చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌కు లైన్ క్లియర్
న్యూఢిల్లీ: రక్షణ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వానికి సలహాలివ్వనున్న ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)’ పదవి ఏర్పాటుకు భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ మంగళవారం ఓకే చెప్పింది. కార్గిల్ రివ్యూ కమిటీ 1999లో ఇచ్చిన సూచన మేరకు సీడీఎస్ నియామకాన్ని చేపట్టనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. సీడీఎస్‌గా నియమితులయ్యే వారు నాలుగు నక్షత్రాలతో కూడిన జనరల్ స్థాయి అధికారి అయి ఉంటారని, త్రివిధ దళాధిపతులతో సమానమైన వేతనాన్ని పొందుతారని మంత్రి తెలిపారు. సీడీఎస్ వ్యవస్థ మౌలిక సూత్రాలు, బాధ్యతలపై జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చిన నివేదికనూ భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ మంగళవారం ఆమోదించిందని అధికారులు తెలిపారు.
తొలి సీడీఎస్‌గా బిపిన్ రావత్?
దేశ రక్షణ రంగానికి తలమానికంగా చెప్పుకునే సీడీఎస్ పదవికి ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌ను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఈ నెల 31న రావత్ ఆర్మీ చీఫ్‌గా రిటైర్‌కానున్నారు. సీడీఎస్ హోదా త్రివిధ దళాల అధిపతులకు సమానంగా ఉంటుందని, ప్రోటోకాల్ ప్రకారం ఆయన త్రివిధ దళాల కంటే ఎక్కువ స్థాయిలో ఉంటారని అధికారులు వివరించారు. ఆర్మీ, వాయు, నావికాదళాలు కలిసికట్టుగా పనిచేసేలా చేయడం అందుకు తగిన ఏర్పాట్లు చేయడం సీడీఎస్ ప్రధాన బాధ్యత.
రూ. 6 వేల కోట్లతో అటల్ భూజల్ యోజన
ఐదేళ్లపాటు ఏడు రాష్ట్రాల్లో అమలయ్యే కేంద్ర ప్రాయోజిత పథకం అటల్ భూజల్ (అటల్ జల్) పథకాన్ని రూ. 6 వేల కోట్లతో అమలు చేసేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. సామాజిక భాగస్వామ్యంతో భూగర్భ జలాల యాజమాన్యం కోసం ఈ పథకాన్ని రూపొందించారు. గుజరాత్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
స్వదేశ్ దర్శన్ ప్రాజెక్టులకు నిధులు: స్వదేశ్ దర్శన్ పథకంలో భాగంగా పలు ప్రాజెక్టులకు నిధులను మంజూరు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త ప్రాజెక్టులకు గాను అదనంగా రూ. 1854.67 కోట్లను మంజూరు చేసేందుకు అంగీకరించింది. దేశాన్ని అంతర్జాతీయస్థాయి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు వీలుగా పర్యాటక మౌలిక వసతుల స్థాపన ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ స్కీమ్‌లో మొత్తం 15 సర్క్యూట్లు ఉన్నాయి.
రైల్వేలో సంస్థాగత మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ రైల్వే సంస్థాగత పునర్నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సంబంధిత వివరాలను రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో మీడియాకు చెప్పారు. సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా రైల్వే విభాగానికి సంబంధించి ఎనిమిది గ్రూప్–ఏ సర్వీసులను ఏకీకృతం చేసి ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్(ఐఆర్ఎంఎస్)గా పరిగణించాలని నిర్ణయించారు. రైల్వే బోర్డును పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. ఇకపై రైల్వే బోర్డు ఛైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులు, ఇద్దరు స్వతంత్ర సభ్యులు ఉంటారు. ఇండియన్ రైల్వే మెడికల్ సర్వీసెస్‌ను ఇండియన్ రైల్వే హెల్త్ సర్వీసెస్(ఐఆర్‌హెచ్‌ఎస్)గా మార్చనున్నారు.