పెళ్లిళ్ల సీజన్ ఒక్కసారిగా హాట్‌గా మారడానికి సిటీలో జరుగుతున్న హీరో అక్కినేని నాగ చైతన్య శోభితా ధూళిపాళల వివాహం ఓ రీజన్‌గా చెప్పొచ్చు. సిటీలో చాలా ఏళ్ల తర్వాత జరుగుతున్న టాప్ సెలబ్రిటీల వివాహ వేడుక కావడంతో వీరి పెళ్లి టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. మరోవైపు వధూవరుల దుస్తుల డిజైన్ చేసే ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారా అని సిటీ ఫ్యాషన్ సర్కిల్ ఆసక్తిగా ఎదురు చూసింది. అయితే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ.. శోభిత స్వయంగా తానే డిజైనర్‌గా మారినంత పనిచేసి మరీ తమ పెళ్లి దుస్తుల్ని శ్రద్ధగా రూపొందించుకోవడం విశేషం.
తన పెళ్లి వేడుకల్లో ధరించే దుస్తుల కోసం శోభిత ఏ ఫ్యాషన్ డిజైనర్‌నీ సంప్రదించడం లేదట. తన పెళ్లి దుస్తుల కోసం, ఆమె తల్లితో కలిసి షాపింగ్ చేశారనీ, బంగారు జరీ వర్క్‌తో కూడిన కంజీవరం చీరను ఎంపిక చేసుకున్నారని, మరో చీరను ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక నేత పనివారి ద్వారా తయారు చేయించారని సమాచారం. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధి పొందిన పొందూరు ఖాదీ చీరను కూడా ఆమె తీసుకున్నారట. ఈ దుస్తులను డిసెంబర్ 4న తన పెళ్లి వేడుకలో ఆమె ధరించనున్నారు.
దానితో పాటే చైతన్య కోసం కూడా ఒక మ్యాచింగ్ జతను ఎంచుకున్నారట. గతంలో మోడల్‌గా ర్యాంప్‌పై మెరిసిన శోభితకు ఫ్యాషన్ రంగంతో సన్నిహితంగా మెలిగిన అనుభవం ఉంది. అయితే ఆమె తన సంప్రదాయ నిశ్చితార్థ వేడుక కోసం మనీష్ మల్హోత్రా చీరను ధరించారు. మరోవైపు పెళ్లి వేడుకల్లో.. డిజైనర్ ఆభరణాలకు బదులుగా.. శోభిత వారసత్వంగా వచ్చిన ఆభరణాలను ధరిస్తున్నారు. వేడుక సందర్భంగా తన తల్లి, అమ్మమ్మ నుంచి వారసత్వంగా పొందిన ఆభరణాలతో తనను తాను అలంకరించుకున్నట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా భావోద్వేగాన్ని పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment