Calorie diet
-
ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ ఉండదిక
లండన్: ఒక పిజ్జా కొంటే రెండో పిజ్జా ఫ్రీ, ఒక బిర్యానీ కొంటే ఇంకో బిర్యానీ ఫ్రీ వంటి ఆఫర్లను మనం చూసే ఉంటాం. అయితే బ్రిటన్‌లో ఇలాంటి ఆఫర్లకు అడ్డుకట్ట పడబోతోంది. అంతేకాదు ప్రతి ఆహారం వల్ల ఎంత కేలరీల శక్తి వస్తుందో ఆయా వివరాలను కూడా రెస్టారెంట్లు మెనూలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న ఊబకాయాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇలాంటి ఆలోచనలు బ్రిటిష్ ప్రభుత్వానికి కొత్తేం కాదు. గతంలోనూ ఇలాంటి ఆలోచనలు చేశారు. అయితే ప్రస్తుతం కోవిడ్ కారణంగా కూర్చొని తినేవారి సంఖ్య పెరగడం, దాంతో ఊబకాయం కూడా పెరగడంతో ప్రభుత్వం ఈ దిశగా అడుగులేస్తోంది. ఐసీయూకు వచ్చే వారిలో 8 శాతం మంది ఊబకాయంతో ఉన్నవారేనని సమాచారం. యువకుల్లో మూడింటి రెండొంతుల మంది అధిక బరువుతో బాధ పడుతున్నారని, 28 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారని ప్రభుత్వం అంటోంది. బరువు తగ్గడం కష్టమే అయినా చిన్న చిన్న మార్పులతో ఫిట్‌గా ఉండొచ్చని ప్రధాని జాన్సన్ అన్నారు. -
బాటిల్లో భోజనం!
టెక్ టాక్ ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు రెండు వేల కేలరీల ఆహారం అవసరమని.. ఇందులో అన్ని రకాల విటమిన్లు, ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండాలని శాస్త్రం చెబుతోంది. మరి... ఇలాంటి ఆహారం ఎక్కడ దొరుకుతుందీ అంటే మా సూపర్ డ్రింక్ ట్రై చేయండి అంటోంది శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ‘ఆంపుల్ మీల్స్’ సంస్థ. ఆహారం పేరు చెప్పి డ్రింక్ గురించి చెబుతున్నారేమిటని ఆశ్చర్యపోకండి. ఇక్కడ అవి రెండూ ఒక్కటే. ఎందుకంటే ఆంపుల్మీల్స్ ఒకపూట భోజనంలో ఉండాల్సినన్ని ఆరోగ్యకరమైన అంశాలన్నింటినీ బాటిల్లోకి చేర్చేసింది మరి! మనం చేయాల్సిందల్లా ఈ బాటిల్లోకి కొన్ని నీళ్లు/పాలు చేర్చుకోవడం... బాగా కదిలించి గొంతులోకి దింపేసుకోవడమే! చిలగడదుంపల నుంచి గుమ్మడి విత్తనాల వరకూ పాలకూర నుంచి అరటిపండు వరకూ అన్ని రకాల ఆహార పదార్థాల్లోని పోషకాలను దీంట్లో మేళవించారు. కొవ్వుల కోసం ఏమేం కలిపారో, ప్రొటీన్ల కోసం వాడినవి ఏమిటో... ఈ బాటిల్‌పైన ఉంటాయి. మీ శారీరక అవసరాలను బట్టి 400, 600 కిలో కేలరీల విభాగాల్లో దొరుకుతోంది ఈ సూపర్ డ్రింక్. వంట తంటా లేకుండా ఆరోగ్యకరమైన ఆహారమన్నమాట!