US Open 2022: Serena Williams Retirement From Tennis - Sakshi
Sakshi News home page

US Open 2022: ముగిసిన సెరెనా శకం

Published Sun, Sep 4 2022 1:58 AM | Last Updated on Tue, Sep 6 2022 11:41 AM

US Open 2022: Serena Williams retirement From Tennis - Sakshi

2007 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌... ఆ సమయంలో 81వ ర్యాంక్‌లో ఉన్న సెరెనా విలియమ్స్‌ అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగింది. అప్పటికి ఆమె గ్రాండ్‌స్లామ్‌ మాత్రమే కాదు, ఏదైనా డబ్ల్యూటీఏ టైటిల్‌ గెలిచి సరిగ్గా రెండేళ్లయింది. ఆట, శరీరం రెండూ గతి తప్పాయంటూ వరుసగా విమర్శలు వస్తున్నాయి... విపరీతంగా బరువు పెరిగిపోయి మైదానంలో చురుకైన కదలికలు లోపించాయి... టోర్నీలో తొలి మ్యాచ్‌కు ముందు ‘నైకీ’ ప్రతినిధి ఒకరు ప్లేయర్స్‌ లాంజ్‌లోకి వచ్చి సెరెనాను కలిశాడు. ఆశించిన స్థాయిలో సెరెనా ఆట లేదని, ఇలాగే సాగితే ఒప్పందం రద్దు చేసుకుంటాం అని హెచ్చరిక జారీ చేశాడు.

కనీసం క్వార్టర్‌ ఫైనల్‌ అయినా చేరాల్సిందేనని గట్టిగా చెప్పి వెళ్లాడు. అప్పటికే 7 గ్రాండ్‌స్లామ్స్‌ ఆమె ఖాతాలో ఉన్నా సరే, ఒక స్టార్‌ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నా సరే, ఆటతో పాటు కోర్టు బయట కూడా సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి... ఇలాంటి తీవ్ర ఒత్తిడి మధ్య సెరెనా ఆడింది. తన కసినంతా ప్రదర్శిస్తూ వరుసగా ఒక్కో ప్రత్యర్థిని దాటుకుంటూ ఫైనల్‌ చేరింది. అక్కడ షరపోవాను ఓడించి సగర్వంగా ట్రోఫీని అందుకుంది. గెలుపు అనంతరం తన ఆగ్రహాన్ని దాచుకోకుండా ‘ఓడాలని ఎవరూ కోరుకోరు. ఇలాంటి విజయాలే నన్ను మానసికంగా బలంగా మారుస్తాయి. విమర్శకులందరికీ ఇదే నా సమాధానం’ అంటూ గట్టిగా ప్రకటించింది. కెరీర్‌ ఆసాంతం ఇదే పోరాటపటిమ సెరెనాను గొప్పగా నిలిపింది.

అద్భుతమైన సర్వీస్, పదునైన గ్రౌండ్‌స్ట్రోక్‌లు, రిటర్న్స్‌లో ధాటి, చురుకైన అథ్లెట్‌ లక్షణాలు, అన్నింటికి మించి మానసిక దృఢత్వం... లోపాలు లేని ప్లేయర్‌గా సెరెనాను ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా నిలిపాయి. తనకంటే ముందు తరంలో అనేక మంది దిగ్గజాలతో పోలిస్తే ప్రత్యర్థిపై విరుచుకుపడే దూకుడు, పవర్‌ గేమ్‌ ఆమెను ప్రత్యేకంగా మార్చాయి. 14 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్‌గా ప్రారంభమైన ఆ ప్రస్థానం 18 ఏళ్ల పాటు ఘనంగా సాగి ఇప్పుడు ఆఖరి అంకానికి చేరింది. ఆటలోని అంకెలు మాత్రమే కాదు అంతకు మించిన ఆత్మవిశ్వాసం ఆమెను అందరికీ స్ఫూర్తిగా మార్చాయి.

బాల్యం నుంచి స్టార్‌గా మారిన తర్వాత కూడా పలు సందర్భాల్లో నల్ల జాతీయురాలిగా ఎదుర్కొన్న వివక్షను అధిగమించి శిఖరానికి చేరగలగడం ఆమెకే సాధ్యమైంది. తనపై కొందరు వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా సొంత దేశంలోనే ఒక ప్రతిష్టాత్మక టోర్నీలో 14 ఏళ్లు ఆడకుండా స్వీయ వనవాసం పాటించిన ఆమె... లింగ వివక్షపై కూడా టెన్నిస్‌ కోర్టులోనే తన ఆగ్రహాన్ని ప్రదర్శించడంలో వెనక్కి తగ్గలేదు. అమెరికాలో పేదరికానికి కేరాఫ్‌ అడ్రస్‌ లాంటి కాంప్టన్‌ పట్టణంలో పెరిగిన నాటి నుంచి ప్రపంచాన్ని జయించే వరకు కూడా సెరెనాను అదే పట్టుదల, ఓటమిని అంగీకరించని తత్వం నడిపించాయి. తన విజయాలతోనే కాదు తన ప్రతీ అడుగుతో, ఆడిన ప్రతీ షాట్‌తో క్రీడా ప్రపంచంపై మరచిపోలేని ముద్ర వేసి సెరెనా తన శకాన్ని ముగిస్తోంది. 

విజయ ప్రస్థానం...
ఓపెన్‌ శకంలో (1968 నుంచి) సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో దిగ్గజంగా ఎదిగినా సెరెనా మొదటి ట్రోఫీ మాత్రం మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రావడం విశేషం. 1998లో మ్యాక్స్‌ మిర్నీతో కలిసి వింబుల్డన్‌ గెలుచుకున్న సెరెనా ఆ తర్వాత యూఎస్‌ ఓపెన్‌నూ సొంతం చేసుకుంది. తర్వాతి ఏడాది పారిస్‌ ఇండోర్‌ టోర్నీ గెలవడంతో ఆమె ఖాతాలో మొదటి సింగిల్స్‌ టైటిల్‌ చేరింది. ఆ తర్వాత టెన్నిస్‌ ప్రపంచాన్ని సెరెనా శాసించడం లాంఛనమే అయింది. కొత్త మిలీనియంలో పాత స్టార్లంతా మెల్లగా నిష్క్రమిస్తూ రిటైర్మెంట్‌ బాట పట్టిన సమయంలో సెరెనా శకం మొదలైంది. 2002లో వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గి ఆ తర్వాత 2003లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తో కెరీర్‌ స్లామ్‌ పూర్తి చేసుకోవడంతో ఆమె స్థాయి పెరిగింది. అద్భుత విజయాల ఫలితంగా సహజంగానే నడిచొచ్చిన వరల్డ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌తో సెరెనా మరింత ఎత్తుకు ఎదిగింది. ఆ తర్వాత దశాబ్ద కాలానికి పైగా తిరుగులేని ప్రదర్శనతో సెరెనా సత్తా చాటింది.

ప్రత్యర్థి ఎవరైనా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడే తత్వం ఆమెను అగ్రస్థానాన నిలబెట్టింది. తన సమకాలీన ప్రత్యర్థులపై ఆమె ఆడిన మ్యాచ్‌ రికార్డు చూస్తే సెరెనా ఆధిక్యం ఎలా సాగిందో అర్థమవుతుంది. వీనస్‌ విలియమ్సపై 19–12, మార్టినా హింగిస్‌పై 7–6, కాప్రియాటిపై 10–7, హెనిన్‌పై 8–6, అజరెంకాపై 18–5తో సెరెనా పైచేయి సాధించింది. అయితే ఒకదశలో సమ ఉజ్జీలుగా నిలుస్తారని, హోరాహోరీ సమరాలు ఖాయమని టెన్నిస్‌ ప్రపంచం భావించిన మరో ప్రత్యర్థి మారియా షరపోవాపై సెరెనా ఆధిపత్యం తిరుగులేనిది. 2004 వింబుల్డన్‌ ఫైనల్లో సెరెనాపై 6–1, 6–4తో గెలవడంతో పాటు అదే ఏడాది డబ్ల్యూటీఏ ఫైనల్లో కూడా షరపోవాదే పైచేయి అయింది. కానీ ఆ తర్వాత వీరిద్దరు 17 సార్లు తలపడగా అన్ని సార్లూ సెరెనానే గెలిచి (ఓవరాల్‌గా 18–2) తానేంటో చూపించింది. 2014 యూఎస్‌ ఓపెన్‌ నుంచి వరుసగా మళ్లీ నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచి రెండోసారి ఈ ఫీట్‌ను సాధించడం సెరెనాకే సాధ్యమైంది. దీంతో పాటు ఆమె సాధించిన మూడు ఒలింపిక్‌ స్వర్ణాలు కెరీర్‌కు అదనపు హంగును జోడించాయి.  

గాయాలను అధిగమించి...
టెన్నిస్‌లో 30 ఏళ్ల వయసు అంటే రిటైర్మెంట్‌కు చేరువైనట్లే. గాయాలు, ఇతర ఫిట్‌నెస్‌ సమస్యలు సహజంగానే వెంటాడుతాయి. కానీ సెరెనా తన చివరి 10 గ్రాండ్‌స్లామ్‌లను 30 ఏళ్లు దాటిన తర్వాతే అందుకుంది. కెరీర్‌ మొదలు పెట్టిన దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంక్‌ సాధించడం అసాధారణ ఘనత. మొదటి నుంచి కూడా సెరెనాను పలు మార్లు గాయాలు ఇబ్బంది పెట్టాయి. మోకాలు, పొత్తికడుపు, చీలమండ, వెన్ను నొప్పి, కండరాలు, మోచేయి, భుజం, కాలికి గాయం, తొడ, బొటన వేలు, పొరపాటున గాజు పెంకులు గుచ్చుకోవడం... ఈ జాబితా చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. గాయంతో టోర్నీల ప్రారంభానికి ముందే తప్పుకోవడం, టోర్నీ మధ్యలో నిష్క్రమించడం చాలాసార్లు జరిగాయి. అయితే పట్టుదల, పోరాటతత్వం సెరెనాను మళ్లీ బలంగా పైకి లేచేలా చేశాయి. కోలుకుని వచ్చి అదే జోరులో విజయాలు సాధించి చూపడం ఆమెకే చెల్లింది. ఎనిమిది వారాల గర్భవతిగా ఉంటూ 2017 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించిన ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 2020 ఆరంభంలో ఆక్లాండ్‌ ఓపెన్‌ను గెలిచి మరోసారి అందరి దృష్టి తనపై పడేలా చేసింది.  

తొలి ప్రత్యర్థి: దిగ్గజ ఆటగాళ్లు కెరీర్‌లో ఎన్ని విజయాలు సాధించినా తొలి మ్యాచ్‌కు ఉండే ప్రాధాన్యతే వేరు. ప్రొఫెషనల్‌ డబ్ల్యూటీఏ కెరీర్‌లో సెరెనా తొలిసారి కెనడాలోని క్వాబెక్‌ సిటీలో జరిగిన ‘బెల్‌ చాలెంజ్‌’ టోర్నీలో వైల్డ్‌కార్డ్‌తో బరిలోకి దిగింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అప్పుడు 149వ స్థానంలో ఉన్న యానీ మిల్లర్‌ (అమెరికా) చేతిలో 1–6, 1–6 తేడాతో తొలి రౌండ్‌లోనే ఓడింది.  

గాయాలను అధిగమించి...
టెన్నిస్‌లో 30 ఏళ్ల వయసు అంటే రిటైర్మెంట్‌కు చేరువైనట్లే. గాయాలు, ఇతర ఫిట్‌నెస్‌ సమస్యలు సహజంగానే వెంటాడుతాయి. కానీ సెరెనా తన చివరి 10 గ్రాండ్‌స్లామ్‌లను 30 ఏళ్లు దాటిన తర్వాతే అందుకుంది. కెరీర్‌ మొదలు పెట్టిన దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంక్‌ సాధించడం అసాధారణ ఘనత. మొదటి నుంచి కూడా సెరెనాను పలు మార్లు గాయాలు ఇబ్బంది పెట్టాయి. మోకాలు, పొత్తికడుపు, చీలమండ, వెన్ను నొప్పి, కండరాలు, మోచేయి, భుజం, కాలికి గాయం, తొడ, బొటన వేలు, పొరపాటున గాజు పెంకులు గుచ్చుకోవడం... ఈ జాబితా చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. గాయంతో టోర్నీల ప్రారంభానికి ముందే తప్పుకోవడం, టోర్నీ మధ్యలో నిష్క్రమించడం చాలాసార్లు జరిగాయి. అయితే పట్టుదల, పోరాటతత్వం సెరెనాను మళ్లీ బలంగా పైకి లేచేలా చేశాయి. కోలుకుని వచ్చి అదే జోరులో విజయాలు సాధించి చూపడం ఆమెకే చెల్లింది. ఎనిమిది వారాల గర్భవతిగా ఉంటూ 2017 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించిన ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 2020 ఆరంభంలో ఆక్లాండ్‌ ఓపెన్‌ను గెలిచి మరోసారి అందరి దృష్టి తనపై పడేలా చేసింది.  

భారత్‌తో బంధం
2008 మార్చి... అప్పటికే సెరెనా ఎనిమిది గ్రాండ్‌స్లామ్‌లు గెలిచి స్టార్‌గా వెలుగొందుతోంది. అలాంటి సమయంలో కూడా ఆమె టెన్నిస్‌కు పెద్దగా ప్రాధాన్యత లేని భారత్‌లో... అదీ ఒక టియర్‌–2 టోర్నీలో పాల్గొనడం విశేషం. అదే బెంగళూరు ఓపెన్‌. ఈ టోర్నీలో ఆమెనే విజేతగా నిలిచింది. సెరెనా కెరీర్‌లో అది 29వ టైటిల్‌.   

ఆట ముగిసె...
సుమారు 24 వేల మంది ప్రేక్షకులు... గ్రాండ్‌స్లామ్‌ గెలుపు ప్రస్థానాన్ని ప్రారంభించిన సొంతగడ్డపై చివరి సారి బరిలోకి...ఆఖరి సారిగా ఆ రాకెట్‌ పదును వీక్షించేందుకు వచ్చిన ఫ్యాన్స్‌ సె–రె–నా... సె–రె–నా... అంటూ హోరెత్తిస్తున్నారు... భారీ స్క్రీన్‌పై గత రెండు మ్యాచ్‌ల తరహాలోనే కెరీర్‌ అత్యుత్తమ క్షణాలతో ‘మాంటేజ్‌’ వీడియో ప్రదర్శన... అది ముగిశాక సెరెనా విలియమ్స్‌ కోర్టులోకి అడుగు పెట్టింది. అప్పటికే ఆమె ప్రత్యర్థి ఐలా తొమ్లాయనోవిచ్‌ సిద్ధంగా ఉంది...ప్రతీ షాట్, ప్రతీ పాయింట్, ప్రతీ గేమ్, ప్రతీ సెట్‌... సెరెనా ప్రతీ అడుగు అభిమానులను అలరించింది. 185 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన సమరం చివరకు ఒక దిగ్గజం కెరీర్‌ను ముగించింది. కెరీర్‌లో తాను ఆడిన 1,014వ మ్యాచ్‌లో ఆస్రేలియా ప్రత్యర్థి చేతిలో ఓడి సెరెనా నిష్క్రమించింది.

భావోద్వేగంతో కన్నీళ్లపర్యంతమవుతూ ఇంటర్వ్యూ
ఇచ్చిన అనంతరం కోర్టంతా కలియతిరుగుతూ తనదైన శైలిలో ‘ట్విర్ల్‌’ తర్వాత అభివాదం చేస్తూ ఆమె కోర్టును వీడిన క్షణంతో ఒక అత్యద్భుత కెరీర్‌కు తెర పడింది.   

న్యూయార్క్‌: మహిళల టెన్నిస్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ సెరెనా విలియమ్స్‌ ఆటకు వీడ్కోలు పలికింది. యూఎస్‌ ఓపెన్‌లో మూడో రౌండ్‌లో పరాజయంతో ఆమె రిటైర్మెంట్‌ ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా 5–7, 7–6 (7/4), 1–6 తేడాతో ఐలా తొమ్లాయనోవిచ్‌ (ఆస్ట్రేలియా) చేతిలో ఓటమిపాలైంది. తొలి సెట్‌లో ఇద్దరూ పోటాపోటీగా తలపడ్డారు. ఒకదశలో సెరెనా 5–3తో ఆధిక్యంలో నిలిచింది. అయితే కోలుకున్న తొమ్లాయనోవిచ్‌ స్కోరు సమం చేయడంతో పాటు మరో రెండు గేమ్‌లు కూడా గెలిచి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్‌ కూడా ఇదే తరహాలో సాగింది. ఇక్కడా సెరెనా 5–2తో ఆధిక్యంలో నిలిచినా ఆసీస్‌ ప్రత్యర్థి పోరాడటంతో సెట్‌ టైబ్రేకర్‌ వరకు వెళ్లింది. ఈ దశలో తన అనుభవాన్నంతా వాడి సెరెనా సెట్‌ను గెలుచుకోవడంతో పోరు ఆసక్తికరంగా మారింది. అయితే చివరి సెట్‌లో మాత్రం తొమ్లాయనోవిచ్‌ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. రెండో గేమ్‌ తర్వాత స్కోరు 1–1తో సమంగా ఉన్నా ఆ తర్వాత వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి ఐలా 5–1తో విజయానికి చేరువైంది. ఏడో గేమ్‌లో ఆరు మ్యాచ్‌ సెరెనా ఆరు మ్యాచ్‌ పాయింట్లు కాపాడుకొని అభిమానులను అలరించినా...చివరకు ఫోర్‌ హ్యాండ్‌ అన్‌ఫోర్స్‌డ్‌ ఎర్రర్‌తో ఓటమి ఖాయమైంది.

కొన్ని వివాదాలూ...
ఆటలో ఎక్కడా దూకుడు తగ్గించని నైజంతో దూసుకుపోయిన సెరెనా సుదీర్ఘ కెరీర్‌లో అప్పుడప్పుడు వచ్చిన వివాదాలు కొంత చర్చ రేపినా, అవి ఆమె గొప్పతనాన్ని తగ్గించేవిగా మారలేదు. 2000 వింబుల్డన్‌లో వీనస్‌ చేతిలో సెరెనా చిత్తుగా ఓడినప్పుడు మ్యాచ్‌ ఫలితాన్ని తండ్రి రిచర్డ్‌ నిర్ణయించాడని, ఇది మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అని విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత 2001 ఇండియన్‌ వెల్స్‌ టోర్నీ సెమీస్‌కు ముందు ఆమె ప్రత్యర్థి వీనస్‌ గాయం పేరు చెప్పి అనూహ్యంగా తప్పుకోవడంతో ప్రేక్షకులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. దాంతో తీవ్ర ఆవేదనకు లోనైన తర్వాతి 14 ఏళ్ల పాటు ఆ టోర్నీలో ఆడలేదు. చెయిర్‌ అంపైర్లతో వాదనలు, అందుకు జరిమానాలతో పాటు బాల్‌ బాయ్‌ను కూడా ‘గొంతు కోస్తా’ అన్నట్లు రాకెట్‌తో హెచ్చరించడం వరకు చాలా సందర్భాల్లో సెరెనా తనపై నియంత్రణ కోల్పోయింది. 2018 యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో ఒసాకాతో మ్యాచ్‌ సందర్భంగా ఆమె ప్రవర్తన, రాకెట్‌ను నేలకు కొట్టడంవంటి ఘటనలతో బాగా చెడ్డపేరు వచ్చింది. అయితే ఆమెలోని అద్భుతమైన ఆట అలాంటి తప్పులను కాచేలా చేయగలిగింది.

ఇవి కన్నీళ్లు కాదు. ఆనంద భాష్పాలు. నా తల్లిదండ్రులే ఈ ఘనతకు కారణం. వారికి ఏం ఇచ్చినా తక్కువే. ఇక అక్క వీనస్‌ లేకపోతే చెల్లి సెరెనా లేదు. సెరెనా ప్రతీ విజయం వెనక వీనస్‌ ఉంది. ఇదో అత్యద్భుత ప్రయాణం. నా కెరీర్‌లో ఎప్పుడూ చివరి వరకు కూడా ఓటమిని అంగీకరించలేదు. ఇప్పుడు కూడా అలాగే పోరాడాను. ఇన్నేళ్లుగా నాకు కోర్టులో మద్దతునిచ్చిన అందరికీ కృతజ్ఞతలు. నా జీవితమంతా టెన్నిస్‌ ఆడాను. నేను కోరుకున్నదంతా సాధించాను. ఇకపై ఆటకు దూరంగా భిన్నంగా జీవితాన్ని గడపాలనుకుంటున్నా. రెండోసారి అమ్మను కావాలని భావిస్తున్నా.      
–సెరెనా

సాక్షి క్రీడా విభాగం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement