కౌండిన్య క్యాలెండర్ ఆవిష్కరణ!
మల్కాజ్గిరి: గౌడ న్యాయవాదుల సమ్మేళనాన్ని పురస్కరించుకుని కౌండిన్య క్యాలెండర్ ఆవిష్కరణ కుషాయిగూడలో జరిగింది. కాటమయ్య ఆలయ సన్నిధిలోని మీటింగ్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు గౌడ న్యాయవాదులు హాజరయ్యారు. స్వామి వివేకానందుడి పిలుపునిచ్చిన జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో బీసీల ఐక్యత, గౌడ కుల అభివృద్ధి, యువజన ప్రగతి గురించి కూలంకుషంగా చర్చించారు. న్యాయవాదులే నడుం కట్టాలి తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించినట్టే.. బీసీల ఐక్యత, రాజ్యాధికారం కోసం కూడా గౌడ లాయర్లు ముందుకు రావాలని సమావేశంలో పిలుపునిచ్చారు.
పలువురు గౌడ న్యాయవాదులు హాజరయిన ఈ సమావేశంలో.. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడొద్దని పిలుపునిచ్చారు. ప్రతీ నియోజకవర్గంలో మెజార్టీలు బీసీలేనని, అయినా వారికి ఎలాంటి పదవులు రావడం లేదని ఆందోళన వెలిబుచ్చారు. కొన్ని చోట్ల బీసీ నాయకులను ఇబ్బంది పెట్టే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కొందరు బీసీ నేతలు చిన్న చిన్న పొరపాట్ల వల్ల, కుట్రల వల్ల ఓడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
సంఖ్యాపరంగా భారీగా ఉన్న బీసీలు ఏకీకృతం కావాలని, గౌడ ప్రజలు ఎక్కువ ఉన్న చోట నాయకత్వం పెరగాలని పిలుపునిచ్చారు. చారిత్రక ఆధారాలతో క్యాలండర్ గౌడ న్యాయవాదుల సమ్మేళనాన్ని పురస్కరించుకుని గౌడ జాతీయ అధ్యక్షుడు ఏడుకొండల గౌడ్ ప్రత్యేకంగా రూపొందించిన కౌండిన్య క్యాలెండర్ను ఆవిష్కరించారు. పురాణాల్లో కౌండిన్య ప్రస్తావన, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట, నాయకత్వ పటిమ, ప్రస్తుత పరిస్థితులను క్యాలెండర్లో వివరించారు.
ఈ సమ్మేళన కార్యక్రమాన్ని గులారి శ్రీనివాస్ గౌడ్ నిర్వహించగా.. అతిథులుగా బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్, మల్కాజిగిరి బార్ అసోషియేషన్ మాజీ అధ్యక్షులు బబ్బూరి శ్రీనివాస్ గౌడ్, రవికాంత్ గౌడ్, అజయ్ కుమార్ గౌడ్, సీనియర్ న్యాయవాదులు గులారి మల్లేశం గౌడ్, దేవరాజ్ గౌడ్ కార్యక్రమ నిర్వహణ సభ్యులు నవీన్ గౌడ్, గిరిధర్ గౌడ్, విశ్వనాథ్ గౌడ్, శివ గౌడు, ఇంకా సీనియర్ న్యాయవాదులు అరుణ్ గౌడ్, నరేష్ బాబు గౌడ్, సుధీర్ బాబు గౌడ్, గౌడ హాస్టల్ మెంబర్ పాండాల శివ గౌడ్, కెనరా బాంక్ సీనియర్ లీగల్ ఆఫీసర్ వెంకటేష్ గౌడ్, తాళ్ల వెంకటేష్ గౌడ్, రఘుపతి గౌడ్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి చదవండి: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ కొరడా