కాల్‌మనీ వేధింపులపై ఫిర్యాదుల వెల్లువ
గ్రీవెన్స్‌లో అధికారుల ఎదుట బాధితుల గోడు
గుంటూరు (ఏటీ అగ్రహారం): జిల్లా పోలీస్ కార్యాలయంలోని రూరల్, అర్బన్ ఎస్పీ కార్యాలయాల్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బాధితుల సమస్యల పరిష్కారం కోసం అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు సంబంధిత అధికారులకు తగిన అదేశాలు ఇచ్చారు. వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని...
► ఆర్టీసీ కాలనీ వెంకట్రావుపేటకు చెందిన షేక్ యూసఫ్ అదే పేటకు చెందిన షేక్ మసూద్ వద్ద నాలుగు సంవత్సరాల క్రితం రూ.80 వేలు అప్పుగా తీసుకున్నాడు. అప్పటి నుంచి నెలకు రూ.16 వేలు చొప్పున వడ్డీ కడుతున్నాడు. తన తండ్రి చనిపోవడంతో ఆర్థిక పరిస్థితి సరిగా లేక 6 నెలల నుంచి వడ్డీ కట్టడంలేదు. దీంతో షేక్ మసూద్ డబ్బులు కట్టమని పోలీసులతో బెదిరిస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
► నెహ్రూనగర్ బుచ్చయ్యతోటకి చెందిన టీ.శ్రీనివాస్ 8 సంవత్సరాల క్రితం అదే ప్రాంతానికి చెందిన సీదా రంగారావు వద్ద రూ. 90 వేలు, పూల నారాయణ వద్ద రూ.1 లక్ష వడ్డీకి తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరికీ నెలనెల వడ్డీ కడుతూ వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో వడ్డీతోపాటు కొంత ఆసలు తిరిగి చెల్లించాడు. వ్యాపారంలో నష్టం రావడంతో మూడు నెలల నుంచి వారికి వడ్డీ డబ్బులు కట్టలేకపోతున్నానని, దానికి వారు తనను ఇంటిలో నుంచి రోడ్డుపైకి ఇడ్చుకొచ్చి కొడుతున్నారని అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా ఖాళీ కాగితాలపై సంతకాలు పెట్టమని బెదిరిస్తున్నారని ఆరోపించాడు. తీసుకున్న డబ్బు చెల్లించేందుకు కొంత గడువు ఇప్పించి, వారి బెదిరింపుల నుంచి తన కుటుంబాన్ని రక్షించాలని కోరాడు.
► తాడేపల్లికి చెందిన కొండెపోగు శాంతి తన 2.54 ఎకరాల భూమిని, 5 సెంట్లు ఇంటి స్థలాన్ని కబ్జా చేశారని అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తాడేపల్లికి చెందిన బాలసాని రాజేశ్వరరావు కొంత మంది రౌడీలతో కలసి 1.73 సెంట్లు భూమిని ఆక్రమించున్నాడని, అడిగితే రౌడీలతో కొట్టిస్తున్నాడని, తను నివసించే ఇంటిని కూడా తగులబెట్టారని ఫిర్యాదులో పేర్కొంది. సముద్రాల శౌరి అనే వ్యక్తి 81 సెంట్లు కబ్జా చేశాడని పేర్కొంది. వారిద్దరూ తన మొత్తం భూమిని ఆక్రమించుకున్నారని 2003 నుంచి ఆధికారుల చూట్టూ తిరుగుతున్నానని, తనకు న్యాయం చేయాలని కోరింది.
►పెదకాకాని మండలం, రామచంద్రపాలెం గ్రామానికి చెందిన దొప్పలపూడి చిట్టెమ్మ తన ఫిర్యాదులో.. తన కుమార్తె 15 సంవత్సరాల క్రితం చనిపోయిందని, తరువాత అల్లుడు భవాని అనే ఆమెను మరో పెళ్ళి చేసుకున్నాడని, కూతురు చనిపోయినప్పటి నుంచి మనవరాలు భాగ్యశ్రీ తన వద్దే పెరుగుతోందని పేర్కొంది. అయితే నాలుగు సంవత్సరాల క్రితం అల్లుడు కూడా మరణించాడని, తన అల్లుడి ఆస్తికి మనవరాలు భాగ్యశ్రీ వారసురాలు అని ఫిర్యాదులో తెలిపింది. అయితే భావాని అనే ఆమె మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుని మనవరాలి ఆస్తిని అక్రమించుకుందని ఆరోపించింది. వారి నుంచి∙తన మనమరాలు భాగ్యశ్రీకి, ఆమె ఆస్తికి చట్టరీత్యా రక్షణ కల్పించాలని కోరింది.
► పిడుగురాళ్ళకు చెందిన మహ్మద్ రఫి, మహబూబి తమ ఫిర్యాదులో...తమ కూతురు అప్సర ఈ నెల 3వ తేదీ నుంచి కనిపించడంలేదని రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వారు సరిగా స్పందించడం లేదని, తమ కూతురిని వెతికించాలని విజప్తి చేశారు.
► చిలకలూరిపేటకి చెందిన తిన్నలూరి వెంకటేశ్వర్లు, ప్రకాశం జిల్లా గిద్దలూరుకి చెందిన వడ్లమాని లక్ష్మీ ఈ నెల 21న స్నేహితుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నామని, తమ ఇద్దరి తల్లిదండ్రుల వైపు నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని వారు రూరల్ ఎస్పీని ఆశ్రయించారు.