విచిత్రమైన కారణాలు ఈ మధ్య మూడు ముళ్ల బంధాన్ని ఒక్కటిగా మారకుండా అడ్డుకుంటున్నాయి. తాజాగా, బిహార్‌లో జరిగిన ఓ ఘటన ముక్కున వేలేసుకునేలా ఉంది. పెళ్లి కొడుకు ప్రవర్తన సరిగ్గా లేదంటూ వధువు పీటల మీది నుంచి వెళ్లిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...
పట్నా: సరన్ జిల్లా చిట్రసెన్‌పూర్ గ్రామానికి చెందిన ఓ యువతికి.. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో కొద్దిరోజుల క్రితం నిశ్చితార్థం అయ్యింది. శుక్రవారం వారిద్దరికీ అంగరంగ వైభవంగా వివాహం జరగాల్సింది. సర్వం సిద్ధమైన వేళ, మేఘాలు అలుముకుని దగ్గర్లో ఓ పిడుగు పడింది. ఆ శబ్ధం విన్న వరుడు తీవ్రంగా భయపడ్డాడు. అంతే వరుడు ఉత్త పిరికోడంటూ.. పెళ్లి వద్దే వద్దని చెబుతూ వధువు పీటల మీదినుంచి లేచింది. వధువు చేసిన పనితో నిశ్చేష్టులైన బంధువులు.. తేరుకుని ఆమె నిర్ణయాన్ని సమర్థించారు. అయితే ఆ తరువాతే ఆ మండపం రణరంగంగా మారింది. మగ పెళ్లివారికీ, ఆడ పెళ్లివారికీ మధ్య పెద్ద గొడవే జరిగింది. విషయం తెలుసుకున్న సోనేపూర్ పోలీసులు అక్కడికొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు యత్నించినా లాభం లేకపోయింది. అయితే దాడి చేశారన్న వరుడి బంధువుల ఫిర్యాదుతో యువతి బంధువుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment