tribal colony
-
గిరిజన కాలనీకి విద్యుత్ సరఫరా
జగన్ హెచ్చరికతో కదిలిన అధికార యంత్రాంగం సాక్షి, కడప: వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలం కనంపల్లె గిరిజన కాలనీకి మంగళవారం అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. రూ.వేలల్లో కరెంటు బిల్లులు అందజేసి.. వాటిని చెల్లించేవరకూ విద్యుత్ సరఫరా చేయబోమని అధికారులు తేల్చిచెప్పడం పట్ల ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ‘ఎస్సీ, ఎస్టీల పట్ల ఇంత అన్యాయమా?’ శీర్షికన ‘సాక్షి’లో ప్రముఖంగా వార్త ప్రచురితం కావడంతో అధికారులు గ్రామానికి చేరుకుని విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. విద్యుత్ బకాయిలను చెల్లించలేదనే కారణంతో మార్చి 31వ తేదీ నుంచి కనంపల్లె ఎస్టీ కాలనీలో విద్యుత్ సరఫరాను బంద్ చేశారు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా స్పందించలేదు. పదేళ్ల బిల్లులు కడితేనే కరెంటు కనెక్షన్ ఇస్తామని చెప్పడంతో.. గిరిజనులు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో గడిపారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సోమవారం పులివెందులకు రావడంతో సుమారు 70 మంది గిరిజనులు ఆయనను కలిసి తమ గోడు వివరించారు. దీంతో చలించిన జగన్.. మంగళవారంలోగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించకుంటే తీవ్ర పరిమాణాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం పులివెందుల రూరల్ ఏఈ పద్మనాభుడు ఆధ్వర్యంలో సిబ్బంది కనంపల్లెలోని గిరిజన కాలనీకి వెళ్లి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటామని గ్రామంలోని గిరిజనులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
పదిమంది పేకాట రాయుళ్లు అరెస్టు
రైల్వే కోడూరు(వైఎస్సార్ జిల్లా): పది మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రైల్వే కోడూరు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని మలంపాలెం గిరిజన కాలనీ సమీపంలో పేకాట ఆడుతున్నరాన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి పదిమందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 30,780 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు. -
49 శాతం మించిన ఎఫ్‌డీఐకి సీసీఎస్ అనుమతి
న్యూఢిల్లీ: రైల్వేలోని కీలక రంగాల్లో 49 శాతానికి మించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలను భద్రతపై ఏర్పాటు చేసిన కేబినెట్ కమిటీ (సీసీఎస్) అనుమతించాల్సి ఉందని కేంద్రం పేర్కొంది. తద్వారా ఈ రంగాల్లో ఎఫ్డీఐపై ఆంక్షలు విధించినట్లైంది. నిధుల కొరతతో సతమతమవుతున్న రైల్వేలకు ఊతమిచ్చేందుకు ఎఫ్‌డీఐ విధానాన్ని కేంద్ర మంత్రివర్గం ఇటీవల సడలించింది. అయితే దేశ సరిహద్దు ప్రాంతాల్లో రైల్వే మౌలిక సౌకర్యాలకు సంబంధించిన కొన్ని అంశాలపై హోంశాఖ ఆందోళన వెలిబుచ్చింది. ఈ నేపథ్యంలో సరిహద్దులు, గిరిజన కాలనీల వంటి సున్నిత ప్రాంతాల్లో రక్షణ సంబంధ సమస్యలు అధిగమించేందుకు 49 శాతానికి మించిన ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను సీసీఎస్సే అనుమతిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. హైస్పీడ్ రైళ్లు, సబర్బన్ కారిడార్లు, రవాణా ప్రాజెక్టుల వంటి ఇతర రంగాల్లో 100 శాతం ఎఫ్‌డీఐకి ఆటోమేటిక్ రూట్లో క్లియరెన్స్ ఇస్తారని కూడా ఆ వర్గాలు పేర్కొన్నాయి. రైళ్ల నిర్వహణ, భద్రత రంగాల్లో ఎఫ్‌డీఐకి అనుమతి లేదని చెప్పాయి. దేశీయ రైల్వేలు దాదాపు రూ.29 వేల కోట్ల నిధుల కొరతను ఎదుర్కొంటున్నట్లు అంచనా. -
రూ.3.31 కోట్లతో గిరిజన కాలనీల అభివృద్ధి
బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్: కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళెం, కొడవలూరు, విడవలూరు మండలాల్లోని గిరిజనకాలనీల్లో రూ.3.31 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం కాగులపాడు గిరిజనకాలనీకి రూ.83లక్షలు, జొన్నవాడ గిరిజన కాలనీకి రూ.44లక్షలు, ఇస్కపాళెం పంచాయతీ వడ్డిపాళెం గిరిజన కాలనీకి రూ.46లక్షలు మంజూరైనట్లు చెప్పారు. కొడవలూరు మండలం యల్లాయపాళెం తేళ్లమిట్ట గిరిజనకాలనీకి రూ.51.44 లక్షలు విడుదలైనట్లు తెలిపారు. విడవలూరు మండలం బుసగాడిపాళెం గిరిజనకాలనీకి రూ.1.5 కోట్లు మంజూరైనట్లు వివరించారు. ఈ నిధులతో గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలో సిమెంట్‌రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించనున్నట్లు తెలిపారు. వీటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. అలాగే కోవూరు, ఇందుకూరుపేట మండలాల్లోని గిరిజన కాలనీలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపామని, త్వరలో ఆయా మండలాలకు సంబంధించిన నిధులు మంజూరవుతాయని తెలిపారు. అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేసిన గృహనిర్మాణ శాఖ అధికారులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.