అత్యధికంగా బండ్లగూడలో రూ. 1.87 కోట్లు పలికిన వినాయకుని లడ్డూ
బాలాపూర్ లడ్డూ రూ. 30.01 లక్షలు
గల్లీ నుంచి గేటెడ్ కమ్యూనిటీ వరకు వేలం పాటలు
సాక్షి, హైదరాబాద్/బడంగ్‌పేట్: భాగ్యనగరంలో గణేశ్ ప్రసాదం లడ్డూ వేలం పాట కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గణపతి ప్రసాదం సొంతం చేసుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో వేలాది మంది భక్తులు వేలం పాటలో పాల్గొన్నారు. రూ.లక్షలు దాటి రూ.కోట్లు పెట్టి మరీ సొంతం చేసుకున్నారు. రిచ్‌మండ్ విల్లాస్‌లో గత ఏడాది రికార్డు స్థాయిలో రూ.1.25 కోట్లకు లడ్డూ వేలం పాట జరగగా, ఈ ఏడాది అదే విల్లాస్‌లో ఆ రికార్డులను బ్రేక్ చేస్తూ ఆర్వీ దియా ట్రస్ట్ రూ.1.87 కోట్లకు లడ్డూను వేలంలో దక్కించుకుంది.
బాలాపూర్ లడ్డూ ప్రధానికి బహూకరిస్తా..
ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణేశ్ లడ్డూను బీజేపీ నేత, సింగిల్ విండో మాజీ చైర్మన్ కొలన్ శంకర్‌రెడ్డి దక్కించుకున్నారు. మంగళవారం ఉదయం మండపం నుంచి కదిలిన విఘ్నేశ్వరుడు గ్రామ బొడ్రాయి వద్దకు చేరుకున్న అనంతరం లడ్డూకు వేలం పాట నిర్వహించారు. లింగాల దశరథ్‌గౌడ్, సామ ప్రణీత్‌రెడ్డి, గీతాదేవి, కొలన్ శంకర్‌రెడ్డి మధ్య హోరాహోరీ పాట నడిచింది. చివరకు రూ.30,01,000 కొలన్ శంకర్‌రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. కాగా, బాలాపూర్ గణనాథుని లడ్డూను వేలంలో దక్కించుకోవడం సంతోషంగా ఉందని, ఈ లడ్డూని ప్రధాని మోదీకి బహూకరిస్తానని శంకర్‌రెడ్డి తెలిపారు.
లక్షల్లో వేలం పాటలు..
⇒ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఏర్పాటు చేసిన రచ్చబండ వినాయకుని లడ్డూను రూ.16.03 లక్షలకు పీఏసీఎస్ స్థానిక చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, సమత దంపతులు దక్కించుకున్నారు.
⇒ బడంగ్‌పేట్‌లోని వీరాంజనేయ భక్త సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని లడ్డూను రూ.11.90 లక్షలకు స్థానిక రైతు గౌర సత్తయ్య, అతని కుమారులు వీరయ్య, చంద్ర య్య, సురేశ్ కైవసం చేసుకున్నారు.
⇒ అత్తాపూర్ పోచమ్మ ఆలయం న్యూస్టార్స్ భక్త సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాధుని లడ్డూను ఏనుగుల సుభా‹Ùరెడ్డి రూ.11.16 లక్షలకు దక్కించుకున్నారు.
⇒ రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి శ్రీ వీరాంజనేయ భక్త సమాజం హనుమాన్ టెంపుల్ లడ్డూను పోరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి రూ.10 లక్షలకు కైవసం చేసుకున్నారు.
⇒ ఉప్పరపల్లి రెడ్డిబస్తీలో బొక్క ప్రశాంత్‌రెడ్డి రూ. 7.01 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు.
⇒ విజయపురి కాలనీ ఫేజ్–2లో త్రినేత్ర ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం దగ్గర లడ్డూను రూ.6.5 లక్షలకు ఒర్సు రాజు సొంతం చేసుకున్నారు.
⇒ కూకట్‌పల్లి వినాయక భక్త బృందం బీజేపీ ఆఫీస్ దగ్గర లడ్డువేలం వేయగా రూ.5.65 లక్షలకు రంభప్పగారి సందీప్‌రావు దక్కించుకున్నాడు.
సమాజ సేవలో రిచ్‌మండ్
⇒ ఏటా రికార్డు స్థాయిలో లడ్డూ వేలం పాట
⇒ ఈ ఏడాది 1.87 కోట్లతో రికార్డు
⇒ సామాజిక సేవలకు 48 ఎన్‌జీవోలతో ఒప్పందం..
⇒ క్రికెటర్ కపిల్‌దేవ్ సైతం ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్/బండ్లగూడ: గత రెండు, మూడేళ్లుగా రికార్డు స్థాయిలో లడ్డూ వేలం పాట పాడుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది రిచ్‌మండ్ విల్లాస్‌కు చెందిన ఆర్‌వీ దియా చారిటబుల్ ట్రస్టు. ఈ ఏడాది 1.87 కోట్లకు వేలం పాట పాడి రికార్డు నెలకొల్పింది. అసలు ఇంత మొత్తం డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది.. ఈ నిధులను ఏం చేస్తారనే ఆసక్తికరమైన వివరాలను తెలుసుకుందాం..
దాతల నుంచి సేకరించి..
సాధారణంగా వేలం పాట అంటే ఎవరో ఒక వ్యక్తి పాడి ఆ లడ్డూని దక్కించుకుంటారు. కాకపోతే రిచ్‌మండ్ అపార్ట్‌మెంట్‌కు చెందిన వారంతా నాలుగు గ్రూపులుగా విడిపోయి వేలం పాట పాడుతుంటారు. ఎక్కువ మొత్తం పాడిన ఒక గ్రూపు వాళ్లు వేలంలో గెలిచినట్టు ప్రకటిస్తారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే మిగిలిన గ్రూపుల వాళ్లు పాడిన మొత్తం కూడా వేలంలో కలిపేస్తారు. దీంతో భారీ మొత్తం సమకూరుతోంది. ఇక అపార్ట్‌మెంట్‌కు చెందిన వారితో పాటు విదేశాల్లో ఉన్న ట్రస్టు సభ్యుల స్నేహితులు, కుటుంబసభ్యులు కూడా ఈ వేలం పాటకు డబ్బులు ఇస్తారు.
2016 నుంచి..
2016లో రిచ్‌మండ్ విల్లాస్‌లో లడ్డూ వేలం ప్రారంభమైంది. అపార్ట్‌మెంట్‌లో పనిచేసే వారి పిల్లలను చదివించాలనే ఉద్దేశంతో క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు సేకరించి లడ్డూ వేలం ప్రారంభించారు. తొలిసారి రూ.25 వేలు పలికిన లడ్డూ.. ప్రతియేడూ పెరుగుతూ ఈ ఏడాది 1.87 కోట్లకు చేరింది. గతేడాది 1.2 కోట్లు సమకూరాయి. వేలం ద్వారా వచి్చన మొత్తం డబ్బును ట్రస్టు సభ్యులు సామాజిక సేవకే వినియోగిస్తున్నారు. ఈ ఏడాది 48 ఎన్‌జీవోలతో ఒప్పందం కుదుర్చుకుని, వారి ద్వారా అవసరాల్లో ఉన్న వారికి విద్య, వైద్యం అందజేసేందుకు ప్రణాళికలు రూపొందించారు.
చాలా గొప్ప పని: కపిల్‌దేవ్
ఆర్‌వీ దియా ట్రస్ట్ అద్భుతమైన పని చేస్తోందని ఇండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కితాబిచ్చారు. తాను నేరుగా వచ్చి కలవాలని అనుకున్నా కుదరలేదని పేర్కొంటూ ఆయన ఓ వీడియో సందేశం పంపారు. ఒకరోజు కచి్చతంగా వచ్చి నేరుగా ట్రస్ట్ సభ్యులను కలుస్తానంటూ ఆయన చెప్పారు.
ఒక్క రూపాయి తీసుకోం..
లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బులో నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోం. ప్రతి రూపాయి సామాజిక సేవ చేసేందుకే వినియోగిస్తాం. పేద వారికి చదువు, వైద్యం, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. గత ఎనిమిదేళ్లుగా నిరి్వరామంగా కొనసాగిస్తున్నాం. భవిష్యత్తులోనూ కొనసాగిస్తాం. – జీవన్‌రెడ్డి, ఆర్‌వీ దియా చారిటబుల్ ట్రస్టు
Comments
Please login to add a commentAdd a comment