49 శాతం మించిన ఎఫ్‌డీఐకి సీసీఎస్ అనుమతి
న్యూఢిల్లీ: రైల్వేలోని కీలక రంగాల్లో 49 శాతానికి మించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలను భద్రతపై ఏర్పాటు చేసిన కేబినెట్ కమిటీ (సీసీఎస్) అనుమతించాల్సి ఉందని కేంద్రం పేర్కొంది. తద్వారా ఈ రంగాల్లో ఎఫ్‌డీఐపై ఆంక్షలు విధించినట్లైంది. నిధుల కొరతతో సతమతమవుతున్న రైల్వేలకు ఊతమిచ్చేందుకు ఎఫ్‌డీఐ విధానాన్ని కేంద్ర మంత్రివర్గం ఇటీవల సడలించింది. అయితే దేశ సరిహద్దు ప్రాంతాల్లో రైల్వే మౌలిక సౌకర్యాలకు సంబంధించిన కొన్ని అంశాలపై హోంశాఖ ఆందోళన వెలిబుచ్చింది.
ఈ నేపథ్యంలో సరిహద్దులు, గిరిజన కాలనీల వంటి సున్నిత ప్రాంతాల్లో రక్షణ సంబంధ సమస్యలు అధిగమించేందుకు 49 శాతానికి మించిన ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను సీసీఎస్సే అనుమతిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. హైస్పీడ్ రైళ్లు, సబర్బన్ కారిడార్లు, రవాణా ప్రాజెక్టుల వంటి ఇతర రంగాల్లో 100 శాతం ఎఫ్‌డీఐకి ఆటోమేటిక్ రూట్లో క్లియరెన్స్ ఇస్తారని కూడా ఆ వర్గాలు పేర్కొన్నాయి. రైళ్ల నిర్వహణ, భద్రత రంగాల్లో ఎఫ్‌డీఐకి అనుమతి లేదని చెప్పాయి. దేశీయ రైల్వేలు దాదాపు రూ.29 వేల కోట్ల నిధుల కొరతను ఎదుర్కొంటున్నట్లు అంచనా.