Hyderabad Groom Calls Off Wedding Over Old Furniture In Dowry - Sakshi
Sakshi News home page

Hyderabad: పెళ్లిలో పెట్టుపోతల కింద పాత మంచం.. కాబోయే మామకు షాకిచ్చిన వరుడు

Feb 21 2023 10:06 AM | Updated on Feb 21 2023 3:49 PM

Hyderabad Groom Calls Off Wedding Over Old Furniture In Dowry - Sakshi

మరికొద్ది గంటల్లో మూడుముళ్లతో వివాహ బంధంలోకి అడుగుపెడతాడనుకునే వరుడు ఉన్నట్టుండి పెళ్లిని రద్దు చేసుకున్నాడు. మండపం వద్దకు వచ్చేది లేదని తెగేసి చెప్పాడు. చివరికి ఈ పంచాయతీ పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. మౌలాలీకి చెందిన ఓ వ్యక్తి బస్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి బండ్లగూడకు చెందిన యువతితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఈనెల 13న ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది. 19వ తేదీన(ఆదివారం) పెళ్లికి ఏర్పాట్లు చేశారు.

కాగా వధూవరులిద్దరికి ఇది రెండో పెళ్లి. అయితే అమ్మాయికి మొదటి పెళ్లి  సమయంలో ఇచ్చిన గృహోపకరణ వస్తువులనే వరుడికి పెట్టుపోతలు కింద ఇస్తామని వధువు తండ్రి చెప్పారు. అయితే మంచం మాత్రం కొత్తది ఇవ్వాలని వరుడు షరతు పెట్టాడు. ఆదివారం పెళ్లి జరగాల్సి ఉండగా ఒకరోజు ముందుగా అల్మారా, మంచం, పరుపు, డ్రెస్సింగ్‌ టేబుల్‌ ఇతర వస్తువులను వరుడి ఇంటికి పంపించారు. ఈ క్రమంలో మంచం విడి భాగాలు బిగిస్తుండగా విరిగిపోయింది.

దీంతో పాత మంచాలు పంపించారని వరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంకేముంది ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని మరికాసేపట్లో పెళ్లనగా వరుడు మండపం వద్దకు రాలేదు. పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు అన్ని జరిగిపోయాయి. వధువు తరపు బంధువులు అంతా వచ్చేశారు. ఎంతసేపటికి పెళ్లి కొడుకు రాకపోవడంతో వధువు కుటుంబ సభ్యులు వరుడు ఇంటికి వెళ్లారు. అక్కడ వారితో పాత మంచం పెట్టారని, విడి భాగాలు అమర్చతుండగా విరిగిపోయిందని వరుడు మండిపడ్డాడు. 

కోపంతో అతని కుటుంబ సభ్యులు వధువు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకున్నారు. కొత్త మంచం ఇవ్వమంటే పాత మంచానికి రంగులు వేసి పంపిస్తారా.. ఈ పెళ్లి జరగదని తేల్చి చెప్పారు. పెళ్లి రోజు వివాహాన్ని రద్దు చేస్తే ఎలా అని  వధువు వారు బతిమాలినా వరుడు వినలేదు. దీంతో చేసేదేం లేక పెళ్లికూతురు తండ్రి చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇరు పక్షాలను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోవడంతో వరుడిపై 420 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement