ఉగ్రవాదులు పాక్ నుంచే వచ్చారు!
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి పాకిస్తాన్ గూఢచార్య సంస్థ (ఐఎస్ఐ), జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ పథకం రచించినట్టు భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచే వచ్చారని, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఆస్తులను చాలావరకు ధ్వంసం చేసేందుకు కుట్ర పన్నారని, ముఖ్యంగా విమానాలు, హెలికాప్టర్లను లక్ష్యంగా చేసుకున్నట్టు సమాచారం.
ఉగ్రవాదులు పఠాన్‌కోట్ నుంచి పాకిస్తాన్‌కు ఫోన్ కాల్స్ చేసినట్టు నిఘా సంస్థలు గుర్తించాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉగ్రవాదులు నాలుగుసార్లు ఫోన్ చేశారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసిన ఉగ్రవాదుల్లో ఒకడు తన తల్లితో ఫోన్ లో మాట్లాడుతూ.. ఆత్మాహుతి దాడిలో పాల్గొంటున్నట్టుగా చెప్పినట్టు ఫోన్ సంభాషణల్లో వెల్లడైంది. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఏడుగురు ఉగ్రవాదులు దాడిచేస్తున్నట్టు ఆ ఫోన్ కాల్లో ప్రస్తావించాడు. పంజాబీ, ముల్తానీ భాషల్లో సంభాషణలు సాగాయి. ఉగ్రవాదులు పాకిస్తాన్‌లోని ముల్తాన్, బహవల్పూర్ నుంచి వచ్చినట్టు ఫోన్ కాల్స్ ద్వారా నిఘా వర్గాలు గుర్తించాయి. డిసెంబర్ 30న ఉగ్రవాదులు రెండు కార్లలో వచ్చినట్టు సమాచారం. శనివారం పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు సిబ్బంది మరణించగా, ఐదుగురు ఉగ్రవాదులను సైనికులు హతమార్చారు.