పద్నాలుగేళ్ల వయసులోనే ప్రొఫెషనల్‌గా మారి అంతర్జాతీయ టెన్నిస్‌లో అరంగేట్రం చేసింది. 17 ఏళ్ల వయసులోనే తొలి గ్రాండ్‌స్లామ్ సాధించి అందరిని ఆకట్టుకుంది. అందరిలాగే ఒకటో.. రెండో గ్రాండ్‌స్లామ్‌లు కొట్టి వెళ్లిపోతుందిలే అని అంతా భావించారు. కానీ ఆరోజు తెలియదు.. ఆమె టెన్నిస్‌ను ఏలడానికి వచ్చిన మహరాణి అన్న విషయం. అనతికాలంలో ప్రపంచ టెన్నిస్ రారాణిగా అవతరించింది. ఆ కిరీటాన్ని అత్యంత సుదీర్ఘ కాలం ధరించింది. ఆమె పేరే సెరెనా విలియమ్స్. టెన్నిస్ అభిమానులంతా ముద్దుగా ''నల్లకలువ'' అని పిలుచుకుంటారు.
17 ఏళ్ల వయసులో తొలి గ్రాండ్‌స్లామ్ అందుకొని.. ఆ తర్వాత 23 గ్రాండ్‌స్లామ్‌లతో ఈ తరంలో మహిళల టెన్నిస్‌లో శిఖరాగ్ర స్థాయికి చేరుకుంది. సెరెనా వయసు ఇప్పుడు నలబై ఏళ్లు. ఇరవై ఏడేళ్లు టెన్నిస్ శ్వాసగా బతికిన ఆమె తాజాగా తన కెరీర్‌కు లాంగ్ బ్రేక్ తీసుకుంది. ఒక రకంగా రిటైర్‌మెంట్ అనే చెప్పొచ్చు. ఇకపై ఈ నల్లకలువ టెన్నిస్ కోర్టులో కనిపించే అవకాశం లేదు. అందుకే సెరెనా ఆటకు సలాం చెబుతూ ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
-సాక్షి, వెబ్‌డెస్క్
సెరెనా విలియమ్స్ లేని టెన్నిస్‌ను ఊహించడం చాలా కష్టం. ఈ నెలలో 41వ పుట్టిన రోజు చేసుకోనున్న సెరెనా 27 ఏళ్ల సుదీర్ఘ టెన్నీస్ కెరీర్‌లో.. 23 సార్లు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ చాంపియన్‌గా నిలిచింది. 1981 సెప్టెంబర్ 26న అమెరికాలోని మిచిగన్ రాష్ట్రంలో సాంగినావ్ నగరంలో జన్మించింది. ఆమె తల్లి ఒరాసీన్ ప్రైస్ నర్సుగా పని చేసేవారు. తండ్రి రిచర్డ్ విలియమ్స్ ఒక సెక్యూరిటీ సర్వీసు నడిపేవారు. సెరెనా అక్క వీనస్ విలియమ్స్.
వీనస్, సెరెనాలకు వారి తండ్రి రిచర్డ్ టెన్నిస్ నేర్పించారు. వాళ్లని ఊర్లో ఉన్న టెన్నిస్ కోర్టులకు తీసుకెళ్లి ఈ ఆట ఆడాలని ప్రోత్సహించారు. కోచింగ్‌లో చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవాడని చెప్పేవారు. సిస్టర్స్ ఇద్దరూ చాలా సేపు ప్రాక్టీస్ చేస్తుండేవారు. వీనస్, సెరెనాలు టెన్నిస్ అకాడమీలో చేరటానికి వీలుగా వీరి కుటుంబం 1991లో ఫ్లోరిడాకు నివాసం మారింది. 1994లో వీనస్ ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అడుగు పెట్టింది.
ఆ మరుసటి ఏడాదే అంటే 1995లో సెరునా కూడా అంతర్జాతీయ టెన్నిస్‌లో అడుగుపెట్టింది. అక్క వీనస్ విలియమ్స్ ఆటను చూసిన అప్పటి టెన్నిస్ అభిమానులు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను వీనస్ గెలుస్తుందని అంచనా వేశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చెల్లి సెరెనా ముందుగా దానిని సాధించింది. 1999 యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించింది.
అప్పుడు సెరెనా విలియమ్స్ వయసు కేవలం 17 ఏళ్లు. న్యూయార్క్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో నాటికి ప్రపంచ దిగ్గజాలైన మోనికా సెలెస్‌ను క్వార్టర్ ఫైనల్‌లో, లిండ్సే డావెన్‌పోర్ట్‌ను సెమీ ఫైనల్‌లో, వరల్డ్ నంబర్ వన్ మార్టినా హింగిస్‌ను ఫైనల్‌లో ఓడించి.. సెరెనా తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించడం విశేషం. ఇక అదే టోర్నమెంట్‌లో అక్క వీనస్ విలియమ్స్‌తో కలిసి డబుల్స్ టైటిల్‌ను కొల్లగొట్టింది. ఆ తర్వాత ఈ అక్కచెల్లెళ్లు తమ కెరీర్ ప్రస్థానంలో 14 గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు.
1999లో తొలి గ్రాండ్‌స్లామ్ గెలిచిన సెరెనా.. ఆ తర్వాత కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోలేదు. చాలా సందర్భాల్లో తన అక్క వీనస్ విలియమ్స్‌తోనే గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ ఆడి టైటిల్స్ గెలిచి అక్కపై పైచేయి సాధించింది. అలా 27 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో సెరెనా విలియమ్స్ 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌నెగ్గింది. ఇందులో ఏడుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్, మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్, ఏడుసార్లు వింబుల్డన్.. మరో ఆరుసార్లు యూఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. ఈ తరంలో మహిళల టెన్నిస్ విభాగంలో అత్యధిక టైటిళ్లు గెలిచిన క్రీడాకారిణిగా సెరెనా రికార్డు సృష్టించింది.
2017లో సెరెనా విలియమ్స్.. రెడిట్ సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహానియన్‌ను పెళ్లి చేసుకున్నారు.సెరెనా విలియమ్స్ ఎనిమిది వారాల గర్భంతో ఉన్న సమయంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ గెలిచి ఔరా అనిపించింది. ఇది ఆమెకు 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్.. ఇదే చివరిది. మహిళల టెన్నిస్ ఓపెన్ శకంలో ఆల్ టైమ్ విజేతల జాబితాలో సెరెనా విలియమ్స్ స్టెఫీ గ్రాఫ్‌ను అధిగమించింది. ఆమెకన్నా పైస్థానంలో మార్గరెట్ కోర్ట్ మాత్రమే 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో తొలి స్థానంలో ఉంది.
2017లో సెరెనా తన కుమార్తె అలెక్సిస్ ఒంపియాకు జన్మనిచ్చింది. అయితే సిజేరియన్ ఆపరేషన్ వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో సెరెనా దాదాపు ఆరు వారాల పాటు మంచానికే పరిమితమయ్యింది. 2018లో మళ్లీ టెన్నిస్ మైదానంలోకి అడుగుపెట్టిన సెరెనా.. వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టోర్నీల్లో ఫైనల్స్‌కు చేరినప్పటికి ఆఖరిమెట్టుపై బోల్తా పడింది. తాజాగా తన చివరి టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ అని చెప్పుకున్న సెరెనా.. ఈసారి కచ్చితంగా టైటిల్ సాధిస్తుందనుకున్న తరుణంలో మూడో రౌండ్‌తోనే ఆమె తన కెరీర్‌ను ముగించింది. తను ప్రొఫెషనల్ మ్యాచ్‌ను ఎక్కడైతే ఆరంభించిందో అదే టెన్నిస్ కోర్టులో ఇవాళ తుది మ్యాచ్ ఆడింది.
చదవండి: ముగిసిన 'నల్లకలువ' పోరాటం.. 'అక్క లేకపోతే నేను లేను' అంటూ భావోద్వేగం
Comments
Please login to add a commentAdd a comment