిష్యత్తు ముడిపడి ఉంది.
మానవతా దృక్పథంతో వ్యవహరించండి. మీ తీరుపై మేం సంతృప్తికరంగా లేము’ అని వ్యాఖ్యానించింది. దీనికి నాగేశ్వర్‌రెడ్డి స్పందిస్తూ, తనకు సోమవారం వరకు గడువునివ్వాలని, తన క్లెయింట్ (సీ1 ఇండియా)ను ఒప్పించే ప్రయత్నం చేస్తానని తెలిపారు.
అగ్రిగోల్డ్ భూముల వేలం కమీషన్‌పై తకరారు
Published Fri, Nov 27 2015 1:05 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement