calls off wedding
-
Hyderabad: పాత మంచం ఇచ్చారని పెళ్లి రద్దు చేసిన వరుడు..
మరికొద్ది గంటల్లో మూడుముళ్లతో వివాహ బంధంలోకి అడుగుపెడతాడనుకునే వరుడు ఉన్నట్టుండి పెళ్లిని రద్దు చేసుకున్నాడు. మండపం వద్దకు వచ్చేది లేదని తెగేసి చెప్పాడు. చివరికి ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. మౌలాలీకి చెందిన ఓ వ్యక్తి బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి బండ్లగూడకు చెందిన యువతితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఈనెల 13న ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది. 19వ తేదీన(ఆదివారం) పెళ్లికి ఏర్పాట్లు చేశారు. కాగా వధూవరులిద్దరికి ఇది రెండో పెళ్లి. అయితే అమ్మాయికి మొదటి పెళ్లి సమయంలో ఇచ్చిన గృహోపకరణ వస్తువులనే వరుడికి పెట్టుపోతలు కింద ఇస్తామని వధువు తండ్రి చెప్పారు. అయితే మంచం మాత్రం కొత్తది ఇవ్వాలని వరుడు షరతు పెట్టాడు. ఆదివారం పెళ్లి జరగాల్సి ఉండగా ఒకరోజు ముందుగా అల్మారా, మంచం, పరుపు, డ్రెస్సింగ్ టేబుల్ ఇతర వస్తువులను వరుడి ఇంటికి పంపించారు. ఈ క్రమంలో మంచం విడి భాగాలు బిగిస్తుండగా విరిగిపోయింది. దీంతో పాత మంచాలు పంపించారని వరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంకేముంది ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని మరికాసేపట్లో పెళ్లనగా వరుడు మండపం వద్దకు రాలేదు. పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు అన్ని జరిగిపోయాయి. వధువు తరపు బంధువులు అంతా వచ్చేశారు. ఎంతసేపటికి పెళ్లి కొడుకు రాకపోవడంతో వధువు కుటుంబ సభ్యులు వరుడు ఇంటికి వెళ్లారు. అక్కడ వారితో పాత మంచం పెట్టారని, విడి భాగాలు అమర్చతుండగా విరిగిపోయిందని వరుడు మండిపడ్డాడు. కోపంతో అతని కుటుంబ సభ్యులు వధువు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకున్నారు. కొత్త మంచం ఇవ్వమంటే పాత మంచానికి రంగులు వేసి పంపిస్తారా.. ఈ పెళ్లి జరగదని తేల్చి చెప్పారు. పెళ్లి రోజు వివాహాన్ని రద్దు చేస్తే ఎలా అని వధువు వారు బతిమాలినా వరుడు వినలేదు. దీంతో చేసేదేం లేక పెళ్లికూతురు తండ్రి చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇరు పక్షాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోవడంతో వరుడిపై 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. -
కాసేపట్లో పెళ్లి.. పీటలపై ఊహించని ట్విస్ట్‌తో వరుడికి షాకిచ్చిన వధువు
పెళ్లి సమయం దగ్గర పడింది. ఇరు కుటుంబ సభ్యులు ఏర్పాట్ల బిజీలో నిమగ్నమయ్యారు. పెళ్లికొచ్చిన చుట్టాలు, మామిడి తోరణాలతో ఇల్లంతా పండుగ వాతావరణం నెలకొంది. కన్నుల జరిగే పెళ్లిని చూసేందుకు అందరూ ఎదురుచూస్తున్నారు. కానీ.. ఊహించని ట్విస్ట్ తో వైభవంగా జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. భార్యతో కొత్తజీవితాన్ని ప్రారంభించాలని కలలు కంటున్న వరుడితోసహా.. అందరికీ వధువు గట్టి షాకిచ్చింది. వరుడు కుటుంబం ఖరీదైన లెహంగా కొనలేదనే కారణంతో వధువు పీటల మీద పెళ్లిని ఆపేసింది. ఈ వింత ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని హల్ద్వానీలో వెలుగుచూసింది. రాజ్‌పురాకు చెందిన యువతికి ఈ జూన్‌లో ఓ యువకుడితో ఎంగేజ్మెంట్ జరిగింది. నవంబర్ 5న పెళ్లి జరగాల్సి ఉంది. దీంతో సంప్రదాయం ప్రకారం వరుడు తరుపు వారు వధువుకి వివాహం దుస్తులు కొనిచ్చారు. పెళ్లి రోజు రానే వచ్చింది. అందంగా ముస్తాబైన వధూవరులు తమ కుటుంబాలతో వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో తన పెళ్లి లెహంగా కోసం వరుడు ఫ్యామిలీ కేవలం రూ. 10 వేలు ఖర్చు చేశారనే విషయం వధువుకి తెలిసింది. దీంతో ఆగ్రహం చెందిన యువతి పచ్చటి పందిట్లో ఈ వివాహం తనకొద్దంటూ తేగేసి చెప్పింది. షాకైన వరుడు తండ్రి అమ్మాయి వద్దకు వచ్చి తనకు నచ్చిన లెహంగా కొనుక్కోవాలని ఏటీఎం కార్డు కూడా ఇచ్చాడు. అంతేగాక యువతి లెహంగాను ప్రత్యేకంగా లక్నో నుంచి తీసుకొచ్చామని వరుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. అయినప్పటికీ ఆమె అందుకు అంగీకరించలేదు. ఇక ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. పోలీసులు, బంధువులు ఎంత సర్ధిచెప్పాలని చూసిన ప్రయోజనం లేకుండాపోయింది. అనేక గొడవల అనంతరం చివరికి పెళ్లిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. చదవండి: స్నేహితుడి పెళ్లిలో చీరలో మెరిసిన అమెరికన్స్.. ఎంత సక్కగున్నారో! -
పెళ్లిళ్లు ఇలా కూడా ఆగిపోతాయా?
విచిత్రమైన కారణాలు ఈ మధ్య మూడు ముళ్ల బంధాన్ని ఒక్కటిగా మారకుండా అడ్డుకుంటున్నాయి. తాజాగా, బిహార్‌లో జరిగిన ఓ ఘటన ముక్కున వేలేసుకునేలా ఉంది. పెళ్లి కొడుకు ప్రవర్తన సరిగ్గా లేదంటూ వధువు పీటల మీది నుంచి వెళ్లిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... పట్నా: సరన్ జిల్లా చిట్రసెన్పూర్ గ్రామానికి చెందిన ఓ యువతికి.. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో కొద్దిరోజుల క్రితం నిశ్చితార్థం అయ్యింది. శుక్రవారం వారిద్దరికీ అంగరంగ వైభవంగా వివాహం జరగాల్సింది. సర్వం సిద్ధమైన వేళ, మేఘాలు అలుముకుని దగ్గర్లో ఓ పిడుగు పడింది. ఆ శబ్ధం విన్న వరుడు తీవ్రంగా భయపడ్డాడు. అంతే వరుడు ఉత్త పిరికోడంటూ.. పెళ్లి వద్దే వద్దని చెబుతూ వధువు పీటల మీదినుంచి లేచింది. వధువు చేసిన పనితో నిశ్చేష్టులైన బంధువులు.. తేరుకుని ఆమె నిర్ణయాన్ని సమర్థించారు. అయితే ఆ తరువాతే ఆ మండపం రణరంగంగా మారింది. మగ పెళ్లివారికీ, ఆడ పెళ్లివారికీ మధ్య పెద్ద గొడవే జరిగింది. విషయం తెలుసుకున్న సోనేపూర్ పోలీసులు అక్కడికొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు యత్నించినా లాభం లేకపోయింది. అయితే దాడి చేశారన్న వరుడి బంధువుల ఫిర్యాదుతో యువతి బంధువుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
'ఫ్లెక్సీ'తో పెళ్లాగిపోయింది!
తిరువణ్ణామలై: పెళ్లి కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఓ యువతి జీవితాన్ని కాపాడింది. తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ఎయిడ్స్ ఉందని 'ఫ్లెక్సీ' ద్వారా యువతికి తెలియడంతో ఆమె ప్రమాదం నుంచి బయపడింది. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా చెంగం పట్టణంలో సోమవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పెళ్లి కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలోని వరుడి ఫొటో చూసిన ఓ వ్యక్తి ఆదివారం రాత్రి జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారి ఎస్ పళనికి ఫోన్ చేశాడు. పెళ్లికొడుక్కి ఎయిడ్స్ ఉందని తెలిపాడు. 'ఆదివారం రాత్రి 9.30 గంటలకు నాకు ఫోన్ వచ్చింది. వరుడు హెచ్ ఐవీ చికిత్స తీసుకుంటున్నాడని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు. ఇది వాస్తవమో, కాదో కనుక్కోవాలని ఎస్పీ, మెడికల్ జాయింట్ డైరెక్టర్ కు వెంటనే సూచించాను. వధువు కుటుంబం చిరునామా కనుక్కోమని రెవెన్యూ అధికారులకు పురమాయించాన'ని కలెక్టర్ తెలిపారు. '2014, జూలై 30 నుంచి ప్రభుత్వాసుపత్రిలో వరుడు ఎయిడ్స్ నివారణకు చికిత్స తీసుకుంటున్నట్టు నిర్ధారించుకుని అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో అతడికి ఫోన్ చేశాం. తానే స్వయంగా వచ్చి కలుస్తానని చెప్పాడు. కానీ అతడు రాలేదు. దీంతో వధువు కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాం. తన పెళ్లి చెడగొట్టేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని పెళ్లికొడుకు వాళ్లకు ముందే చెప్పడంతో మా మాటలు నమ్మలేదు. దీంతో మేము హుటాహుటిన వివాహ వేదిక వద్దకు చేరుకున్నామ'ని చెంగం తహశీల్దార్ ఎం. కామరాజ్ వెల్లడించారు. వైద్యాధికారి సెంథిల్ కుమార్, చెంగం డీఎస్పీ, తహశీల్దార్.. వధువుకు, ఆమె కుటుంబ సభ్యులకు పెళ్లికొడుకు గురించి చెప్పారు. అతడిని పెళ్లి చేసుకోకూడదని పెళ్లికూతురు నిర్ణయం తీసుకుంది. సకాలంలో స్పందించి తమ కూతురి జీవితాన్ని కాపాడినందుకు అధికారులకు వధువు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. రాత్రి అని కూడా చూడకుండా ఏడు గంటల పాటు తాము కష్టపడినందుకు ఫలితం దక్కిందని కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసుల భద్రత మధ్య వధువు కుటుంబ సభ్యులను సొంత గ్రామానికి తిరిగివచ్చారు. అదేరోజు తమ గ్రామానికి చెందిన మరో యువకుడిని వధువు పెళ్లాడడంతో ఈ ఉదంతం సుఖాంతమైంది.