అందాల కెన్యా
షూటింగ్లకు నెలవు
సినీ పరిశ్రమకు ఆహ్వానం
సీఎంతో కెన్యా ప్రతినిధుల భేటీ
కెన్యాలో అందమైన లొకేషన్లు, ఆకర్షణీయ పర్యాటక కేంద్రాలు ఎన్నో ఉన్నాయని ఆ దేశ కేబినెట్ కార్యదర్శి అడెన్ మహ్మద్ తెలిపారు. సినిమా షూటింగ్లకు అన్ని రకాలుగా తమ దేశం ఉపయోగకరంగా ఉందని, తమిళ సినీ పరిశ్రమ షూటింగ్లకు తమ దేశానికి రావాలని ఆహ్వానం పలికారు.
సాక్షి, చెన్నై:సచివాలయంలో సీఎం పన్నీరు సెల్వం తో కెన్యా నుంచి వచ్చిన కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో ఎంపీలు, అధికారులతో కూడిన ప్రతినిధుల బృందం మంగళవారం భేటీ అయింది. భారత్-కెన్యాల మధ్య సత్సంబంధా లు, భారత్ నుంచి ఎగుమతులు, ఫార్మాసుటికల్, స్టీల్స్, యంత్రాలు, ఆటోమొబైల్స్ తదితర రంగాల గురించి పరస్పరం ఈ భేటీలో చర్చిం చారు. భారత్లో తమిళనాడు రెండో అతి పెద్ద రాష్ట్రంగా అన్ని రంగాల్లో దూసుకెళ్తోందని ఈ సందర్భంగా వారి దృష్టికి సీఎం పన్నీరు సెల్వం తీసుకెళ్లారు. ఇక్కడ పెట్టుబడులకు అనువైన ప్రదేశాలు, ఇక్కడ కల్పించిన రాయితీలు, సదుపాయాలను ఆ బృందానికి వివరించారు. అమ్మ జయలలిత మార్గదర్శకత్వంలో తాము అందిస్తున్న పథకాలు, ప్రజా హిత కార్యక్రమాల గురించి విశదీకరించారు. అన్ని రకాల వనరులు ఇక్కడ ఉన్నాయని, పెటుబడుల్ని నిర్భయంగా పెట్టవచ్చని సూచించారు.
అనంతరం ఆ బృందానికి చెందిన కేబినెట్ కార్యదర్శి అడెన్ మహ్మద్ మాట్లాడుతూ, మూడు రోజుల పాటుగా తాము తమిళనాడులో పర్యటించనున్నామని వివరించారు. కోయంబత్తూరులోని టెక్స్టైల్ పరిశ్రమల్ని, ఇంజనీరింగ్ సంస్థల్ని, వివిధ రకాల ఆటోమొబైల్స్ పరికరాల ఉత్పత్తి కేంద్రాలను సందర్శించనున్నామన్నారు. అలాగే, తమిళనాడులో వైద్య పరంగా సేవల్ని పరిశీలించనున్నామని వివరించారు. తమ దేశం నుంచి ఇక్కడికి వైద్య సేవల నిమిత్తం వచ్చే వారి సంఖ్య అధికంగా ఉందన్నారు. తమిళనాడు సినీ పరిశ్రమ అతి పెద్దదిగా గుర్తు చేస్తూ, వివిధ దేశాల్లో షూటింగ్లకు ఇక్కడి పరిశ్రమ తరలి వెళుతోందని వివరించారు. తమ దేశం కూడా షూటింగ్లకు అనుకూలంగా పేర్కొన్నారు. అందమైన లోకేషన్లు, ఆకర్షణీయమైన ప్రదేశాలు, పర్యాటక పరంగా మరెన్నో అందాలు కొలువు దీరి ఉన్నాయన్నారు.
తమ దేశంలో షూటింగ్లకు ముందుకు రావాలని తమిళ సినీ పరిశ్రమకు మహ్మద్ విజ్ఞప్తి చేశారు. భారత్, కెన్యాల మధ్య సత్సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని, మరింత బలపడే రీతిలో త్వరలో ఒప్పందాలు జరగబోతున్నాయన్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో చెన్నైలో జరగనన్న ప్రపంచ పెట్టుబడి దారుల భేటీకి తమ దేశం నుంచి ప్రతినిధులు రాబోతున్నారన్నారు. ఈ సమావేశంలో కెన్యా ప్రతినిధులు ఫోర్లెన్స్ ఐ విచే, ఒబురు ఒగింగా, జోషప్ లిమో, సక్వా మున్యాసీ, కిట్టూస్ హైవ్యూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె జ్ఞాన దేశికన్, సలహాదారులు షీలా బాలకృష్ణన్, రామానుజం, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి సీవీ శంకర్, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి కే షణ్ముగం, ప్లానింగ్ విభాగం ప్రధాన కార్యదర్శి ఎస్ కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.