సెరెనా క్యాలెండర్ స్లామ్ కొడుతుందా..?
సీజన్ లో చిట్ట చివరి గ్రాండ్ స్లామ్ టోర్నీ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. టైటిల్ గెలిచి సీజన్ ను ముగించాలని టాప్ సీడ్ ప్లేయర్స్ ఉవ్విళ్లూరుతున్నారు. అయితే.. స్వదేశంలో అరుదైన ఘనత సాధించాలని సెరెనా విలియమ్స్ పట్టుదలగా ఉంది. తన 17వ ఏట ఇదే టోర్నీలో గ్రాండ్ స్లామ్ ల వేట ప్రారంభించిన సెరెనా విలియమ్స్ ఈ టైటిల్ గెలిస్తే స్టెఫీ గ్రాఫ్ తర్వాత క్యాలెండర్ స్లామ్ పూర్తి చేసి క్రీడాకారిణిగా నిలవనుంది. 1988లో స్టెఫిగ్రాఫ్ నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచింది.
ఈ ఏడాదిలో ఇప్పటికే ఆస్ట్రేలియా, వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ లతో సత్తా చాటిన అమెరికా నల్లకలువ ఎలాగైనా అమెరికన్ ఓపెన్ కూడా తన ఖాతాలో వేసుకోవడానికి సన్నద్ధమవుతోంది. క్యాలెండ్ స్లామ్ పూర్తి చేయాలనే ఒత్తిడి తనపై ఉన్నా.. ఆ ఒత్తిడిని తాను ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్లు సెరెనా తెలిపింది. అంతే కాదు.. యూఎస్ ఓపెన్ ముందు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నాలూ చేస్తోంది. సెరెనా యూఎస్ ఓపెన్ లో గెలిస్తే వరసగా నాలుగో యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించినట్లు అవుతుంది. అంతే కాదు.. ఇప్పటికే 69 మేజర్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది.
ఇక 1999లో తొలి గ్రాండ్ స్లామ్ గెలుచుకున్న సెరెనా విలియమ్స్ కెరీర్ లో ఆరు విబుల్డన్, యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్స్ తో పాటు మూడు ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు సాధించింది. మహిళా టెన్నిస్ క్రీడాకారిణులందరికంటే బెస్ట్ సర్వీస్ విలియమ్స్ సొంతం.. ఇదే తన క్యాలెండర్ స్లామ్ పూర్తి చేసేందుకు ఉపయోగపడుతుంది అని ఆమె కోచ్ ధీమాగా చెబుతున్నాడు.