calvert
-
మృత్యు పిలుపు.. ఆ మూలమలుపు!
సాక్షి,మోత్కూరు:మండలంలోని పాటిమట్ల గ్రామం శివారులో ఉన్న మూలమలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇక్కడ తరుచూ ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మోత్కూరు నుంచి పాటిమట్ల చెరువుకట్ట వరకు రూ.10 కోట్లతో డబుల్ బీటీ రోడ్డును నిర్మించారు. పాటిమట్ల బృందావన్ కల్వర్టుపై నిర్మించిన రక్షణ గోడలు సరైన ఎత్తులో లేకపోవడం, ప్రమాదాల హెచ్చరికల బోర్డులు లేక తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కల్వర్టు వద్దే మూలమలుపు ఉండటంతో వేగంగా వచ్చే వాహనాలు అదుపుతప్పి పల్టీ కొడుతున్నాయి. ఇటీవల డీసీఎం అదుపుతప్పి కాల్వలోకి పల్టీకొట్టింది. డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు. రెండు నెలల్లో పది ప్రమాదాలు.. రెండునెలల క్రితం పూర్తయిన డబుల్ బీటీ రోడ్డుపై ఇప్పటికి పది ప్రమాదాలు జరిగాయి. అయినప్పటికీ అర్అండ్బీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. రోడ్డుపై ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంపై ప్రయాణికులు, ప్రజలు విమర్శిస్తున్నారు. నిబంధనల ప్రకారం కాల్వర్టు నిర్మించకపోకపోవడం అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఈ నెల 4న మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం మోత్యాతండకు చెందిన ఇస్లావత్ సతీష్ అనే కారుడ్రైవర్ మూలమలుపు వద్ద కారు పల్టీకొట్టి అక్కడిక్కకడే మృతిచెందాడు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇలా రెండునెలల కాలంలో వాహనాలు అదుపుతప్పి సుమారు 50 మందికి పై చిలుకు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదాలు జరగకుండా రక్షణగోడలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. కల్వర్టు పక్కన కాల్వలో పల్టీకొట్టిన కారు. డీఈ వివరణ... ఈ విషయమై డీఈ షహనాజీని వివరణ కోరగా.. రహదారిపై మూలమలుపు వద్ద హెచ్చరిక బోర్డుల ఏర్పాటుకు టెండర్లు పిలిచామని తెలిపారు. ఎన్నికల అనంతరం పనులను పూర్తిచేస్తామన్నారు. రెండు నెలల్లో పది ప్రమాదాలు మూలమలుపు కల్వర్టు వద్ద, సమీపంలో సుమారు పది ప్రమాదాలు జరిగాయి. కార్లు, బైక్‌లు, ఆటోలు, డీసీఎంలు అదుపుతప్పి పలువురు గాయపడ్డారు. మా గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త లక్ష్మీనర్సింహారెడ్డి రెండు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. – బండ సంజీవరెడ్డి, పాటిమట్ల కల్వర్టు గోడ ఎత్తు పెంచాలి మూలమలుపు వద్ద బృందావన్ కాల్వపై నిర్మించిన కల్వర్టు గోడలకు ఇరువైపులా ఎత్తు పెంచాలి. సుమారు వందమీటర్ల దూరం ఇరువైపులా రక్షణ గోడ నిర్మించాలి. దీంతో ప్రమదాలను నివారించవచ్చు. –కుర్మెటి యాదయ్య , పాటిమట్ల -
ప్రయాణికులూ..జరజాగ్రత్త
కొండాపురం: మండలంలోని గంగాపురం వద్ద జాతీయ రహదారిపై కల్వర్టు సోమవారం కుంగిపోయింది. దీంతో ప్రయాణికులకు ఏ మూల నుంచి ముప్పు వస్తుందోనని భయాందోళన చెందుతున్నారు. గండికోట ప్రాజెక్టు కింద తాళ్లప్రొద్దుటూరు నుంచి మంగపట్నం గ్రామాల వరకు సూమారు 28 కిలోమీటర్లు జాతీయ రహదారి ముంపులోకి గురైంది. గండికోట ప్రాజెక్టులో 8.7 టీఎంసీల నీరు నిల్వ ఉన్న సమయంలో ఈ పాత రహదారి పూర్తిగా కృష్ణజలాలతో మునిగిపోయింది. ప్రత్యామ్నయంగా కె.సుగుమంచిపల్లె నుంచి శెట్టివారిపల్లె వరకు రూ.101. 35 కోట్లతో జాతీయరహదారిని ఏర్పాటు చేశారు. నీళ్లు ఉన్న సమయంలో కొత్త బైపాస్‌లో వాహనాలను అధికారులు మళ్లించారు. ఇటీవల గండికోట ప్రాజెక్టులో నీరు తగ్గడంతో పాత రూటులోనే అధికారులు వాహనాలను మళ్లించారు. ఈనేపథ్యంలో భయంతో ప్రయానం చేయాల్సి వస్తోందని ప్రయాణీకులు వాపోతున్నారు. కె.సుగుమంచిపల్లె సమీపంలో అడుగు అడుగున గుంతలు పడినా ప్యాచింగ్ పనులు చేయలేదని వాహనదారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత చౌటిపల్లె సమీపంలో చిత్రావతి వంతెన ఆరంభంలో బ్రిడ్జి కుంగింది. ఏ మూల నుంచి ప్రమాదం వాటిల్లుతుందోనని ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. వెంటనే ఉన్నతాదికారులు చొరవ చూపి ప్రమాదాలు జరగకుండా కొత్త బైపాస్ రోడ్డులో వాహనాలను మళ్లించాలని వాహనదారులు కోరుతున్నారు. -
నాపరాళ్ల లారీ బోల్తా
- డ్రైవర్, క్లీనర్‌ను కాపాడిన పోలీసులు ఆస్పరి: బిణిగేరి గ్రామం సుంకులమ్మ ఆలయ సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున ఓ లారీ బోల్తా పడింది. అనంతపురం నుంచి పూణేకు నాపరాళ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ టైరు పంక్చర్ కావడంతో అదుపు తప్పి కల్వర్టులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా దెబ్బతినగా.. అందులోని డ్రైవర్ పుల్లారెడ్డి, క్లీనర్ బాషా లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న ఆస్పరి ఎస్ఐ వెంకటరమణ వెంటనే ఆదోని అగ్నిమాపక సిబ్బందికి, 108కు సమాచారం ఇచ్చి ఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు గంటలు పాటు శ్రమించి అతి కష్టంపై డ్రైవర్, క్లీనర్‌ను బయటకు తీశారు. చికిత్స నిమిత్తం 108లో ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు వ్యక్తుల ప్రాణాలను కాపాడిన ఎస్ఐ, అగ్నిమాపక సిబ్బంది. 108 సిబ్బందిని పలువురు అభినందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
కల్వర్టును ఢీకొన్న బైక్, ఇద్దరి మృతి
కృష్ణా: కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం ముల్లపాడు క్రాస్ రోడ్డు వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న బైక్ ముల్లపాడు క్రాస్ రోడ్డు వద్ద కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. ముళ్లపాడుకు చెందిన కాళేశ్వరరావు(32), అవినాష్(22)గా గుర్తించారు. గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే, వారి బైక్ రోడ్డు పక్కన పడి ఉండగా మృతదేహాలు రెండు గుంతలో ఉన్నాయి. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.