Calendar Slam
-
US Open 2021: రికార్డులపై జొకోవిచ్ గురి
న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్, సెర్బియా స్టార్ జొకోవిచ్‌ను రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. అందులో ఒకటి ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ (ఒకే ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గడం) కాగా... రెండోది పురుషుల విభాగంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా నిలువడం. ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీ టైటిల్స్‌ను గెలిచాడు. 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) సరసన చేరాడు. యూఎస్ ఓపెన్‌లోనూ జొకోవిచ్ గెలిస్తే 21 టైటిల్స్‌తో కొత్త చరిత్రను సృష్టిస్తాడు. అంతేకాకుండా దిగ్గజ ప్లేయర్ రాడ్ లేవర్ (1969లో) తర్వాత ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించిన ప్లేయర్‌గా నిలుస్తాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున జరిగే తొలి రౌండ్లో క్వాలిఫయర్ హోల్గర్ రునే (డెన్మార్క్) తో జొకోవిచ్ తలపడతాడు. -
జొకోకు షాక్
మూడోరౌండ్లోనే వెనుదిరిగిన నంబర్‌వన్ క్యాలెండర్ స్లామ్ ఆశలు ఆవిరి సామ్ క్వెరీ చేతిలో ఓటమి ప్రిక్వార్టర్స్‌లో ఫెడరర్, ముర్రే లండన్: వింబుల్డన్‌లో ఆరో రోజు అతి పెద్ద సంచలనం చోటు చేసుకుంది. వరుస విజయాలతో జోరుమీదున్న సెర్బియా స్టార్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు అనూహ్యమైన షాక్ తగిలింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగినా... ఓ తక్కువ ర్యాంక్ ఆటగాడి చేతిలో ఊహించని రీతిలో ఓటమిపాలయ్యాడు. శనివారం ముగిసిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో ప్రపంచ 41వ ర్యాంకర్ సామ్ క్వెరీ (అమెరికా) 7-6 (8/6), 6-1, 3-6, 7-6 (7/5)తో టాప్‌సీడ్ జొకోవిచ్పై సంచనల విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. 2008లో మారన్ చేతిలో రెండో రౌండ్లోనే ఓడిన జొకోవిచ్.. ఆ తర్వాత జరిగిన ప్రతి టోర్నీలో కనీసం క్వార్టర్స్‌కైనా చేరుకున్నాడు. కానీ ఈసారి మూడోరౌండ్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2009 ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత గ్రాండ్‌స్లామ్‌లో ఇంత తొందరగా జొకోవిచ్ వెనుదిరగడం ఇదే మొదటిసారి. మొత్తానికి 1969 (రాడ్ లేవర్) తర్వాత ‘క్యాలెండర్ స్లామ్’ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాలన్న కల నెరవేరలేదు. అలాగే గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 30 వరుస విజయాలకూ బ్రేక్ పడింది. క్వెరీతో రెండు గంటలా 57 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ కొన్నిసార్లు అనూహ్యంగా వెనుకబడ్డాడు. శుక్రవారం మొదలైన మ్యాచ్ వర్షం కారణంగా శనివారానికి వాయిదా పడింది. అయితే అప్పటికే తొలిరెండు సెట్లు కోల్పోయిన జొకోవిచ్ మూడోసెట్లో మాత్రం బాగా పుంజుకున్నాడు. తన ఫామ్‌ను చూపెడుతూ 5-0 ఆధిక్యంతో సెట్‌ను చేజిక్కించుకున్నాడు. ఇక నాలుగో సెట్లోనూ ఆరంభంలో అద్భుతంగా ఆడిన సెర్బియన్ 5-4 ఆధిక్యంలో నిలిచాడు. కానీ ఈ దశలో సర్వీస్‌ను చేజార్చుకున్నాడు. దీంతో సెట్ టైబ్రేక్‌కు వెళ్లినా.. చకచకా పాయింట్లతో ముందంజ వేశాడు. కానీ చివర్లో చేసిన ఫోర్‌హ్యాండ్ తప్పిదానికి అతి పెద్ద మూల్యం చెల్లించుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో క్వెరీ 31 ఏస్‌లు, 56 విన్నర్లు సంధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో రెండోసీడ్ ముర్రే (బ్రిటన్) 6-3, 7-5, 6-2తో జాన్ మిల్మన్ (ఆస్ట్రేలియా)పై; మూడోసీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6-4, 6-2, 6-2తో ఇవాన్స్ (బ్రిటన్)పై; ఐదోసీడ్ నిషికోరి (జపాన్) 7-5, 6-3, 7-5తో కుజ్నెత్సోవ్ (రష్యా)పై; 9వ సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 6-3, 6-3, 6-4తో లుకాస్ లాకో (స్లొవేకియా)పై నెగ్గి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టారు. ప్రిక్వార్టర్స్‌లో కెర్బర్: మహిళల సింగిల్స్ మూడోరౌండ్లో నాలుగో సీడ్ కెర్బర్ (జర్మనీ) 7-6 (11), 6-1తో విటోఫ్ట్ (జర్మనీ)పై; ఐదోసీడ్ హలెప్ (రొమేనియా) 6-4, 6-3తో బెర్టెన్స్ (నెదర్లాండ్స్)పై; సఫరోవా (చెక్) 4-6, 6-1, 12-10తో సెపలోవా (స్లొవేకియా)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. అయితే పదోసీడ్ క్విటోవా (చెక్) మాత్రం రెండోరౌండ్లోనే ఓడింది. -
సెరెనా క్యాలెండర్ స్లామ్ కొడుతుందా..?
సీజన్ లో చిట్ట చివరి గ్రాండ్ స్లామ్ టోర్నీ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. టైటిల్ గెలిచి సీజన్ ను ముగించాలని టాప్ సీడ్ ప్లేయర్స్ ఉవ్విళ్లూరుతున్నారు. అయితే.. స్వదేశంలో అరుదైన ఘనత సాధించాలని సెరెనా విలియమ్స్ పట్టుదలగా ఉంది. తన 17వ ఏట ఇదే టోర్నీలో గ్రాండ్ స్లామ్ ల వేట ప్రారంభించిన సెరెనా విలియమ్స్ ఈ టైటిల్ గెలిస్తే స్టెఫీ గ్రాఫ్ తర్వాత క్యాలెండర్ స్లామ్ పూర్తి చేసి క్రీడాకారిణిగా నిలవనుంది. 1988లో స్టెఫిగ్రాఫ్ నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచింది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఆస్ట్రేలియా, వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ లతో సత్తా చాటిన అమెరికా నల్లకలువ ఎలాగైనా అమెరికన్ ఓపెన్ కూడా తన ఖాతాలో వేసుకోవడానికి సన్నద్ధమవుతోంది. క్యాలెండ్ స్లామ్ పూర్తి చేయాలనే ఒత్తిడి తనపై ఉన్నా.. ఆ ఒత్తిడిని తాను ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్లు సెరెనా తెలిపింది. అంతే కాదు.. యూఎస్ ఓపెన్ ముందు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నాలూ చేస్తోంది. సెరెనా యూఎస్ ఓపెన్ లో గెలిస్తే వరసగా నాలుగో యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించినట్లు అవుతుంది. అంతే కాదు.. ఇప్పటికే 69 మేజర్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక 1999లో తొలి గ్రాండ్ స్లామ్ గెలుచుకున్న సెరెనా విలియమ్స్ కెరీర్ లో ఆరు విబుల్డన్, యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్స్ తో పాటు మూడు ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు సాధించింది. మహిళా టెన్నిస్ క్రీడాకారిణులందరికంటే బెస్ట్ సర్వీస్ విలియమ్స్ సొంతం.. ఇదే తన క్యాలెండర్ స్లామ్ పూర్తి చేసేందుకు ఉపయోగపడుతుంది అని ఆమె కోచ్ ధీమాగా చెబుతున్నాడు.