కర్ణాటక కాంగ్రెస్ లో 'కేబినెట్' చిచ్చు
బెంగళూరు: కర్ణాటకలో మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపింది. 14 మంత్రులపై సీఎం సిద్ధరామయ్య వేటు వేయడంతో హస్తం పార్టీలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణకు సంబంధించి గత రెండు రోజులుగా ఢిల్లీలో పార్టీ పెద్దలతో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి 14 మందిని మంత్రి మండలి నుంచి తప్పించాలని నిర్ణయించారు. రాజీనామాలు సమర్పించాలని సదరు మంత్రులను కోరినట్టు తెలుస్తోంది.
మంత్రి పదవులను కోల్పోనున్న కొంత మంది తిరుగుబాటు బావుటాను ఎగురవేస్తున్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ తనను మంత్రి పదవి నుంచి తప్పిస్తే ఎమ్మెల్యే స్థానానికి సైతం రాజీనామా చేసి వెళ్లిపోతానని హెచ్చరించారు. శ్యామనూరు శివశంకరప్పను బుజ్జగించేందుకు ఆయన కుమారుడు ఎస్.ఎస్.మల్లికార్జున్ (దావణగెరె ఉత్తర)కు కేబినెట్ లో చోటు కల్పించారు. సతీశ్ స్థానంలో రమేశ్ కుమార్ ను తీసుకున్నారు. 14 మంత్రులు ఈ సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కాగా, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై పార్టీ ఇమేజ్ పెరుగుతుందని సీఎం సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర విశ్వాసంతో ఉన్నారు. మరోవైపు తమ నేతకు మంత్రి పదవి ఇవ్వలేదన్న సమాచారంతో ఎమ్మెల్యే ఎం.క్రిష్ణప్ప మద్దతు దారులు బెంగళూరులో ఆందోళనకు దిగారు.