CA student suicide
-
సింధు మృతికి ప్రియుడే కారణం!?
గుణదల (విజయవాడ తూర్పు): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడే సీఏ విద్యార్థిని సింధు మృతికి కారణమన్న అనుమానాలు బలపడుతున్నాయి. విజయవాడ గుణదలలో శనివారం వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సింధును పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఆమె ప్రియుడు ప్రసేన్ కొంతకాలంగా మరో యువతితో సంబంధం ఏర్పర్చుకున్నాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ యువతిని వివాహం చేసుకునేందుకే సింధును వదిలించుకోవాలని నిర్ణయించుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని అంటున్నారు. ఇక ఉద్దేశపూర్వకంగానే ప్రసేన్ తమ కుమార్తెను హత్యచేశాడని, అతడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గదిలో సింధు పడిఉన్న తీరు కూడా వారి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఆమె ఉరికి వేలాడకుండా నేలపై పడి ఉండడం గమనార్హం. ముక్కు నుంచీ తీవ్రంగా రక్తస్రావం జరిగిందని పోలీసులు తేల్చారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు ఆధారపడి ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహంపై గాయాలు, దెబ్బలు వంటివి ఉన్నట్లు రిపోర్టులో వస్తే ఇది హత్య కిందే పరిగణించాల్సి ఉంటుందన్నారు. నిందితుడు ప్రసేన్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
సారీ మామ్.. నేనో చెదిరిన స్వప్నాన్ని..
విశాఖపట్నం: క్షమించమ్మా.. అంచనాలను అందుకోలేకపోయాను.. అందుకే వెళ్లిపోతున్నాను.. అంటూ ఓ సీఏ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. 'నా కోసమే నువ్వు ఇంత కష్టపడుతున్నావు.. అందుకే ఈ ప్రపంచాన్ని వదిలేస్తున్నాను. లవ్ యూ అమ్మా.. అందరూ నన్ను క్షమించండి' అని సూసైడ్ నోట్ రాసి ప్రాణం తీసుకుంది. సీబీఎం కాపౌండ్ టింపనీ స్కూల్ సమీపంలో నిన్న ఈ సంఘటన జరిగింది. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. గణిశెట్టి సూర్యదుర్గ (19) బుల్లయ్య కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం విద్యార్థిని. అంతేకాకుండా సీపీ, సీపీటీ ప్రయివేట్ కళాశాలలో చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) కోర్సు ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి నాగేశ్వరరావు ప్లంబర్‌గా పనిచేస్తున్నారు. తల్లి నాగమణి గృహిణి. సోదరుడు సీఏ చదువుతున్నాడు. వీరు సీబీఎం కాంపౌండ్‌లో అద్దెకు ఉంటున్నారు. ఇటీవల విడుదలైనా సీఏ పరీక్ష ఫలితాల్లో సూర్యదుర్గ రెండు సబ్జెక్టుల్లో ఫెయిలయింది. దీంతో మనస్తాపం చెందింది. నాలుగైదు రోజుల నుంచి ముభావంగా ఉంటూ ఎవరితో మాట్లాడడం లేదు. ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులను వేరే గదిలో పడుకోమని చెప్పి సూర్యదుర్గ తాను ముందు గదిలో నిద్రించింది. వేకువ జాము సమయంలో ఇనుపరాడ్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం కుమార్తె గది తలుపు తీసి చూడగా సూర్యదుర్గ చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.