సారీ మామ్.. నేనో చెదిరిన స్వప్నాన్ని..
విశాఖపట్నం: క్షమించమ్మా.. అంచనాలను అందుకోలేకపోయాను.. అందుకే వెళ్లిపోతున్నాను.. అంటూ ఓ సీఏ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. 'నా కోసమే నువ్వు ఇంత కష్టపడుతున్నావు.. అందుకే ఈ ప్రపంచాన్ని వదిలేస్తున్నాను. లవ్ యూ అమ్మా.. అందరూ నన్ను క్షమించండి' అని సూసైడ్ నోట్ రాసి ప్రాణం తీసుకుంది. సీబీఎం కాపౌండ్ టింపనీ స్కూల్ సమీపంలో నిన్న ఈ సంఘటన జరిగింది.
త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. గణిశెట్టి సూర్యదుర్గ (19) బుల్లయ్య కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం విద్యార్థిని. అంతేకాకుండా సీపీ, సీపీటీ ప్రయివేట్ కళాశాలలో చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) కోర్సు ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి నాగేశ్వరరావు ప్లంబర్‌గా పనిచేస్తున్నారు. తల్లి నాగమణి గృహిణి. సోదరుడు సీఏ చదువుతున్నాడు. వీరు సీబీఎం కాంపౌండ్‌లో అద్దెకు ఉంటున్నారు. ఇటీవల విడుదలైనా సీఏ పరీక్ష ఫలితాల్లో సూర్యదుర్గ రెండు సబ్జెక్టుల్లో ఫెయిలయింది. దీంతో మనస్తాపం చెందింది. నాలుగైదు రోజుల నుంచి ముభావంగా ఉంటూ ఎవరితో మాట్లాడడం లేదు.
ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులను వేరే గదిలో పడుకోమని చెప్పి సూర్యదుర్గ తాను ముందు గదిలో నిద్రించింది. వేకువ జాము సమయంలో ఇనుపరాడ్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం కుమార్తె గది తలుపు తీసి చూడగా సూర్యదుర్గ చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.