కమిటీ ఆమోదం పొందగానే భూముల వేలం
* ప్రముఖ దినపత్రికల్లో ప్రకటనలు ఇవ్వండి
* సీ1 ఇండియాకు హైకోర్టు ఆదేశం
* అగ్రిగోల్డ్ కేసులో విచారణ రెండు వారాలకు వాయిదా
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ భూముల విషయంలో పర్యవేక్షణ కమిటీ ఆమోదం పొందిన వెంటనే వేలం ప్రక్రియను ప్రారంభించాలని హైకోర్టు గురువారం వేలం సంస్థ ‘సీ1 ఇండియా’ను ఆదేశించింది. భూముల వేలం విషయంలో ఆయా రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికల్లో ప్రముఖంగా ప్రకటనలు ఇవ్వాలని, ఆ ప్రకటనలు అందరి దష్టిని ఆకర్షించేలా ఉండాలని తెలిపింది.
తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం సామాన్య ప్రజల నుంచి రూ.6,350 కోట్లను డిపాజిట్ల రూపంలో వసూలు చేసి చేతులెత్తేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అగ్రిగోల్డ్ డిపాజిట్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ.రమేశ్‌బాబు పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది.
ఈ సందర్భంగా పర్యవేక్షణ కమిటీ తరఫు న్యాయవాది రవిప్రసాద్ వాదనలు వినిపించారు. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యారావు నేతత్వంలోని పర్యవేక్షణ కమిటీ బుధవారం సమావేశమైందని తెలిపారు. వేలం విధివిధానాలపై హైకోర్టు ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తోందని చెప్పారు. అగ్రిగోల్డ్ తరఫు సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, లేఔట్ల అభివద్ధికి తాము పెట్టుకునే దరఖాస్తులపై సత్వరమే నిర్ణయం తీసుకునేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
తప్పుదోవ పట్టిస్తున్నారు
అగ్రిగోల్డ్ యాజమాన్యం కేసులో అగ్రిగోల్డ్ దాఖలు చేసిన కౌంటర్‌కు పిటిషనర్ రమేశ్‌బాబు తిరుగు సమాధానం(రిప్లై) దాఖ లు చేశారు. మొత్తం 14 ఎకరాల భూమిని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి ప్రత్తిపాటి వెంకాయమ్మకు విక్రయించారన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించి, లావాదేవీల సొమ్మును హైకోర్టు రిజిష్ట్రార్ వద్ద డిపాజిట్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వేలం ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే బినామీల ద్వారా తమ భూములను అమ్మి సొమ్ము చేసుకోవాలని అగ్రిగోల్డ్ యాజమాన్యం భావిస్తోందని, అందుకు ఉదాహరణే ఈ 14 ఎకరాల భూమి విక్రయమని వెల్లడించారు.